Russia Elections: మరోసారి సత్తా చాటిన వ్లాదిమిర్‌ పుతిన్‌ ‘డ్యూమా’కు జరిగిన ఎన్నికల్లో ‘యునైటెడ్‌ రష్యా పార్టీ’ ఘన విజయం

Russian parliament Elections 2021: రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి తన సత్తా చాటారు. పార్లమెంటు దిగువ సభ ‘డ్యూమా’కు తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార ‘యునైటెడ్‌ రష్యా పార్టీ’ ఘన విజయం సాధించింది.

Russia Elections: మరోసారి సత్తా చాటిన  వ్లాదిమిర్‌ పుతిన్‌  ‘డ్యూమా’కు జరిగిన ఎన్నికల్లో ‘యునైటెడ్‌ రష్యా పార్టీ’ ఘన విజయం
Vladimir Putin
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 21, 2021 | 2:08 PM

Russian parliament Elections: రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి తన సత్తా చాటారు. పార్లమెంటు దిగువ సభ ‘డ్యూమా’కు తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార ‘యునైటెడ్‌ రష్యా పార్టీ’ ఘన విజయం సాధించింది. దాదాపు 99% పోలింగ్‌ కేంద్రాల నుంచి ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ప్రాథమిక ఫలితాలను బట్టి పుతిన్ పార్టీ యునైటెడ్ రష్యా పార్టీకి దాదాపు 50 శాతం ఓట్లు, విపక్ష కమ్యూనిస్ట్ పార్టీకి దాదాపు 20 శాతం ఓట్లు లభించాయి. మరోవైపు, బ్యాలట్ బ్యాక్సుల్లో అక్రమాలకు పాల్పడ్డారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రష్యా ఎన్నికల్లో బలవంతంగా ఓట్లు వేయించారని, బ్యాలెట్లు తారుమారు చేశారని, మోసాలు జరిగాయని మండిపడ్డారు. కానీ, ఓటింగ్ ప్రక్రియలో అవతతవకలు జరిగాయనే ఆరోపణలను రష్యా ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది.

డ్యూమాలో మొత్తం 450 సీట్లు ఉంటాయి. వాటిలో సగం సీట్లను అంటే 225 దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో భర్తీ చేస్తారు. మిగిలిన సగం సీట్లకు అభ్యర్థులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ప్రస్తుతం రెండు విధానాల్లోనూ అధికార పార్టీ దూసుకెళ్తోంది. పోలైనవాటిలో 49.8% ఓట్లు దక్కించుకోవడం ద్వారా యునైటెడ్‌ రష్యా పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. 19% ఓట్లతో రష్యా కమ్యూనిస్టు పార్టీ రెండో స్థానంలో ఉంది. మరోవైపు- అభ్యర్థుల పరంగా చూసినా.. యునైటెడ్‌ రష్యా పార్టీ తరఫున పోటీ చేసిన వారు 198 స్థానాల్లో (225కుగాను) ఆధిక్యంలో కొనసాగుతున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.

దేశ రాజ్యాంగంలో మార్పులు చేసేందుకు అవసరమైన మెజారిటీ ఇప్పటికే యునైటెడ్‌ రష్యా పార్టీకి ఖాయమైందని ఎన్నికల కమిషన్‌ చీఫ్‌ ఎల్లా పామ్ఫిలోవా తెలిపారు. డ్యూమాలో మూడింట రెండొంతులకుపైగా ఆ పార్టీ వశమవనున్నట్లు చెప్పారు. తాజా ఎన్నికలతో రష్యాపై పుతిన్‌ పట్టు కొంత సడలొచ్చని తొలుత అంచనాలు వెలువడ్డాయి. ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. డ్యూమాలో ప్రతిపక్షమనేదే ఉండకపోవచ్చని తాజా ఫలితాలు సూచిస్తున్నాయి. యునైటెడ్‌ రష్యా పార్టీకి దక్కని ఇతర సీట్లలో ఎక్కువ భాగం.. ఆ పార్టీతో స్నేహపూరితంగా వ్యవహరించే పక్షాలకే దక్కాయి. రష్యాను యునైటెడ్‌ రష్యా పార్టీ దశాబ్దాలుగా ఏలుతోంది. పుతిన్‌ కనుసన్నల్లోనే అది నడుచుకుంటోంది.

అయితే 2018 నుంచి ఆయన.. పార్టీ తరఫున పోటీ చేయలేదు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంపై పుతిన్‌ ఇంకా స్పష్టతనివ్వలేదు. ఆయన తనను తాను జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకుంటారనే అంచనాలు ఉన్నాయి. ఆయన అభీష్టం ఏదైనాసరే.. రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా దాన్ని నెరవేర్చేందుకు అవసరమైన మెజారిటీ యునైటెడ్‌ రష్యా పార్టీకి ఉంది. మరోవైపు- అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడటం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. స్మార్ట్‌ ఓటింగ్‌ యాప్‌ వ్యూహంతో పాలక పార్టీని దెబ్బకొట్టేందుకు పుతిన్‌ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ వర్గం చేసిన యత్నాలు ఈ ఎన్నికల్లో ఫలించలేదు.

Read Also… Havana Syndrome: షాకింగ్.. హవానా సిండ్రోమ్ భారత్‌కు చేరిందా? అమెరికా ఇంటెలిజన్స్ అధికారికి సిండ్రోమ్ లక్షణాలు

Pelli SandaD: సూపర్ స్టార్ చేతుల మీదగా దర్శకేంద్రుడి ‘పెళ్లి సందD’ ట్రైలర్.. రిలీజ్ ఎప్పుడంటే..