Delhi Schools Reopen: రేపట్నుంచి మోగనున్న బడిగంటలు.. ఉదయం 9 గంటల నుంచి తరగతులు ప్రారంభం
రేపట్నుంచి దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలు తిరిగి తెరచుకోనున్నాయి. విద్యార్ధులు ఫిజికల్ క్లాస్‌లకు హాజరుకానున్నారు. అక్కడి శీతల వాతావరణం దృష్ట్యా పాఠశాల సమయాల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. అన్ని విద్యాసంస్థల్లో ఉదయం 9 గంటలకు బడి గంటలు మోగనున్నాయి. ఉదయం 9 గంటలకు ముందు ఏ పాఠశాల కూడా ప్రారంభంకాకూడదని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం వేళల్లో విద్యార్ధులను చలి నుంచి..
ఢిల్లీ, జనవరి 14: రేపట్నుంచి దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలు తిరిగి తెరచుకోనున్నాయి. విద్యార్ధులు ఫిజికల్ క్లాస్‌లకు హాజరుకానున్నారు. అక్కడి శీతల వాతావరణం దృష్ట్యా పాఠశాల సమయాల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. అన్ని విద్యాసంస్థల్లో ఉదయం 9 గంటలకు బడి గంటలు మోగనున్నాయి. ఉదయం 9 గంటలకు ముందు ఏ పాఠశాల కూడా ప్రారంభంకాకూడదని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం వేళల్లో విద్యార్ధులను చలి నుంచి కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత ఏ పాఠశాల పనిచేయకూడదని స్పష్టం చేసింది. సూర్యాస్తమయం అయ్యే కొద్దీ ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయని పేర్కొంది.
కాగా దేశ రాజధాని ఢిల్లీలో 3.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కనిపించింది. భారత వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు.. ఢిల్లీలో ఈ రోజు కనిష్ట ఉష్ణోగ్రత సీజన్ సగటు కంటే నాలుగు పాయింట్లు తక్కువగా నమోదైనట్లు వెల్లడించింది. రానున్న మరో రెండు రోజుల్లో దట్టమైన పొగమంచు, చలిగాలులు ఉంటాయని అంచనా వేసింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న చలిగాలులు, మంచు తీవ్రత వల్ల గాలి నాణ్యత కూడా పడిపోయింది. దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ అంతటా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జిఆర్‌ఎపి) స్టేజ్-III కింద కాలుష్య నిరోధక చర్యలు తక్షణం అమలులోకి తీసుకురావాలని కేంద్రం సూచించింది.
ఢిల్లీలోని అన్ని స్టోన్ క్రషర్లు, అన్ని మైనింగ్ ప్రాంతాలు, ఇందుకు సంబంధించిన ప్రాంతాల్లో జీఆర్‌ఏపీ స్టేజ్ 3 కింద ఆంక్షలు విధించారు. అలాగే నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలన్నింటినీ ఢిల్లీ అంతటా రద్దు చేసింది. అయితే నిర్దిష్ట ప్రాజెక్టులకు మాత్రం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. కాగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో సంక్రాంతి సెలవులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో జనవరి 17 వరకు, ఆంధ్రప్రదేశ్ లో జనవరి 18 వరకు సెలవులు ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.