Kim Jong Un: కిమ్ రూటే సపరేటు..! అంతటా న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుంటే.. అక్కడ మాత్రం..
ప్రపంచంలో ఎక్కడ చూసినా హ్యాపీ న్యూఇయర్ అనే మాటే వినిపిస్తోంది. 2023 మోడ్ లోకి యావత్ జగత్తు ఎంటరైంది. ఈ సారి న్యూఇయర్ వేడుకలు.. అంతకు మించి అనే రేంజ్‌లో జరిగాయి. తగ్గేదేలే అంటూ సంబరాలు అంబరాన్నంటాయి.
ప్రపంచంలో ఎక్కడ చూసినా హ్యాపీ న్యూఇయర్ అనే మాటే వినిపిస్తోంది. 2023 మోడ్ లోకి యావత్ జగత్తు ఎంటరైంది. ఈ సారి న్యూఇయర్ వేడుకలు.. అంతకు మించి అనే రేంజ్‌లో జరిగాయి. తగ్గేదేలే అంటూ సంబరాలు అంబరాన్నంటాయి. డీజే మోతలు.. జిగేల్ మనే లైట్లు.. బాణసంచా మెరుపులు.. కేక్ కటింగ్ లు ఇలా సంబరాలు ఘనంగా జరిగాయి. 2022 ఇక గతమే.. అంటూ 2023లోకి ఫుల్ జోష్‌తో గ్రాండ్ వెల్కమ్ చెప్పగా.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం అంతకు మించి అన్నట్లు విభిన్నంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. అన్ని దేశాల్లోని ప్రజలు అర్ధరాత్రి 12 గంటలకు ప్రజలు వీధుల్లోకి వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకోగా.. కిమ్ సామ్రాజ్యంలో మాత్రం తెల్లవారుజామున 2.50 గంటలకు నిప్పులు విరజిమ్ముతూ క్షిపణి ఆకాశంలోకి దూసుకెళ్లింది. కొత్త ఏడాది తొలి రోజున బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది.
ఉత్తర కొరియా రాజధాని ప్రాంతం నుంచి క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొరియా – జపాన్ మధ్య సముద్ర జలాల్లో పడిపోయే ముందు ఈ క్షిపణి దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించినట్లు దక్షిణ కొరియా అంచనా వేసింది. కిమ్ క్షిపణి ప్రయోగాన్ని దక్షిణ కొరియా తీవ్రంగా ఖండించింది. ఇది ముమ్మాటికీ ప్రపంచ శాంతి, భద్రతకు విఘాతం కలిగించే ప్రక్రియ అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. అగ్రరాజ్యం అమెరికా సాయంతో ఉత్తర కొరియా కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
కాగా.. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని చేపట్టిన ఉత్తర కొరియా.. ఈ ఏడాదిలో కూడా పెద్ద ఎత్తున ఆయుధ పరీక్షలు జరుపనున్నట్లు తెలిపింది. దేశంలో అణ్వస్త్రాల తయారీని కూడా భారీగా పెంచుతామని, పవర్‌ఫుల్ ఖండాంతర క్షిపణులను తయారు చేస్తామని కిమ్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శనివారం మూడు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు జరిపిన ఉత్తర కొరియా.. గత ఏడాది మొత్తం 70కి పైగా క్షిపణులను విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.