Bengaluru CEO Case: బాలుడి మృతదేహం పక్కన దొరికిన లేఖ..! ‘నాకొడుకంటే నాకెంతో ఇష్టం.. అందుకే అలా చేశా’
నాలుగేళ్ల కుమారుడిని చంపి, శవాన్ని మాయం చేసేందుకు యత్నించిన బెంగళూరు సీఈవో కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొడుకును హత్య చేసి, సూట్‌కేసులో కుక్కి ట్యాక్సీలో కర్ణాటకకు బయల్దేరిన సుచనా సేథ్‌ను ట్యాక్సీ డ్రైవర్ సాయంతో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వద్ద ఉన్న సూట్‌కేసును సోదా చేసిన పోలీసులకు బాలుడి డెడ్ బాడీతో పాటు ఓ లెటర్ లభ్యమైనట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆ నోట్‌లో..
బెంగళూరు, జనవరి 12: నాలుగేళ్ల కుమారుడిని చంపి, శవాన్ని మాయం చేసేందుకు యత్నించిన బెంగళూరు సీఈవో కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొడుకును హత్య చేసి, సూట్‌కేసులో కుక్కి ట్యాక్సీలో కర్ణాటకకు బయల్దేరిన సుచనా సేథ్‌ను ట్యాక్సీ డ్రైవర్ సాయంతో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వద్ద ఉన్న సూట్‌కేసును సోదా చేసిన పోలీసులకు బాలుడి డెడ్ బాడీతో పాటు ఓ లెటర్ లభ్యమైనట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆ నోట్‌లో భర్తపై ఉన్న ధ్వేషాన్ని వెల్లగక్కింది. టిష్యూ పేపర్‌పై ఆమె ఐలైనర్‌తో ఈ లేఖ రాసింది. ఏం జరిగినా సరే కుమారుడు తన వద్దే ఉండాలని, కోర్టు విడాకులు మంజూరు చేసినా సరే.. కస్టడీ హక్కు తనకే దక్కాలని లేఖలో పేర్కొంది. చేతివ్రాత నిపుణుల పరీక్ష కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి లేఖను పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఆ నోట్ తన భర్త వెంకట్ రామన్‌పై ఆమెకున్న వ్యతిరేకత, భర్త రామన్‌ను పిల్లవాడిని కలవడానికి అనుమతించిన కోర్టు ఉత్తర్వులపై ఆమె ఎలా అసంతృప్తిగా ఉందనే విషయాన్ని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో విచారణ ముమ్మరం కావడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌లో 6 వేలకు పైగా బాలుడి ఫొటోలు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఆమె ఫోన్ నిండా కుమారుడి ఫొటోలే ఉన్నాయని పోలీసులు తెలిపారు. విచారణలో తన కొడుకును తానేంతో ప్రేమిస్తున్నట్లు సుచనా సేథ్ పోలీసులకు తెల్పింది. తన గోవా ప్రయాణం గురించి కూడా చెప్పింది. అయితే జనవరి 6 – 7 మధ్య ఏం జరిగిందనే విషయంపై మాత్రం ఆమె నోరు విప్పడం లేదు. ఆమె మానసిక, భావోధ్వేగ స్థితిని తెలుసుకోవడానికి గోవా పోలీసులు ఆమెకు మానసిక పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరోవైపు విచారణలో పాల్గొనవల్సిందిగా సుచనా సేథ్ తండ్రికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అందిన సమాచారం మేరకు సుచనా తల్లి ఏడాది క్రితం మరణించింది. ఆతర్వాత బెంగళూరులో నివాసం ఉంటోన్న సుచనా చాలాకాలంగా తండ్రికి దూరంగా ఉంటోంది
జనవరి 6, 7 తేదీల్లో గోవాలో ఉన్న ఆమె హత్య అనంతరం బాలుడి మృతదేహాన్ని సూట్‌కేసులో ఉంచి, ఆ లేఖను కూడా మృతదేహం పక్కన ఉంచింది. జనవరి 8న పోలీసులు ఆమె సూట్‌కేసును తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా బాలుడి మృతదేహంపై వస్త్రాలు, బొమ్మలు ఉంచి పైపై చూపించిందనీ, పోలీసులు సూట్‌కేస్ మొత్తం చూపించమని అడగ్గా బాలుడి మృతదేహం లభ్యమైందని తెలిపారు. ఆ మృతదేహం తన కొడుకుదని, తానే చంపానని పోలీసులకు తెల్పింది. కుమారుడితో గడిపేందుకు భర్తను కోర్టు అనుమతించడమే హత్యకు దారితీసిందని గోవా పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.