Serbian Roma girl band: పాటతో కదిలిస్తున్నారు.. దురాగతాలను ఎదిరిస్తున్నారు
సెర్బియా దేశంలోని ఆల్ గర్ల్స్ రోమా బ్యాండ్ తమ సంగీతంతో అనాదిగా వస్తోన్న దురాచారాలపై సమరభేరి మోగిస్తున్నారు. రోమా తెగ ప్రజలలో పేదరికం కారణంగా....
సెర్బియా దేశంలోని ఆల్ గర్ల్స్ రోమా బ్యాండ్ తమ సంగీతంతో అనాదిగా వస్తోన్న దురాచారాలపై సమరభేరి మోగిస్తున్నారు. రోమా తెగ ప్రజలలో పేదరికం కారణంగా బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. బాల్య వివాహాల నుంచి గృహహింస వరకు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పాటలుగా పాడి వినిపిస్తున్నారు. సమస్య గురించి మాట్లాడడమే కాదు వాటికి పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తున్నారు. బాల్యవివాహాలను అరికట్టడానికి సెర్బియన్ ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినా దాని వల్ల పెద్దగా ఫలితం లేదు. అయితే రోమా బ్యాండ్ ప్రచారం వల్ల ఆడ పిల్లల్లో గణనీయమైన మార్పు వస్తోంది. ‘మీకంటూ ఒక సొంత వ్యక్తిత్వం ఉంది. భవిష్యత్‌ను నిర్మించుకునే హక్కు పూర్తిగా మీదే’ లాంటి మాటలు వినే అమ్మాయిలకు మొదట ఆశ్చర్యంగా అనిపించేవి. ఆ తరువాత వాటి విలువను వారు గ్రహించడం మొదలుపెట్టారు. బ్యాండ్ ఇచ్చిన చైతన్యంతో చాలామంది అమ్మాయిలు బాల్యవివాహాలకు దూరంగా ఉంటూ చదువులపై దృష్టి కేంద్రీకరించారు. చిత్రమేమిటంటే ‘రోమా బ్యాండ్’లోని కొందరు సభ్యులకు కూడా తెలిసీ, తెలియని వయసులో వివాహాలు జరిగాయి. వారు తమ అనుభవాలను, ఎదుర్కొన్న కష్టాలను చెబుతుంటే వినేవారికి కంటతడి తప్పదు. అనుభవాన్ని మించిన జ్ఞానం ఏముంటుంది!
ర్యాప్ ఇంకా ఫోక్.. రెండూ మిళితం చేసి ఆకట్టుకుంటున్న ఈ ‘ఆల్–ఫిమేల్ బ్యాండ్’ సభ్యులు ఒకప్పుడు స్థానిక ‘బాయ్స్ బ్యాండ్’లో పనిచేసిన వాళ్లే. అక్కడ రకరకాలుగా అవమానాలు ఎదుర్కొన్నవారే. ‘ఎవరి కోసమో ఎందుకు మన కోసం మనం’ అంటూ ఆల్–ఫిమేల్ బ్యాండ్ మొదలు పెట్టారు. ‘ ఆడపిల్లల చైతన్యమే ’ ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నారు. ఒకప్పడు సెర్బియాకే పరిమితమైన బ్యాండ్ ఇటీవల లండన్ షోతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకుంది.
Also Read: ఏపీలో కొత్తగా 3,166 కరోనా పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా