Israel Hamas War: వారంలోగా హమాస్ – ఇజ్రాయెల్ మధ్య సంధి.. జో బైడెన్ కీలక ప్రకటన..
గాజాలో హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. దీంతో పెను ముప్పు పొంచి ఉన్న సమయంలో యుద్ధంలో చితికిపోతున్న గాజా జనానికి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తోంది. వచ్చే సోమవారం అంటే మార్చి 4వ తేదీ నాటికి రెండు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ వచ్చే అవకాశం ఉందన్నది బైడెన్ మాట.

గాజాలో హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. దీంతో పెను ముప్పు పొంచి ఉన్న సమయంలో యుద్ధంలో చితికిపోతున్న గాజా జనానికి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తోంది. వచ్చే సోమవారం అంటే మార్చి 4వ తేదీ నాటికి రెండు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ వచ్చే అవకాశం ఉందన్నది బైడెన్ మాట. ఖతర్‌లో ఇజ్రాయెల్-గాజా దేశాల ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయని… వీలైనంత త్వరలో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు తనతో చెప్పారన్నది ఆయన మాటల సారాంశం. అయితే ఇప్పటి వరకు ఒక నిర్దిష్ట ఒప్పందం ఏదీ కుదరలేదని బైడెన్ చెప్పారు. అయితే ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌కు ముందే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బైడెన్ చెప్పినట్లు గాజాలో కాల్పుల విరమణ జరిగితే.. ఆకలి చావుల అంచున ఉన్న గాజా ప్రజల నోట్లో అమృతం పోసినట్టే. గాయాలకు మందుల్లేక… ఆస్పత్రుల్లో అల్లాడుతున్న క్షతగాత్రుల ప్రాణాలకు ఆశలు కల్పించినట్టే.
కాల్పుల విరమణ తాత్కాలికం కావచ్చు… షరతులు వర్తిస్తాయ్ అని ఎలుగెత్తి చెప్పొచ్చు. అయినా సరే… సరిహద్దుల ఆవలే ఆగిపోయిన సాయం… ఈవలకు రావాలని… కేవలం గాజా ప్రజలు మాత్రమే కాదు.. వారి కష్టాలు.. కన్నీళ్లను… ఆకలి బాధల్ని అక్కడే ఉండి కళ్లారా చూస్తున్న ఏమీ చేయలేకపోతున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కోరుకుంటున్నాయి. ఈ మానవీయ సంక్షోభానికి ఇకనైనా ముగింపు పలకాలన్నదే వారి ఆశ. అందుకే ఇప్పుడు బైడెన్ మాటలకు అంతటి విలువ.
సరిగ్గా 2023 అక్టోబర్ 7న ఈ దారుణ మారణ కాండకు బీజం పడింది. దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి 1200 మందిని చంపేయడం… 253 మందిని బంధీలుగా పట్టుకెళ్లడం ఇజ్రాయెల్ ఆగ్రహానికి అసలు కారణం. ఇప్పటి వరకు ఈ పరస్పర దాడుల్లో సుమారు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
