Bangladesh: బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలు, షాపులపై దాడి..10 మంది అరెస్ట్.. అదుపులోకి వచ్చిన పరిస్థితి
బంగ్లాదేశ్ లోని ఖుల్నా జిల్లాలో నాలుగు హిందూ దేవాలయాలపైన, కొన్ని షాపులపైనా ఈ నెల 7 న దాడులు జరిగాయి. ఈ జిల్లాలోని షియాలీ గ్రామంలో హిందూ..ముస్లిముల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగిందని, దాంతో మరుసటి రోజున ఓ వర్గం ఈ దాడులకు...
బంగ్లాదేశ్ లోని ఖుల్నా జిల్లాలో నాలుగు హిందూ దేవాలయాలపైన, కొన్ని షాపులపైనా ఈ నెల 7 న దాడులు జరిగాయి. ఈ జిల్లాలోని షియాలీ గ్రామంలో హిందూ..ముస్లిముల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగిందని, దాంతో మరుసటి రోజున ఓ వర్గం ఈ దాడులకు దిగిందని పోలీసులు తెలిపారు. ఈ హింసాత్మక ఘటనకు సంబంధించి 10 మందిని అరెస్టు చేసినట్టు వారు చెప్పారు. ఆ ప్రాంతంలో మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఈ వర్గం వారు 10 దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారని, ఆరు షాపులతో బాటు హిందువులకు చెందిన రెండు ఇళ్లపై దాడి చేశారని మతపరమైన సంస్థకు చెందిన కృష్ణ గోపాల్ సేన్ అనే నేత తెలిపారు. ఈ గ్రామంలో ఓ మసీదు వద్ద ప్రార్థనలు జరుగుతుండగా హిందూ భక్త జన బృందమొకటి అదే ప్రాంతంలో ఆలయానికి భజనలు చేస్తూ వెళ్తున్న సమయంలో ఉభయ వర్గాల మధ్య మాటామాటా పెరిగిందని అయన చెప్పారు. ఇది మరుసటి రోజున హింసాత్మక ఘటనలకు దారి తీసిందన్నారు.
ఇటీవలే పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో రహీం యార్ ఖాన్ అనే జిల్లాలో కూడా హిందూ ఆలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనకు సంబంధించి 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 150 మందిపై కేసులు నమోదు చేశారు. పాక్ సుప్రీంకోర్టు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించడంతో ఈ అరెస్టులు జరిగాయి. అయితే బంగ్లాదేశ్ ఘటనపై ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి : తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.