Russia Ukraine Crisis: రష్యా కెమికల్ దాడులు చేస్తోంది.. పుతిన్ సేనలపై ఉక్రెయిన్ సంచలన ఆరోపణలు
Ukraine War News: ఉక్రెయిన్‌ను వశం చేసుకోవడానికి 27 రోజులుగా రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో రష్యా మరింత రెచ్చిపోతోంది.
Russia Ukraine War News: ఉక్రెయిన్‌ను వశం చేసుకోవడానికి 27 రోజులుగా రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో రష్యా మరింత రెచ్చిపోతోంది. ఉక్రెయిన్‌ను లొంగదీసుకునేందుకు రష్యా రసాయన ఆయుధాల(Chemical Weapons) దాడులు చేస్తోందని ఉక్రెయిన్ సంచలన ఆరోపణలు గుప్పించింది. రష్యా సేనలు ఫాస్ఫరస్‌ను ప్రయోగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. క్రామాటోస్క్‌లో రష్యా రసాయన బాంబులు ప్రయోగించినట్టు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. గతంలో ఇరాక్ యుద్ధ సమయంలో వీటిని అమెరికా ఉపయోగించింది. 1977 తరువాత ఈ బాంబులపై నిషేధం ఉంది.
ఉక్రెయిన్ ఆరోపణలతో ఏకీభవిస్తూ.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రసాయన ఆయుధాలు వాడాలని రష్యా యోచిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. అమెరికాకు యూరఫ్‌లో జీవ రసాయన ఆయుధాలు ఉన్నాయన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఉక్రెయిన్ చేత రసాయన ఆయుధాలు ఉన్నాయని పుతిన్ ఆరోపిస్తున్నారని.. ఆ దేశంపై రసాయన ఆయుధాలను వాడేందుకు రష్యా యోచిస్తున్నట్లు ఈ వ్యాఖ్యల ద్వారా తేటతెల్లం అవుతోందన్నారు.
ఇదిలా ఉండగా ఇటలీ పార్లమెంటునుద్దేశించి జెలెన్‌స్కీ వీడియో ద్వారా మాట్లాడారు. హంతకులకు ఆశ్రయం కల్పించొద్దంటూ కోరారు. రష్యన్ల ఆస్తులను సీజ్ చేయాలని కోరారు. అలాగే రష్యా నౌకలు తమ పోర్టులను వాడుకోకుండా ఇటలీ ఆంక్షలు విధించాలని కోరారు.
అటు ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై దాడులను మరింత ఉధృతం చేసింది రష్యా , రాజధాని కీవ్‌తో పాటు మారియాపోల్ , ఖేర్సన్ , ఖార్కీవ్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. అయితే ఈ దాడుల్లో చాలామంది సామాన్య పౌరులు చనిపోతునట్టు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యా దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. రష్యా నుంచి మాక్రీవ్ నగరాన్ని విముక్తి చేసినట్టు ఉక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటోలో తమ దేశాన్ని చేర్చుకుంటారా ? లేదా ? అని ప్రశ్నించారు. నిన్న మొన్నటిదాకా నాటో కూటమిలో చేరేది లేదన్న జెలెన్‌స్కీ ఇప్పడు మాట మార్చడం సంచలనం రేపుతోంది. రష్యాకు బయపడే నాటోలో తమకు సభ్యత్వం కల్పించడం లేదని ఆరోపించిన జెలెన్‌స్కీ.. ఇదే విషయాన్ని నాటో దేశాలు బహిరంగంగా చెబితే మంచిదంటూ తన అసహనాన్ని వెళ్లగక్కారు.
ఉక్రెయిన్ మౌలికవసతులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఖార్కీవ్‌లో మరో ఫ్యాక్టరీపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌లో షాపింగ్ మాల్‌లో ఆయుధాలు దాచిపెట్టారంటూ ఓ వ్యక్తి సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో…అలెర్ట్ అయిన తమ సైన్యం ఆ మాల్‌పై బాంబులు వేసినట్లు పుతిన్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
Also Read..