UK Election 2024: బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ గ్రాండ్‌ విక్టరీ…! రాజకీయాల్లోకి వచ్చిన 9ఏళ్లలోనే ప్రధానిగా కెయిర్​ స్టార్మర్

బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ గ్రాండ్‌ విక్టరీ...! 14 ఏళ్ల తరువాత, కన్సర్వేటివ్ పార్టీని చిత్తుగా ఓడించి లేబర్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. పార్టీని గెలుపు బాట పట్టించిన కెయిర్ స్టార్మర్(61) బ్రిటన్ తదుపరి ప్రధాని కానున్నారు. అయితే ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే భారత్‌​తో సంబంధాలపై కెయిర్ స్టార్మర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

UK Election 2024: బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ గ్రాండ్‌ విక్టరీ...! రాజకీయాల్లోకి వచ్చిన 9ఏళ్లలోనే ప్రధానిగా కెయిర్​ స్టార్మర్
Uk Pm Keir Starmer
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 05, 2024 | 9:06 PM

బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ గ్రాండ్‌ విక్టరీ…! 14 ఏళ్ల తరువాత, కన్సర్వేటివ్ పార్టీని చిత్తుగా ఓడించి లేబర్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. పార్టీని గెలుపు బాట పట్టించిన కెయిర్ స్టార్మర్(61) బ్రిటన్ తదుపరి ప్రధాని కానున్నారు. అయితే ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే భారత్‌​తో సంబంధాలపై కెయిర్ స్టార్మర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. అలాగే దేశ భద్రత, విద్య, సాంకేతికత, వాతావరణ మార్పు వంటి రంగాల్లో మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంతో భారత్- యూకే మధ్య మంచి బంధం ఏర్పడనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కన్జర్వేటీవ్‌ పార్టీకి బిగ్‌ షాక్ తగిలింది. 14 ఏళ్ల తర్వాత ఆ పార్టీ ఓటమిని చవిచూసింది. యూకే ప్రజలు లేబర్‌ పార్టీకి 412 స్థానాల్లో గెలిపించగా.. కన్జర్వేటివ్ పార్టీ మాత్రం కేవలం 121 స్థానాలకే పరిమితమైంది. దీంతో లేబర్ పార్టీ అధినేత కీర్‌ స్టార్మర్‌ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కన్జర్వేటీవ్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధానమంత్రి రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ అపజయానికి తానే బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల ఆగ్రహం తనను తాకిందంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అలాగే నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న కీర్‌ స్టార్మర్‌కు సునాక్‌ అభినందనలు తెలిపారు. ఆయన మంచి వ్యక్తి అని ప్రశంసించారు.

అధికారం శాంతియుతంగా చేతులు మారుతుందన్నారు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌, వేల్స్‌, నార్తర్న్ ఐర్లాండ్‌ వ్యాప్తంగా 650 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 326 సీట్ల మెజార్టీ రావాలి. అయితే 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ దూకుడుకు లేబర్ పార్టీ కళ్లెం వేసి మ్యాజిక్​ ఫిగర్‌ను అధిగమించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత లేబర్ పార్టీ అదృష్టాన్ని మార్చిన ఘనత స్టార్మర్ కు దక్కుతుంది. పార్టీపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ప్రజలకు లేబర్​ పార్టీ నేత కెయిర్​ స్టార్మర్ కృతజ్ఞతలు తెలిపారు. 14 ఏళ్ల తర్వాత ఈ దేశ భవిష్యత్తు మళ్లీ కన్పిస్తోందన్నారు.

అయితే రెండేళ్ల క్రితం తొలిసారిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రి పదవి చేపట్టి చరిత్ర సృష్టించారు. ఇటీవల ఆయన పాపులారిటీ క్రమంగా తగ్గుతూ వచ్చింది. వలసల కట్టడి, ఇత విషయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా సునాక్‌ వివాదాల్లో చిక్కుకున్నారు. ఇవన్నీ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించాయని విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.

ఇక కెయిర్ స్టార్మర్ విషయానికి వస్తే 1962 సెప్టెంబరు 2న జన్మించారు. ఆయన తండ్రి టూల్ మేకర్, తల్లి నర్సు. ఆమె అరుదైన వ్యాధితో ప్రాణాలు విడిచారు. కుటుంబంలో తొలిసారి యూనివర్సిటీకి వెళ్లింది స్టార్మరే. న్యాయ విద్యను అభ్యసించిన ఆయన చదువు పూర్తయిన తర్వాత 2003లో నార్తన్‌ ఐర్లాండ్‌ పోలీసులకు మానవహక్కుల సలహాదారుగా వ్యవహరించారు. ఐదేళ్ల తర్వాత లేబర్‌ పార్టీ నాయకుడు, ప్రధాని గార్డెన్‌ బ్రౌన్‌ హయాంలో ఇంగ్లాండ్‌, వేల్స్​కు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్​గా పనిచేశారు. ఆ సమయంలో నిధులను దుర్వినియోగం చేసే ఎంపీలు, ఫోన్‌ హ్యాకింగ్‌​కు పాల్పడిన జర్నలిస్టులకు శిక్షలు వేయించి వార్తల్లో నిలిచారు. 2015లో ఆయన ఎంపీగా గెలవడానికి కొద్ది నెలల ముందే తల్లి దూరమైంది. ఆ బాధను బిగపట్టి ప్రచారంలో పాల్గొన్నారు. స్టార్మర్​‌కు భార్య విక్టోరియా, ఇద్దరు పిల్లలున్నారు.

2015లో కెయిర్ స్టార్మర్‌ రాజకీయ అరంగ్రేటం చేశారు. 2015లో తొలిసారి ఉత్తర లండన్‌ నుంచి పార్లమెంట్​కు ఎన్నికయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించారు. ఆ మరుసటి ఏడాదే లేబర్‌ పార్టీ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఈ పార్టీ విజయం సాధించడం వల్ల ప్రధాని కాబోతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…