Sri Lanka Student Protest: రావణకాష్టంలా శ్రీలంక.. అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ విద్యార్థుల ఆందోళన..
కొలంబోలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే రాజీనామా చేయాలంటూ అధ్యక్ష భవనం సమీపంలో విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి.
Sri Lanka student protest: శ్రీలంక దేశం గతంలో ఎన్నడూ లేని ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. ఈ క్రమంలో ప్రజా ఆగ్రహంతో ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ప్రధానిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. అయితే.. రాష్ట్రపతిగా మాజీ ప్రధాని సోదరుడు గొటబయ రాజపక్సేనే కొనసాగుతున్నారు. సభలో కూడా ఆయనకు పూర్తి మెజారిటీ రావడంతో రాజపక్సే రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు. ఆయన కూడా రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు, పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొలంబోలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే రాజీనామా చేయాలంటూ అధ్యక్ష భవనం సమీపంలో విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈ క్రమంలో వేలాది మంది విద్యార్థులు అధ్యక్షుడు భవనం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. వారిని నియంత్రించేందుకు వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పోలీసులపై విద్యార్థులు రాళ్ల దాడి చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనేకమంది విద్యార్థులకు గాయాలైనట్లు పేర్కొంటన్నారు. ఇంకా ఆందోళన కొనసాగుతుండటంతో భారీగా పోలీసులను మోహరించారు.
కాగా.. శ్రీలంకలో ఇంధనం నిండుకుంది. కిరోసిన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఆహార కొరత, భారీగా పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.