AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Declares Victory: రష్యా పాలనవైపే ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రజల మొగ్గు.. సూడో-రిఫరెండం అంటూ అమెరికా విమర్శలు..

ఉక్రెయిన్‌లోని రష్యా అక్రమిత భూభాగాల ప్రజలు మాస్కో పాలనవైపే మొగ్గు చూపారు. 95 శాతం ప్రజలు తాము రష్యాతో కలుస్తామని రెఫరెండంలో వెల్లడించారు. ఇది సూడో రెఫరెండమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. మోసపూరిత ప్రజాభిప్రాయ సేకరణను పశ్చిమ దేశాలు అంగీకరించబోవని అమెరికా వ్యాఖ్యానించింది.

Russia Declares Victory: రష్యా పాలనవైపే ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రజల మొగ్గు..  సూడో-రిఫరెండం అంటూ అమెరికా విమర్శలు..
Russia Referendum
Sanjay Kasula
|

Updated on: Sep 28, 2022 | 9:22 PM

Share

చివరకు తాను అనుకున్నది సాధించింది రష్యా. ఉక్రెయిన్‌లోని రష్యా అక్రమిత భూభాగాల్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఫలితాలు మాస్కోకు అనుకూలంగా వచ్చాయి. దాదాపు 95 శాతం ప్రజలు రష్యాలో విలీనం అవుతామని ఫలితాల రూపంలో వెల్లడించారు. లుహాన్స్క్‌, డొనెట్స్క్, జపోరిజియా, ఖేర్సన్‌ ప్రావిన్స్‌లలో సెప్టెంబర్‌ 23 నుంచి 25వ తేదీ వరకూ ఈ రెఫరెండం నిర్వహించారు.

డొనెట్స్క్‌లో అత్యధికంగా 99 శాతం ప్రజలు రష్యాలో విలీనానికి మొగ్గు చూపారు. లుహాన్స్క్‌లో 98 శాతం, జపోరిజియాలో 93 శాతం, ఖేర్సన్‌లో 87 శాతం రష్యాలో వినీనాన్ని కోరుకుంటున్నారు. రెఫరెండాన్ని నిర్వహించిన రష్యా ఎన్నికల అధికారులు ఈ ఫలితాలను వెల్లడించారు.

వాస్తవానికి లుహాన్స్క్‌, డొనెట్స్క్ ప్రావిన్సులు గత ఎనిమిదేళ్లుగా రష్యా అనుకూల వేర్పాటువాదుల చేతుల్లో ఉన్నాయి. ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా రావడంతో ఆక్రమిత భూభాగాలను విలీనం చేసుకోవడానికి పెద్దగా ఆటంకాలు లేవంటోంది రష్యా. ఈ విషయంలో అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటన చేసే అవకాశం ఉంది.

రష్యా ఆక్రమిత ప్రాంతాల్లోని ప్రజల్లో దాదాపు సగరం మంది పొరుగు దేశాలకు వలసపోయారు. మిగిలిన కొద్ది మంది ప్రజలతో బలవంతంగా ఓటేయించుకున్నారని విమర్శించారు మరియుపోల్‌ మేయర్‌ వాడిం బోయ్చెంకో.. ఈ నగరంలో గతంలో ఐదున్నర లక్షల మంది జనం ఉంటే ఇప్పుడు లక్ష మందే ఉన్నారు.

మరోవైపు రష్యా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలను సూడో-రిఫరెండంగా వ్యాఖ్యానించారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ఇక తాను రష్యాతో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. రష్యా సైనికులు తుపాకులతో ఇంటింటికీ వచ్చి ఉక్రెయిన్‌వాసులతో బలవంతంగా ఓట్లు వేయిస్తున్నారని నాటో దేశాలు ఆరోపించాయి.

ఉక్రెయిన్‌ భూభాగాన్ని రష్యా అక్రమంగా స్వాధీనం చేసుకోవడాన్ని పశ్చిమ దేశాలు గుర్తించబోవని అన్నారు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్.. రష్యా నిర్వహించిన మోసపూరిత ప్రజాభిప్రాయ సేకరణను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెడతామని UNలోని అమెరికా రాయబారి లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్ తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం