Monkeypox: అమెరికాను వణికిస్తున్న మంకీపాక్స్.. కేసుల కట్టడికి న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ..
న్యూయార్క్‌లో మంకీపాక్స్ (Monkeypox) వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఎమర్జెన్సీ విధించారు. అమెరికాలో ప్రతి నాలుగు మంకీపాక్స్ కేసుల్లో ఒకటి న్యూయార్క్‌లోనే నమోదవుతుందని గవర్నర్ హొచుల్ చెప్పారు.
New York Emergency: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. అత్యధికంగా అమెరికాలోనే కేసులు నమోదవుతున్నాయి. యూఎస్ లో న్యూయార్క్‌లోనే ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తాజా సమాచారం ప్రకారం.. శుక్రవారం న్యూయార్క్‌లో 1,345 మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి. తర్వాత స్థానంలో క్యాలిఫోర్నియా ఉంది. అక్కడ 799 కేసులు నమోదైనట్లు అమెరికా అధికారులు తెలిపారు. దీంతో న్యూయార్క్‌లో మంకీపాక్స్ (Monkeypox) వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఎమర్జెన్సీ విధించారు. అమెరికాలో ప్రతి నాలుగు మంకీపాక్స్ కేసుల్లో ఒకటి న్యూయార్క్‌లోనే నమోదవుతుందని గవర్నర్ హొచుల్ చెప్పారు. టెస్టింగ్‌ను ముమ్మరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సురక్షితంగా ఎలా ఉండాలన్న దానిపై న్యూయార్క్ వాసులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తామన్నారు. మంకీపాక్స్ నివారణకు తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కాగా.. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డేటా ప్రకారం.. అమెరికాలో మంకీపాక్స్ కేసులు 5,189కు పెరిగాయి. ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 22 వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, భారత్‌లో మొదటి మంకీపాక్స్ పేషెంట్ పూర్తిగా కోలుకుంటున్నాడు. కొన్నాళ్ల కిందట యూఏఈ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. అతనికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అతన్ని హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్‌మెంట్ అందించారు. దాంతో అతను పూర్తిగా కోలుకున్నాడని, పరీక్షలో నెగెటివ్ వచ్చిందని వైద్యాధికారులు చెప్పారు. త్వరలో అతన్ని డిశ్చార్జ్ చేస్తామన్నారు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్.
మంకీపాక్స్ వైరస్ వల్ల ఒంటిపైన వచ్చే దద్దుర్లు కూడా అతనికి పూర్తిగా తగ్గిపోయాయని చెప్పారు. కేరళలోనే మరో ఇద్దరు కూడా మంకీపాక్స్ బారినపడ్డారు. వీరు కూడా యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తులే. వాళ్లకి ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. ఇక మంకీపాక్స్ నాలుగో కేసును ఢిల్లీలో గుర్తించారు. ఆ వ్యక్తికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. మంకీపాక్స్ వల్ల మన దేశంలో మరణాలు సంభవించలేదని కేంద్రం ఆరోగ్య శాఖ పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం