అధ్యక్ష పోటీలోకి ఆలస్యంగా వచ్చినా ఆకట్టుకున్న కమలా.. 248 ఏళ్ల యూఎస్ చరిత్రలో మహిళకు దక్కని అధ్యక్ష పీఠం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విక్టరీ సాధించినా కమలా హారిస్ పోరాటంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. అయితే 248 ఏళ్ల యూఎస్ చరిత్రలో మహిళకు ఇప్పటి వరకూ అధ్యక్ష పీఠం దక్కలేదు. మహిళా అధ్యక్షురాలిని అమెరికన్లు ఎన్నుకోలేదు. హిల్లరీ క్లింటన్ 2016లో ప్రెసిడెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కమలా హారీస్ ఆలస్యంగా అధ్యక్ష రేసులోకి వచ్చినా.. ట్రంప్ అండ్ కో కి చెమటలు పట్టించి మరీ స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ అమెరికన్ల హృదయాలను గెలుచుకున్నారు కమలాహారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని గెలచుకోగా.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ అమెరికన్ల హృదయాలను గెలుచుకున్నారు. అనూహ్యంగా అధ్యక్ష రేసులోకి వచ్చిన కమలాహారిస్.. తన క్యాంపెయిన్‌తో రిపబ్లికన్లకు దడపుట్టించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విక్టరీ సాధించినా కమలా హారిస్ పోరాటంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. కమలాహారిస్ పోరాట పటిమను ప్రపంచమంతా మెచ్చుకుంటుంది. డెమోక్రటిక్ అభ్యర్థిగా తొలి నుంచి కమలా హారిస్ పోటీలో ఉండి ఉంటే కచ్చితంగా విజయం సాధించేవారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అమెరికా చరిత్రలో ఎన్నికల రేసులో చాలా ఆలస్యంగా తప్పుకున్న మొదటి అధ్యక్షుడు జో బైడెన్. జూన్ 27 చర్చ తరువాత బైడెన్ తప్పుకోవాలన్న డిమాండ్ వచ్చినా ఆయన డెసిషన్ తీసుకోకుండా మూడు వారాలకు పైగా రేసులో ఉన్నారు. ఆ తర్వాత పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. బైడెన్ తప్పుకోవడంతో చివరి నిమిషంలో ప్రెసిడెంట్ రేస్‌లోకి వచ్చారు కమలాహారిస్.
ఆలస్యంగా అధ్యక్ష రేస్‌లోకి వచ్చినప్పటికీ క్యాంపెయిన్‌లో అదరగొట్టారు కమలాహారిస్. డిబేట్‌లో ట్రంప్‌నే షేక్ చేశారు. మెజారిటీ అమెరికన్ల మద్దతును పొందగలిగారు.క్యాంపెయిన్‌లో కమల దూకుడు.. ఓటర్ల నుంచి వచ్చిన స్పందన చూసి కమలాహారిస్ గెలుపు తథ్యమని సర్వేలు తేల్చేశాయి.
అమెరికా ఫస్ట్ నినాదం ట్రంప్‌కు కొంత కలిసివచ్చింది. చివరి నిమిషంలో డెమెక్రాటిక్ అభ్యర్థి మారడం కూడా ఆయనకు లాభం చేకూర్చింది. అలాగని ట్రంప్ అఖండ విజయమేమీ సాధించలేదు. ఆర్థిక వ్యవస్థ, ఇమిగ్రేషన్ అంశాలు, బైడెన్ వ్యవహారం, నల్లజాతీయురాలు కావడం కమలకు మైనస్ అయిందని చెబుతున్నారు విశ్లేషకులు. అయినా సరే ఆమె భారీగా ఓట్లు సాధించారు. అమెరికన్ల మనసు గెలుచుకున్నారు. స్వల్ప తేడాతోనే అధ్యక్ష పీఠాన్ని కోల్పోయారు.
248 ఏళ్ల అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటి వరకూ మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకోలేదు. అమెరికాలో మహిళలు ఓటు హక్కు పొందేందుకే అనేక సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది. 1920లో అమెరికా మహిళలకు ఓటు హక్కు లభించినప్పటికీ.. అది కొందరికే పరిమితమైంది. చివరకు 1960లో అన్ని వర్గాల మహిళలకు అమెరికాలో ఓటు హక్కు దక్కింది. ప్రెసిడెంట్ పీఠం కోసం కొందరు మహిళలు పోటీ పడినప్పటికీ.. విజయ తీరాలకు చేరుకోలేకపోయారు.
1964లో తొలిసారి మార్గరేట్ చేస్ స్మిత్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడ్డారు. కానీ అభ్యర్థిత్వమే దక్కలేదు. 1968లో షెల్లీ చిసమ్ తొలి నల్లజాతి మహిళా సెనెటర్‌గా ఎన్నికయ్యారు. 1972లో ఆమె డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. కానీ ఆమెకూ అభ్యర్థిత్వం దక్కలేదు. 1984లో తొలిసారిగా… డెమోక్రాటిక్ పార్టీ తరఫున గెరాల్డిన్ ఫెరారో… అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. కానీ ఓడిపోయారు.
ఇక హిల్లరీ క్లింటన్, కమలా హారిస్ ఇద్దరూ ట్రంప్ చేతిలోనే ఓడిపోయారు. 2016లో హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పీఠాన్ని చేజార్చుకున్నారు. అప్పటి ఎన్నికల్లో ట్రంప్ కంటే 30 లక్షల ఎక్కువ ఓట్లు సంపాదించారు హిల్లరీ. కానీ కీలకమైన ఎలక్టోరల్ కాలేజీలో మాత్రం ఆయన కంటే వెనుకబడిపోయారు. తాజాగా కమలా హారిస్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అయినప్పటికీ పాపులర్, ఎలక్టోరల్ ఓట్లలో వెనుకబడిపోవడంతో కమల ఓడిపోయారు. అయితే కమల అధ్యక్ష పీఠం దక్కించుకోకపోయినా ఆమె పోరాడిన తీరుకు అమెరికన్స్ ఫిదా అయిపోయారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..