I2U2 Summit 2022: నేడే పశ్చిమ ఆసియా తొలి క్వాడ్ సమావేశం.. పాల్గొననున్న ప్రధాని మోడీ, జో బైడెన్
ఐ2యూ2 సమావేశంలో ప్రధాని మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని యార్ లపిడ్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొననున్నారు.
I2U2 Summit 2022: భారత్, అమెరికా, ఇజ్రాయిల్, యూఏఈ దేశాల కూటమి I2U2 శిఖరాగ్ర తొలి సమావేశం ఈ రోజు జరగనుంది. ఈ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించనున్నారు. ఐ2యూ2 సమావేశంలో ప్రధాని మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని యార్ లపిడ్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొననున్నారు. కొత్త కూటమి ఐ2యూ2లోని ఈ నాలుగు దేశాల్లో మౌళిక సదుపాయాలు, ఆధునికీకరణ, ఆరు రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా ప్రధాన చర్చ జరగనుంది. ఐ2యూ2 కూటమిని పశ్చిమ ఆసియాకు క్వాడ్‌గా పిలుస్తారు. ఈ సమావేవంలో ముఖ్యంగా నీరు, శక్తి, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత వంటి ఆరు రంగాలలో ఉమ్మడి పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా I2U2ని స్థాపించారు. గతేడాది అక్టోబర్ 18న జరిగిన నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో I2U2 కూటమిని రూపొందించారు. ఇండియా, ఇజ్రాయిల్ దేశాల మొదటి ఆంగ్ల అక్షరాలు ‘I’, యూఎస్ఏ, యూఏఈ దేశాల మొదటి అక్షరాలు ‘U’లతో ఐ2యూ2 కూటమి స్థాపించారు. ఐ2యూ2 ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఈ దేశాల్లోని పరిశ్రమల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, తక్కువ కార్బన్ ఉద్గారాలకు సంబంధించి అభివృద్ధి మార్గాలను అన్వేషించడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపడచడం, ప్రైవేటు రంగంలో గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహిచడం, నైపుణ్యాలను సమీకరించాలనే ఉద్దేశంపై ఈ కూటమి ఏర్పడింది. ఈ దేశాల ఉమ్మడి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వర్చువల్‌గా నాలుగు దేశాల అధినేతల మధ్య సమావేశం జరగనుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..