United Kingdom: బ్రిటన్‌లో కూలిన 200 ఏళ్లనాటి చెట్టు.. యువకుడు అరెస్ట్..

200 ఏళ్లకు పైగా వయసున్న ఈ చెట్టు సహజంగా కూలిందా.. లేక ఉద్దేశపూర్వకంగా కూల్చివేశా అనే  ప్రశ్న తలెత్తింది. అయితే అర్థరాత్రి వచ్చిన తుఫాను కారణంగా ఈ చెట్టు కూలిపోయిందని బ్రిటీష్ మీడియా కథనంలో పేర్కొంది. అయితే సంఘటన స్థలంలో ఉన్న జర్నలిస్టులు ఈ చెట్టు చుట్టూ తెల్లటి పెయింట్ గుర్తులు కనిపించాయని.. అంతేకాదు గొలుసు కట్టిన ఆనవాలు స్పష్టంగా కనిపించాయని.. కనుక ఈ చెట్టుని కట్ చేసినట్లు తెలుస్తోంది

United Kingdom: బ్రిటన్‌లో కూలిన 200 ఏళ్లనాటి చెట్టు.. యువకుడు అరెస్ట్..
Sycamore Gap
Follow us
Surya Kala

|

Updated on: Oct 01, 2023 | 9:37 AM

బ్రిటన్‌లో అతి పురాతన చెట్టు కూలిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ చెట్టు పేరు సైకమోర్ గ్యాప్. ప్రసిద్దిగాంచిన చెట్టు కూలిన కేసులో 16 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఈ చెట్టు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హడ్రియన్ గోడ పక్కన ఉంది. ఈ చెట్టుకు రోమన్ పాలకుడు హాడ్రియన్ పేరు పెట్టారు. వాస్తవానికి ఈ చెట్టు అసలు వయస్సు ఎవరికీ తెలియదు. అయితే స్థానిక మీడియా నివేదికల్లో ఈ చెట్టు వయసు 200 నుండి 300 సంవత్సరాలు ఉండవచ్చు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చెట్టును నరికివేయడం బ్రిటన్‌లో కలకలం సృష్టించింది. అంతేకాదు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో చెట్టు స్పెషాలిటీ ఏముందననే ప్రశ్న పలువురిలో తలెత్తింది.

రాబిన్ హుడ్ చెట్టు?

1991లో రిలీజైన రాబిన్ హుడ్‌ సినిమాలో ఈ చెట్టు కనిపిస్తుంది. ఈ సినిమాలో కెవిన్ కాస్ట్నర్ నటించాడు. అప్పటి నుంచి ఈ చెట్టుని రాబిన్ హుడ్ ట్రీ అని కూడా పిలుస్తారు. వందల సంవత్సరాల వయస్సు ఉన్న ఈ చెట్టు బ్రిటన్‌లో పర్యాటక కేంద్రంగా కూడా మారింది. ఈ చెట్టుని చూడడానికి వెళ్లే ప్రజలు దీని చిత్రాన్ని తీసుకుంటారు. ఈ చెట్టు అందాలను ప్రశంసిస్తారు.

ఇవి కూడా చదవండి

మెట్రో నివేదిక ప్రకారం గత కొన్నేళ్లుగా ఈ చెట్టు నిర్వహణ భాద్యతలను నార్తంబర్‌ల్యాండ్ నేషనల్ పార్క్,  నేషనల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. 2016లో ఇంగ్లిష్ ట్రీ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించబడింది.

చెట్టు పడిపోయిందా లేదా నరికేసారా

200 ఏళ్లకు పైగా వయసున్న ఈ చెట్టు సహజంగా కూలిందా.. లేక ఉద్దేశపూర్వకంగా కూల్చివేశా అనే  ప్రశ్న తలెత్తింది. అయితే అర్థరాత్రి వచ్చిన తుఫాను కారణంగా ఈ చెట్టు కూలిపోయిందని బ్రిటీష్ మీడియా కథనంలో పేర్కొంది. అయితే సంఘటన స్థలంలో ఉన్న జర్నలిస్టులు ఈ చెట్టు చుట్టూ తెల్లటి పెయింట్ గుర్తులు కనిపించాయని.. అంతేకాదు గొలుసు కట్టిన ఆనవాలు స్పష్టంగా కనిపించాయని.. కనుక ఈ చెట్టుని కట్ చేసినట్లు తెలుస్తోంది అంటూ AFP నివేదిక తెలిపింది. నార్తంబర్‌ల్యాండ్ నేషనల్ పార్క్ అథారిటీ కూడా  గురువారం ఈ చెట్టును ఉద్దేశపూర్వకంగా నరికివేసినట్లు ధృవీకరించింది. బ్రిటన్‌కు చెందిన ఈ చెట్టు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ చెట్టుని కూల్చివేసేందుకు ఒక యువకుడిని అరెస్టు చేశారు.

అలాంటి చెట్టు మళ్లీ పెరుగుతుందా

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మళ్లీ ఇలాంటి చెట్టు పెరుగుతుందా అనే ప్రశ్న పలువురితో తలెత్తుతోంది. ఇదే విషయంపై నేషనల్ ట్రస్ట్ మాట్లాడుతూ.. ఈ చెట్టు విత్తనాలు, ఈ చెట్టు కొమ్మలను సేకరించి చెట్టును తిరిగి అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. అయితే.. పాత చెట్టును పోలి ఉండదని స్పష్టం చేశారు. అయితే ఈ చెట్టు కూలిపోవడంతో ప్రజలు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. చెట్టుకు సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దీంతో పాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ అలాంటి చెట్టును పెంచడం కష్టమని కూడా చెబుతున్నారు. అయితే అరెస్టయిన నిందితుడిని చెట్టు కాల్చివేయడానికి గల కారణాలపై విచారిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..