WEF2024: ప్రపంచ వేదికపై మెరిసిన మన తెలంగాణ.. తెలంగాణ పెవిలియన్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్)లో తెలంగాణ పెవిలియన్ ప్రత్యేకతను చాటుకుంది. వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్ ట్యాగ్ లైన్‌తో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటేలా రూపొందించిన ఈ వేదిక అందరినీ ఆకర్షిస్తోంది. తెలంగాణ బతుకమ్మ, బోనాల పండుగలు, మన చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన చార్మినార్, మన కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్..

హైదరాబాద్, జనవరి 16: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్)లో తెలంగాణ పెవిలియన్ ప్రత్యేకతను చాటుకుంది. వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్ ట్యాగ్ లైన్‌తో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటేలా రూపొందించిన ఈ వేదిక అందరినీ ఆకర్షిస్తోంది. తెలంగాణ బతుకమ్మ, బోనాల పండుగలు, మన చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన చార్మినార్, మన కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, ఐటీ, సాంకేతిక ఆవిష్కరణల కొత్త సౌధం టీ హబ్, స్కైరూట్ ఏరోస్పేస్.. ఇలా విభిన్న రంగాల మేళవింపు ఉట్టిపడేలా తయారు చేసిన వాల్ డిజైనింగ్ ఈ పెవిలియన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు ప్రపంచానికి చాటిచెప్పటంతో పాటు.. ’ఇన్ వెస్ట్ ఇన్ తెలంగాణ’ పేరుతో ముస్తాబు చేసిన ఈ పెవిలియన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ’ప్రపంచంలోనే అపారమైన అవకాశాలున్న తెలంగాణ’, ‘పెట్టుబడులకు దేశంలోనే మొట్టమొదటి గమ్యస్థానం తెలంగాణ’ అనే నినాదాలు పెవిలియన్‌కు స్వాగతం పలుకుతున్నాయి.
భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు.. మీ కోసమే తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోర్డింగ్ ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకునేలా ఉంది. సంప్రదాయ మేళవింపుతో ఆవిష్కరణలు.. జీవ వైద్య రంగానికి డేటా సైన్స్ జోడీ, ప్రతిభను ప్రతిబింబించే సాంకేతికత, పరిశ్రమల నుంచి సమగ్రత.. స్థిరత్వం నుంచి ఆర్థిక వృద్ధి సిద్ధిస్తుందనే తెలంగాణకున్న అనుకూలతలు అన్నింటికి సంబంధించి దీనిపై ఇంగ్లిష్ కోట్స్‌లో ప్రదర్శించారు.
కాగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్వర్యలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా -2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఇది ప్రారంభం కానుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే (స్టేట్ హెల్త్ టెక్ ల్యాండ్ స్కేప్) సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. అనంతరం సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో టెక్నాలజీ కలయికతో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తెలంగాణకు విశిష్ట సహకారం అందించింది.
‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయి. అందుకే రెండింటి మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరింది. జీవన విధానాలు, జీవన నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిస్తే ప్రజల జీవితాలు బాగుపడుతాయనే ఆలోచనల సారూప్యతకు కట్టుబడి ఉన్నాం. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రపంచ స్థాయిలో పని చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజల ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘ప్రపంచ స్థాయిలో ఆరోగ్య సంరక్షణ విధానాలను సరికొత్తగా పునర్నిర్వించే ఆలోచనలున్నాయి. చిన్న పట్టణాలు, గ్రామాలకు ఈ సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం అన్నారు.
తెలంగాణలో C4IR..
5 ఖండాలలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (4IR) నెట్‌వర్క్ విస్తరించి ఉంది. C4IR తెలంగాణ సెంటర్ ప్రపంచంలో 19వది కావడం విశేషం. హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ నేపథ్యంతో ఉన్నమొదటి కేంద్రం హైదరాబాద్లోనే ప్రారంభమవనుంది. ఆసియాలోనే స్వయం ప్రతిపత్తి కలిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ హాట్‌స్పాట్‌గా పరిగణిస్తారు. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ కోసం పాలసీ, పాలనపై నాయకత్వం వహిస్తుంది.తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇంక్యుబేటర్ల ద్వారా రాబోయే 5 సంవత్సరాలలో 20,000 స్టార్టప్‌లపై ప్రభావం చూపాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో దాదాపు సగం మంది ఉద్యోగులు ఫార్మా, మెడ్‌టెక్ మరియు బయో టెక్నాలజీ రంగాలలో పని చేస్తున్నారు. హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ C4IR ఏర్పాటుతో ఆరోగ్య సంరక్షణలో కొత్త సాంకేతిక విధానాలు, కొత్త ఆవిష్కరణలకు వేధిక కానుంది. అలాగే మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




