యుక్రెయిన్ యుద్దంలో ఫ్రైడే భేటీ కీలకం.. అగ్రనేతల చర్చలతో యుద్దం ఆగే సంకేతం..మరి పుతిన్ మాటేంటి?

ఇంటర్నేషనల్ కోర్టు ఆదేశాలను రష్యా ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ చేస్తున్న దీనాతిదీనమైన ప్రకటనలు.. రాజీకి సిద్దమన్నట్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు పుతిన్‌ని ఏ మాత్రం కరిగించడం లేదు.

యుక్రెయిన్ యుద్దంలో ఫ్రైడే భేటీ కీలకం.. అగ్రనేతల చర్చలతో యుద్దం ఆగే సంకేతం..మరి పుతిన్ మాటేంటి?
Ukraine war latest updates
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 17, 2022 | 10:53 PM

UKRAINE WAR UPDATES BIDEN XI JINPING FRIDAY MEET: అంతర్జాతీయ న్యాయస్థానం గట్టిగా గర్జించినా పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. యుక్రెయిన్ దేశంలో గత 22 రోజులుగా కొనసాగిస్తున్న విధ్వంసం తీవ్రతను మార్చి 17న మరింత పెంచింది రష్యాన్ మిలిటరీ. ఇంటర్నేషనల్ కోర్టు ఆదేశాలను రష్యా ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ(Volodymyr Zelenskyy) చేస్తున్న దీనాతిదీనమైన ప్రకటనలు.. రాజీకి సిద్దమన్నట్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు పుతిన్‌ని ఏ మాత్రం కరిగించడం లేదు. నాటో(Nato)లో చేరే విషయంలో వెనక్కి తగ్గడంతోపాటు రష్యా చేస్తున్న డిమాండ్లలో దాదాపు అన్నింటికి జెలెన్స్కీ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నప్పటికీ పుతిన్ వాటిని విశ్వసించడం లేదన్నట్లుగా దూకుడుతో దురాక్రమణను కొనసాగిస్తూనే వున్నాడు. తూర్పు యుక్రెయిన్ ప్రాంతాన్ని రష్యా పూర్తిగా విధ్వంసం చేసేసింది. యుక్రెయిన్ తూర్పుభాగంలో వున్న మరియాపోల్ సిటీ(Mariupol City)లో ప్రస్తుతం విధ్వంసకాండ కొనసాగుతోంది. గుడ్డిలో మెల్లగా అక్కడి యుక్రెయినియన్లు దేశం వీడేందుకు కొన్ని గంటలపాటు సేఫ్ ప్యాసేజ్ కలిపించింది రష్యా. ఆ తర్వాత దూకుడు పెంచిన రష్యా.. మరియాపోల్ నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసింది. ఇదివరకే ఖార్కీవ్ సిటీని నాశనం చేసిన రష్యా.. ఇపుడు యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని గుప్పిట్లోకి తీసుకునేందుకు సిద్దమైంది. గుండెకాయ లాంటి కీవ్ సిటీని కాపాడుకునేందుకు యుక్రెయిన్ మిలిటరీతోపాటు సామాన్యులు కూడా ఆయుధాలు చేపట్టి ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు. ఇదిలా వుంటే.. మరోవైపు పశ్చిమ యుక్రెయిన్ ఏరియాలోను రష్యా దాడులను కొనసాగిస్తోంది. పోలండ్ సరిహద్దులో వున్న ఎల్వీవ్ సిటీలో రష్యా బాంబు దాడులు నిర్వహించింది. యుద్ద ధర్మాన్ని కూడా విస్మరించిన రష్యా జనావాల ప్రాంతాలు, అపార్ట్‌మెంట్లపై కూడా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ కారణంగా రష్యా అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడినా వెనక్కి తగ్గడం లేదు.

కీవ్‌ టు చెక్సీ దాకా.. ఏ ప్రాంతాన్నీ వదలడం లేదు రష్యా. భీకర దాడులతో విరుచుకుపడుతోంది పుతిన్‌ సేన. నాన్‌స్టాప్‌ వార్‌ యుక్రెయిన్‌లో కల్లోలం సృష్టిస్తోంది. అందమైన ప్రదేశాలు.. చారిత్రక కట్టడాలు.. పర్యాటకుల కేరింతలతో ఎంతో ఆహ్లాదంగా ఉండే ఆ దేశంలో నేడు బాంబుల మోత మోగుతోంది. పెద్ద పెద్ద భవంతులు అగ్నికీలలకు ఆహుతవుతున్నాయి. వీధుల్లో శవాల గుట్టలు దర్శనమిస్తున్నాయి. రష్యా దాడులతో అల్లాడిపోతోన్న యుక్రెయిన్‌లో ఇప్పుడు ఎటుచూసినా కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. కీవ్ సిటీలోని 15 అంతస్తుల అపార్ట్‌మెంటుపై మార్చి 17న తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించింది రష్యా. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, వందలాది మంది లోపలే చిక్కుకుపోయారు. పొడిల్‌స్కీలో మరో 10 అంతస్తుల అపార్ట్‌మెంటుపైనా ఇలాంటి దాడే జరిగింది. నాటో కూటమిలోని పోలండ్‌, చెక్‌, స్లొవేకియా దేశాధినేతలు కీవ్‌ను సందర్శించిన నేపథ్యంలో రష్యా దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. యుద్ధం సృష్టించిన బీభత్సం చిన్నారులపై తీవ్రంగా పడింది. భయానక దృశ్యాలను చూసిన పిల్లలను, ఆ ఫీలింగ్‌ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు వ్యక్తులు. ఒక టీంగా ఏర్పడి, పిల్లల్లో ఉత్సాహం నింపుతున్నారు. యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. 22 రోజులుగా విరుచుకుపడుతున్నాయి పుతిన్‌ బలగాలు. కీవ్‌, ఖార్కివ్‌, ఖేర్సన్‌, మరియాపోల్‌పై భీకర దాడులు చేస్తున్నాయి. రష్యా ఆధీనంలో ఉన్న మరియాపోల్‌ ఆస్పత్రిలో..వైద్యులు, రోగులను నిర్బంధించింది రష్యన్ సైన్యం. ఈక్రమంలో యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్‌ చేశారు. దాడులకు ముందు యుక్రెయిన్‌ ఎలా ఉందో.. ఇప్పుడు ఎంతటి భయానక పరిస్థితుల్లో చిక్కుకుందనేది ఆ వీడియో కళ్లకు కడుతోంది. ధ్వంసమైన భవనాలు, ప్రజల ఆర్తనాదాలు, తల్లిదండ్రులను విడిచి పొరుగు దేశానికి ఏడుస్తూ వలస వెళుతున్న చిన్నారుల దుస్థితి, దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వందల మంది పౌరుల సామూహిక ఖననాలు వంటి హృదయ విదారక దృశ్యాలు కలచివేస్తున్నాయి.

అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించిన జెలెన్‌స్కీ.. ఈ వీడియోను అక్కడి ప్రతినిధుల ముందు ఈ వీడియోను ప్రదర్శించారు.‘‘ఒక్కసారి ఈ వీడియో చూడండి.. రష్యా సేనలు మా దేశంలో ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నాయో అర్థమవుతుంది’’ ఆయన తెలిపారు. ఇప్పటికైనా తమ దేశంపై నో ఫ్లై జోన్‌ ప్రకటించాలని ఆయన వేడుకున్నారు. ఈ వీడియోను చూసిన అమెరికా చట్టసభ ప్రతినిధులు కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. తమ గగనతలం మీద నో-ఫ్లయ్‌ జోన్‌ అమలు చేసేందుకు విముఖత వ్యక్తం చేసిన నాటోపై అసంతృప్తి వ్యక్తం చేశారు జెలెన్‌స్కీ. కొందరు దేశాధినేతలు రష్యాకు హిప్నటైజ్‌ అయ్యారని వ్యాఖ్యానించారు. నాటో కూటమిలో చేరబోమని మరోసారి స్పష్టం చేశారు జెలెన్‌స్కీ. ఈ వాస్తవాన్ని ప్రజలంతా అంగీకరించాలని కోరారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 13,500 మంది రష్యా సైనికులను చంపినట్లు యుక్రెయిన్ ప్రకటించింది. వందల సంఖ్యలో సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. రష్యా సేనలు దాడులు ఉద్ధృతం చేస్తున్న క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు రష్యా ప్రతీకార చర్యలు కూడా చేపట్టింది. యుక్రెయిన్‌కు మద్దతిస్తున్న బైడెన్, హిల్లరీక్లింటన్, ఇతర అమెరికా ఉన్నతాధికారులపై రష్యా ఆంక్షలు విధించింది. అటు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోపై కూడా రష్యా ఆంక్షలు విధించింది. 300మంది కెనడావాసులు రష్యాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. 23రోజులుగా యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగిస్తున్న రష్యా.. యుక్రెయిన్ రాజధాని కీవ్‌ను చేజిక్కించుకోలేకపోయింది. ఇంకోవైపు యుక్రెయిన్‌కు అండగా నిలుస్తున్న అమెరికా..మరో 800మిలియన్‌ డాలర్ల సైనిక సాయాన్ని ప్రకటించింది. యుక్రెయిన్‌కు మ‌రింత సాయం చేస్తామ‌ని..మ‌రిన్ని ఎయిర్‌క్రాఫ్టులు, ఆయుధాలు, డ్రోన్లు అందిస్తామ‌ని తెలిపారు అధ్యక్షుడు జో బైడెన్‌. పుతిన్‌ను ఉద్దేశించి యుద్ధ నేరస్తుడు అని వ్యాఖ్యానించారు.

ఇదంతా యుక్రెయిన్లో కొనసాగుతున్న దాడుల తీరు అయితే.. ఇంకోవైపు రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతూనే వుంది. మొదట్నించి ఈ ఆంక్షలను అస్సలు ఖాతరు చేయని రష్యా అదే విధానాన్ని 22 రోజుల తర్వాత కూడా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మార్చి 18 శుక్రవారం భేటీ కాబోతుండడం కాసింత ఊరట నిచ్చే అంశంగా అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు చెబుతున్నారు. రష్యాకు పరోక్షంగా మద్దతు ఇస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా.. యుక్రెయిన్‌కు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానుండడంతో రష్యాపై ఒత్తిడి పెరుగుతుందని పలువురు భావిస్తున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను సైతం పక్కకు నెట్టేసిన పుతిన్‌.. డ్రాగన్ దేశాధినేత మాట వింటారని జో బైడెన్ భావిస్తున్నారు. అందుకు కీలకమైన సమయంలో శిఖరాగ్ర భేటీకి బైడెన్ పావులు కదిపారని అంటున్నారు. నిజానికి అమెరికాతోపాటు పలు యూరోపియన్ దేశాల ఆంక్షలను రష్యా బేఖాతరు చేయడానికి ప్రధాన కారణం చైనాయేనని చాలా దేశాలు భావిస్తున్నాయి. యుక్రెయిన్ దేశం దాదాపు విధ్వంసం పాలైన సమయంలో యుద్దాన్ని విరమించాల్సిందిగా రష్యాపై ఒత్తిడి చేయించేందుకే చైనా అధ్యక్షునితో అమెరికన్ ప్రెసిడెంట్ భేటీ అవుతున్నారని పలువురు భావిస్తున్నారు.

యుక్రెయిన్‌పై రష్యా సైనిక దళాల భీకర దాడులు కొనసాగుతున్నాయి. యుక్రెయిన్‌ పౌరులను లక్ష్యంగా చేసుకొని రష్యన్ సైన్యం కాల్పులు జరుపుతోంది. లేటెస్ట్‌గా దాదాపు వేయి మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్న మరియాపోల్‌ థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయని తెలుస్తోంది. కానీ మృతుల సంఖ్య ఇంకా వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలోనే యుక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో చైనా, అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నాయని భావిస్తున్నారు. శుక్రవారం జో బైడెన్‌, జిన్‌పింగ్‌ మధ్య చర్చలు జరగబోతున్నట్టు అమెరికన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ వైట్ హౌజ్‌వ వెల్లడించింది. యుక్రెయిన్‌పై యుద్ధంలో పుతిన్‌కు చైనా సహకరించడం, ఆయుధ సామాగ్రి అందిస్తోందన్న అమెరికా ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరి మధ్య భేటీ జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. అంతకు ముందు జిన్‌పింగ్‌ నాటో విస్తరణను సైతం వ్యతిరేకించారు. విస్తరణలో భాగంగా యుక్రెయిన్ సహా కొన్ని దేశాలను తమ పంచన చేసుకుని వాటి సరిహద్దులో వున్న దేశాలను అమెరికా లక్ష్యంగా చేసుకునే వ్యూహం వుందని చైనా అనుమానిస్తోంది. ఇంకోవైపు.. యుక్రెయిన్‌లో యుద్ధం ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం రష్యాను ఆదేశించిన సంగతి తెలిసిందే. మాస్కో బలప్రయోగం పట్ల కూడా ఇంటర్నేషనల్ కోర్డు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కానీ, ఆ న్యాయస్థానం తీర్పును లెక్కచేయకుండా రష్యన్‌ బలగాలు దాడిని మరింత పెంచాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో జరగనున్న శిఖరాగ్ర భేటీ యుద్దం ముగింపునకు నాందీ పలుకుతుందని పలువురు భావిస్తున్నారు.