Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kim Jong-un: కిమ్‌ తిక్కకూ ఓ లెక్కుంది.. చైనా బయటపెట్టిన సంచలన నిజం..!

ఇంతకాలం నార్త్‌కొరియా అధ్యక్షుడు కిమ్‌ తలతిక్క అర్థం కాక జనం తికమకపడ్డారు. కానీ తిక్కకూ ఓ లెక్కుందని ఇప్పుడర్థం అవుతోంది. కిమ్‌ క్రిమినల్‌ మైండ్‌లో తొలుస్తోన్న పురుగు..

Kim Jong-un: కిమ్‌ తిక్కకూ ఓ లెక్కుంది.. చైనా బయటపెట్టిన సంచలన నిజం..!
Kim Jong Un
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 04, 2023 | 8:27 AM

ఇంతకాలం నార్త్‌కొరియా అధ్యక్షుడు కిమ్‌ తలతిక్క అర్థం కాక జనం తికమకపడ్డారు. కానీ తిక్కకూ ఓ లెక్కుందని ఇప్పుడర్థం అవుతోంది. కిమ్‌ క్రిమినల్‌ మైండ్‌లో తొలుస్తోన్న పురుగు.. సైబర్‌ దోపిడీ. కిమ్‌ అణ్వాయుధ ప్రయోగాలకు ఊతమిస్తోంది కూడా కిమ్‌ బుర్రలోని ఈ నేరప్రక్రియే. భారీ స్థాయిలో జరుగుతోన్న ఈ సైబర్‌ క్రైం ప్రక్రియే ఇప్పుడు ప్రపంచాన్నే హడలెత్తిస్తోంది.

నార్త్‌ కొరియా అధినేత కిమ్‌ నోరు తెరిస్తే వచ్చే ముందు మాట అణ్వాయుధ ప్రయోగం. ప్రపంచమంతా ఆర్థికంగా అల్లకల్లోలంగా మారిపోతే కిమ్‌ మాత్రం కిమ్మనకుండా తన అణ్వాయుధ ప్రయోగాలు యథేచ్ఛగా కొనసాగిస్తూనే ఉన్నాడు. జనానికి తిండి దొరక్క తిప్పలు పడుతోంటే.. ఈయనగారికి అంత డబ్బు ఎలా వచ్చిందన్నదే బిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఉత్తర కొరియాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో నిధుల కోసం కిమ్‌ క్రిప్టో కరెన్సీని వినియోగించడం మొదలుపెట్టాడు. అయితే ఇన్ని ఆంక్షల్లో ఆ దేశం ఎలా నెగ్గుకొస్తుందన్నది ఇప్పటివరకూ సస్పెన్స్‌ గా ఉంది. అయితే ఆ దేశాన్ని ఆర్థికంగా నిలబెడుతోంది కిమ్‌ సారథ్యంలోని ఓ దగాకోర్‌ ముఠాయేనని చైన్ ఎనాలసిస్‌ లేటెస్ట్‌ రిపోర్ట్‌ బట్టబయలు చేసింది. దీంతో ఇప్పుడు నార్త్‌ కొరియా దూకుడుకి కిమ్‌ దగాకోర్‌ దోపిడీ వ్యవహారమే కారణమన్న విషయం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఆంక్షల సంకెళ్ళ మధ్య కూడా ఉత్తర కొరియా నెగ్గుకొస్తోందంటే ఆ రహస్యం క్రిప్టో నేరాలదేనని చైన్ ఎనాలసిస్‌ తేల్చి చెప్పింది. కిమ్‌ ఆస్థానంలోని జాతిరత్నాల్లాంటి హ్యాకర్లు ఆ దేశపు అణ్వాస్త్ర ప్రయోగ దాహానికి అవసరమైన డబ్బుని సమకూరుస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. క్రిప్టో ఎక్స్‌ఛేంజిలోకి బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో చొరబడ్డ నార్త్‌కొరియా హ్యాకర్లు ఒకటి రెండు కాదు.. వేలకోట్ల క్రిప్టో కరెన్సీని తస్కరించేస్తున్నారు. క్రిప్టో కరెన్సీని దోచేస్తోన్న హ్యాకర్లలో సింహభాగం నార్త్‌కొరియా హ్యాకర్లదే.

గత ఏడాది మొత్తంలో హ్యాకర్లు కొల్లగొట్టిన మొత్తం 13.9వేల కోట్లరూపాయలు. అంటే ఉత్తర కొరియా హ్యాకర్లు 2022లో మొత్తం 1.7 బిలియన్‌ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీ దోచుకున్నట్టు చైన్ ఎనాలసిస్‌ నివేదికలో వెల్లడయ్యింది. ఉత్తర కొరియా క్రిప్టో దోపిడీయే కిమ్‌ ఆర్థిక బలంవెనుక అసలు కారణమని తెలుస్తోంది. గత సంవత్సరం మొత్తం 3.8 బిలియన్‌ డాలర్ల విలువైన క్రిప్టోలను హ్యాకర్లు దోచేయగా ఇందులో44 శాతం వాటా ఉత్తరకొరియా జాతిరత్నాలదేనట.

ఉత్తర కొరియా అణ్వాయుధ ప్రయోగాలు, ఇతర ఆర్థిక అవసరాలకోసం ఇలా మోసాల బాట పడుతున్నట్టు అంచనా వేస్తున్నారు. దోచుకున్న సొమ్ముతో అణ్వాయుధాలు, క్షిపణి ప్రయోగాలు తయారు చేస్తోందని ఐక్యరాజ్య సమితి పరిశోధక బృందం గతంలోనే వెల్లడించింది.

గత ఏడాది హారిజన్‌ బ్రిడ్జ్‌ అనే బ్లాక్‌ చైన్‌ నెట్‌వర్క్‌లో 100 మిలియన్‌ డాలర్ల విలువైన క్రిప్టోల దోపిడీ జరిగింది. అయితే ఈ దొంగతనానికి పాల్పడింది నార్త్‌కొరియాకి చెందిన లాజరస్‌ గ్రూపేనని అమెరికాలోని ఎఫ్‌బీఐ గతనెలలో ధృవీకరించింది. అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్‌ వేసిన కొత్త ఎత్తుగడ ఇది. ఇక ఆర్థిక సమస్యలతో సతమతమౌతోన్న దేశాలు కిమ్‌ బాటపడితే ఏమౌతుందోనని హడలిపోతున్నాయి ప్రపంచ దేశాలు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..