Taliban Challenges: తాలిబన్లకు ముందుంది ముసళ్ళ పండగ.. పరిపాలనలో ముష్కర మూకల ముందు పెను సవాళ్ళు.. ఇవేనా?

దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత అఫ్గానిస్తాన్‌పై పట్టు సాధించి.. 95 శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లకు ముందుంది ముసళ్ళ పండగ అంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. సాయుధ తాలిబన్ బలగాలకు అఫ్గాన్ సైన్యంలోని తొత్తులు తోడవడంతో...

Taliban Challenges: తాలిబన్లకు ముందుంది ముసళ్ళ పండగ.. పరిపాలనలో ముష్కర మూకల ముందు పెను సవాళ్ళు.. ఇవేనా?
Talibans
Follow us

|

Updated on: Aug 23, 2021 | 6:31 PM

Taliban Challenges in Afghanistan ruling: దౌర్జన్యం ఎంతో కాలం సాగదు. మోసం ఎంతో కాలం నిలవదు. రెండింటికీ ఎదురు దెబ్బ తప్పదు. ఇదే నిజమయ్యేలా వుంది ఆఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్ల విషయంలో. దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత అఫ్గానిస్తాన్‌పై పట్టు సాధించి.. 95 శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లకు ముందుంది ముసళ్ళ పండగ అంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. సాయుధ తాలిబన్ బలగాలకు అఫ్గాన్ సైన్యంలోని తొత్తులు తోడవడంతో ఆ దేశం తాలిబన్ల గుప్పిట చిక్కిన సంగతి తెలిసిందే. అటు అమెరికన్, నాటో దళాలు దేశం నుంచి నిష్క్రమించాయో లేదు.. ఇటు తాలిబన్లు తమదైన శైలిలో దేశంపై పట్టు సాధించారు. కేవలం పదంటే పది రోజుల్లో తమ రెడ్ ఆర్మీ దుందుడుకు పహారాలో తాలిబన్లు దేశ రాజధాని కాబూల్‌ని చుట్టు ముట్టాయి. అధ్యక్షుడు ఘనీ పలాయనం చిత్తగించడంతో తాలిబన్ నేతలు ఏకంగా అధ్యక్ష భవనాన్ని ఆక్రమించుకున్నారు. అద్భుత సౌధం అధ్యక్ష భవనాన్ని చిన్నపాటి హోటల్‌గా మార్చేశారు. నగరంలోని ఎమ్యూజ్‌మెంటు పార్కుల్లో చిన్న పిల్లల్లా సందడి చేశారు. ఇదంతా కొనసాగుతుండగానే.. తాలిబన్ల రాక్షస పాలనను గుర్తుకుచేసుకున్న వేలాది మంది ప్రజలు దేశాన్ని విడిచి వెళ్ళేందుకు సమాయత్తమయ్యారు. ప్రధాన ఎయిర్‌పోర్టులకు పెద్ద ఎత్తున పోటెత్తారు. మరీ ముఖ్యంగా కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకైతే ఇక చెప్పనవసరమే లేదు. వేలాది సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలతో కాబూల్ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. విమానాలు సరిపోకపోవడంతో ఎలాగైతే దేశాన్ని విడిచి పెట్టిపోవాలనుకున్న వారిలో కొందరు విమానం టైర్ల మీద ప్రయాణం చేసేందుకు దుస్సాహసం చేసి.. దుర్మరణం పాలయ్యారు. ఓ మహిళ విమానం ఫ్యాన్‌లో చిక్కుకుని మరణించడం, ఆమె శరీర భాగాలు చెల్లాచెదురుగా లభించడం పలువురిని కలచి వేసింది. అమెరికాకు చెందిన ఓ సైనిక విమానంలో ఏకంగా 823 మంది జర్మనీ వైపు ప్రయాణించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందులో ప్రయాణం చేసిన ఓ గర్భిణి.. విమానంలోనే పసికందుకు జన్మనిచ్చిన వార్త ప్రపంచ మీడియాలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఇదంతా ఓవైపు కొనసాగుతుండగానే.. కాబూల్ ఎయిర్‌పోర్టులో తొక్కిసలాట జరిగి.. ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఇంకోవైపు తాలిబన్ల ఆధిప్యతాన్ని సహించలేని కొన్ని సంస్థలు.. హిందూకుష్ ఏరియాలో తిరుగుబాటు ప్రారంభించాయి. హిందుకుష్ ఏరియాలో కొన్ని ప్రావిన్సులను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాయి. ఇది ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో తాజా పరిస్థితి. కానీ.. తాలిబన్లకు ముందు ముందు మరిన్ని సమస్యలు తప్పకపోవచ్చని.. దేశాన్ని ఏలాలన్న తాలిబన్ల కల నెరవేరడం అంత సులభం కాదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఆయుధాలను చేతబట్టి నాటో దళాలలను ఎదుర్కొవడం చేతగాక చాన్నాళ్ళుగా స్తబ్ధుగా వున్న తాలిబన్లు.. ఆ దళాల ఉపసంహరణ ప్రారంభం కాగానే పావులు కదిపారు. తుపాకులు చేతబట్టి.. బలహీనమైన అఫ్గాన్ సైన్యంపై దాడికి దిగారు. అఫ్గాన్ సైన్యంలో అప్పటికే తాలిబన్లకు తొత్తులుగా చాలా మంది మారిపోవడంతో అధ్యక్షుడు ఘనీకి పలాయనం చిత్తగించడం తప్ప మరో మార్గం కనిపించలేదు. దేశం మీద పట్టు సాధించడం సులువుగా సాధ్యమైన తాలిబన్లకు దేశాన్ని పాలించడంలో అంతగా అలవాటు లేదు. గతంలో అయిదేళ్ళు దేశాన్ని పరిపాలించినా.. వారు చేసిన దాంట్లో అకృత్యాలు, దారుణాలే అధికం. పరిపాలన అందించింది చాలా తక్కువ అనే చెప్పాలి. చెప్పుకోదగిన స్థాయిలో ఆధునిక సౌకర్యాలు లేని అఫ్గానిస్తాన్‌లో పరిపాలన సాగించడం తాలిబన్లకు కత్తిమీద సాముగా మారుతుందని పలువురు అంఛనా వేస్తున్నారు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు తగిన స్థాయిలో అధికార యంత్రాంగం కూడా ప్రస్తుతం ఆ దేశంలో లేదు. అంటే తాలిబన్లు తమ పరిపాలనను పునాదుల దగ్గరి నుంచి పునర్నిమించుకోవాల్సిందే అన్న మాట. అయితే.. దీనికి చాలా సమయమే పట్టే అవకాశం వుంది. గతంలో తాలిబన్లు అందించిన అరాచక పాలనపై ప్రజల్లో అసహనం తీవ్ర స్థాయిలో వుంది. తాలిబన్లు తమ పరిపాలన సరిదిద్దే క్రమంలో ప్రజల్లో తిరుగుబాటు రాదు అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

మరోవైపు తాలిబన్ సైన్యంలోను పలు లుకలుకలున్నాయి. విదేశీ శక్తులపై పోరాటం అనే భావనతో తాలిబన్ సైన్యాన్ని ఇంతకాలం ఒక్కతాటిపై వుంచింది. కానీ ప్రస్తుతం పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. దేశాన్ని హస్తగతం చేసుకునే దాకా ఒక్కటిగా వున్న తాలిబన్ సాయుధ దళాల్లో ఇపుడు చీలిక కనిపిస్తోంది. అందుకు కారణం తాలిబన్లలో ఓ వర్గం.. అధికార భోగాలను అనుభవిస్తుండడమే. ఇలా అధికార భోగాలను అనుభవిస్తున్న వారిలో కొందరు ప్రావిన్సులకు గవర్నర్లుగా పదవులు పొందే అవకాశాలు కూడా వున్నాయి. మరో వర్గం మాత్రం సాధారణ సైన్యంగా మిగిలిపోవడంతో వారిలో అసంతృప్తి పెరిగిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి కారణాలు తాలిబన్లలో చీలిక తీసుకువచ్చే అవకాశం లేకపోలేదు. ఇలా అసంతృప్తితో రగిలిపోయే వారు తిరుగుబాటు చేసే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. అపుడు తాలిబన్ పాలకులకు తమ సైన్యాన్ని ఒక్కతాటిపైకి తేవడం అంత సులభం కాదనే చెప్పుకోవాలి. అవలక్షణాలు పెరిగిపోతున్న వర్గాన్ని నియంత్రించడం.. అదే సమయంలో అసంతృప్తితో రగిలిపోతున్న వర్గాన్ని అనునయించడం అంత ఈజీ కాదంటున్నారు. పరిపాలనపై పట్టు సాధించడంలో బిజీగా వున్న సమయంలో తాలిబన్లలో చీలిక వస్తే అది ఎటైనా దారి తీయొచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం అఫ్గాన్ జనాభా సుమారు మూడు కోట్ల 80 లక్షలు. తాలిబన్ సైన్యం సంఖ్య లక్షకు లోపుగా వుంటుందని అంఛనా. దేశంలో కొన్ని ఏరియాలింకా తాలిబన్ల గుప్పిట్లోకి రాలేదు. మరోవైపు హిందుకుష్ ఏరియాలో తిరుగుబాటు మొదలైంది. కొన్ని ప్రాంతాలను తాలిబన్లు కోల్పోయినట్లు అప్పుడే కథనాలు మొదలయ్యాయి. అక్కడ భారీ సంఖ్యలో తాలిబన్లను తిరుగుబాటుదారులు హతమార్చారు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో స్థానిక భూస్వాముల ఆధిపత్యం కొనసాగుతూనే వుంది. వారంతా సొంతంగా ప్రైవేటు సైన్యాలను నిర్వహిస్తూ.. తమ ఏరియాల్లో పట్టు కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారిని అణిచివేసి.. దేశం మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవడం తాలిబన్లకు అతిపెద్ద సవాలేనని చెప్పాలి. అందుకు ప్రస్తుతం హిందుకుష్ ప్రాంతంపై పట్టు కోల్పోవడమే చక్కని ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈ దిశగా విజయం సాధించాలంటే తాలిబన్లు తమ బలగాలను పెట్టుకోవడంతోపాటు మరింత ఆయుధ సంపత్తిని పెంచుకోవాల్సి వుంటుంది. కానీ ప్రస్తుతం తాలిబన్లలో చేరేందుకు స్థానిక యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనికి పాకిస్తాన్ సహకారం ఏ మేరకు లభిస్తుందో తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది.

దేశంలో మహిళలు, మైనారిటీల్లో తాలిబన్లపై పట్ల ఆందోళన తీవ్రస్థాయిలో వుంది. అందుకే వీలైనంత త్వరగా దేశాన్ని వీడాలని వేలాది మంది అప్గాన్లు ప్రయత్నిస్తున్నారు. మహిళలు, మైనారిటీల పట్ల తాలిబన్లు కఠినంగా వ్యవహరిస్తారు. గతంలో అయిదేళ్ళ పాటు తాలిబన్లు కొనసాగించిన రాక్షస పాలనను ఎవరూ మరిచిపోలేదు. ఒకరకంగా చెప్పాలంటే తాలిబన్ల ఏలికలో అప్గానిస్తాన్ ప్రపంచంలో ఒంటరిగా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్ నేరుగాను.. చైనా, రష్యాలు పరోక్షంగాను తాలిబన్లకు మద్దతు పలుకుతున్నాయి. ఈక్రమంలో మైనారిటీల రక్షణ, మహిళల హక్కుల పరిరక్షణపై తాలిబన్లు పట్టువిడుపులు ప్రదర్శించకపోతే.. వారిని మచ్చిక చేసుకోవడం అసాధ్యం. అప్గానిస్తాన్‌లో ట్రైబల్ తెగలు పెద్ద సంఖ్యలో వున్నాయి. వాటిలో చాలా తెగలకు తాలిబన్లతో పడదు. వారిని మచ్చికచేసుకోవడం తాలిబన్లకు సాధ్యం కాదని పలువురు అంటున్నారు. ఇక దేశంలో మానవ హక్కులను కాపాడడం, మైనారిటీల హక్కులను గౌరవించడం, పౌరచట్టాలను అమలు చేయడం తాలిబన్ పాలకులకు పెద్ద సవాలుగా మారతాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఇక దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం తాలిబన్ పాలకుల ముందున్న అతిపెద్ద సవాలు అన్న విశ్లేషణలు ఇంటర్నేషనల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ప్రపంచంలో అతిపేద దేశాల్లో అప్గానిస్తాన్ ఒకటి. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అప్గానిస్తాన్‌కు పలు దేశాలు ఆర్థిక సాయం చేస్తున్నాయి. ప్రస్తుతం తాలిబన్ల పుణ్యమాని ఆ ఆర్థిక సాయం నిలిచిపోయింది. ఇంకోవైపు అప్గాన్ సెంట్రల్ బ్యాంకుకు చెందిన 9.5 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను అమెరికా ఫ్రీజ్ చేసేసింది. భవిష్యత్తులో అప్గానిస్తాన్‌కు ఎలాంటి రుణాలు ఇవ్వబోమని, ఇంకెలాంటి ఆర్థిక సాయం అందించబోమని ఐఎంఎఫ్ అధికారికంగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి అయితే ఏకంగా అప్గాన్‌ను బ్లాక్ లిస్టులో చేర్చేసింది. దాంతో విదేశాల పెట్టుబడులు అప్గాన్‌కు ఏ మాత్రం వచ్చే అవకాశాలు లేవు. దేశంలో వున్న ఖనిజ సంపద వున్నప్పటికీ వాటిని వెలికి తీసేందుకు విదేశాల సాయం అవసరం. ఈ విషయంలో పాకిస్తాన్, చైనా, రష్యాలపైనే తాలిబన్లు ఆశలు పెట్టుకున్నట్లు తాజా సమాచారం. కల్లోలిత అఫ్గానిస్తాన్‌లో సుపరిపాలన సంగతి అటుంచితే.. కనీసం సాధారణ పరిపాలన అందించడంలో కూడా తాలిబన్లకు పెద్ద పెద్ద సవాళ్ళు ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Latest Articles
రికార్డు స్థాయిలో పెరిగిన జీఎస్‎టీ వసూళ్లు.. కేంద్ర ఆర్థిక మంత్రి
రికార్డు స్థాయిలో పెరిగిన జీఎస్‎టీ వసూళ్లు.. కేంద్ర ఆర్థిక మంత్రి
అజిత్‌కు ఎంతో ఇష్టమైంది గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన షాలిని..
అజిత్‌కు ఎంతో ఇష్టమైంది గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన షాలిని..
50 ఏళ్ల అల్లూరి సీతారామరాజు.. ఈ విషయాలు తెలుసా..?
50 ఏళ్ల అల్లూరి సీతారామరాజు.. ఈ విషయాలు తెలుసా..?
మీమ్స్‌లో కనిపించే ఈ ర్యాపర్ గుర్తున్నాడా.? ఇప్పుడేం చేస్తున్నాడో
మీమ్స్‌లో కనిపించే ఈ ర్యాపర్ గుర్తున్నాడా.? ఇప్పుడేం చేస్తున్నాడో
రాముడు చుట్టూ తిరుగుతున్న కరీంనగర్ రాజకీయం..!
రాముడు చుట్టూ తిరుగుతున్న కరీంనగర్ రాజకీయం..!
ఆస్కార్ కోసం RRR ని ఆదర్శంగా తీసుకుంటున్న సినిమాలు
ఆస్కార్ కోసం RRR ని ఆదర్శంగా తీసుకుంటున్న సినిమాలు
ప్రజల ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..
ప్రజల ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..
పాన్ ఇండియా సినిమాల్లో... స్పెషల్‌ సాంగుల సంగతేంటి ??
పాన్ ఇండియా సినిమాల్లో... స్పెషల్‌ సాంగుల సంగతేంటి ??
6 రోజులుగా మూలనుంది.. కట్ చేస్తే. ఆర్డర్ పార్శిల్‌ నుంచి శబ్దాలు
6 రోజులుగా మూలనుంది.. కట్ చేస్తే. ఆర్డర్ పార్శిల్‌ నుంచి శబ్దాలు
మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ ట్రిక్ సహాయంతో ఎక్కువసేపు!
మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ ట్రిక్ సహాయంతో ఎక్కువసేపు!