AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morocco Earthquake: మొరాకోలో భూకంపం విధ్వసం.. 2000 మందికి పైగా మృతి.. రెస్క్యూ ఆపరేషన్ కు అంతరాయం..

భూకంపం కారణంగా అట్లాస్ పర్వతాల నుండి చారిత్రాత్మక నగరం మారాకేష్ వరకు అనేక నగరాల్లో,  గ్రామాల్లో భవనాలు పూర్తిగా లేదా పాక్షికంగా కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌, రోడ్డు కనెక్టివిటీ నిలిచిపోయింది. గత గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాంక్రీట్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా శిథిలాల నుంచి మృతదేహాలు మాత్రమే బయటకు వస్తున్నాయి. మరోవైపు శిధిలాల నుంచి రక్షించిన క్షతగాత్రులను తరలించేందుకు అంబులెన్స్‌లు వెళ్లలేని విధంగా రోడ్లపై రాళ్లు కూలిపోయాయి.

Morocco Earthquake: మొరాకోలో భూకంపం విధ్వసం.. 2000 మందికి పైగా మృతి.. రెస్క్యూ ఆపరేషన్ కు అంతరాయం..
Morocco Earthquake
Surya Kala
|

Updated on: Sep 10, 2023 | 8:14 AM

Share

ఉత్తర ఆఫ్రికాలో భూకంపం బీభత్సం సృష్టించింది. మొరాకో దేశంలోని అట్లాంటికా, మధ్యధరా సముద్ర తీరంలో శుక్రవారం అర్థరాత్రి  సంభవించిన ఈ భూకంపం తీవ్రత 6.8 గా నమోదైంది. రాత్రి సమయంలో భూకంపం ఏర్పడడంతో భారీగానే జన నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. భూకంపం వచ్చిన కొద్ది క్షణాల్లోనే ఆ ప్రాంతం అంతా అరుపులతో నిండిపోయింది. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు పరుగులు తీయడం కనిపించింది. ఈ భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ 2000 మంది చనిపోయారు. 750 మందికి పైగా గాయపడ్డారు. క్షత గాత్రుల్లో 205 మంది పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి రెస్క్యూ టీమ్ శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయితే రెస్క్యూ ఆపరేషన్‌లో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూకంపం సృష్టించిన విధ్వంసంతో మొరాకోలో మూడు రోజుల జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది అక్కడ ప్రభుత్వం.

భూకంపం కారణంగా అట్లాస్ పర్వతాల నుండి చారిత్రాత్మక నగరం మారాకేష్ వరకు అనేక నగరాల్లో,  గ్రామాల్లో భవనాలు పూర్తిగా లేదా పాక్షికంగా కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌, రోడ్డు కనెక్టివిటీ నిలిచిపోయింది. గత గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాంక్రీట్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా శిథిలాల నుంచి మృతదేహాలు మాత్రమే బయటకు వస్తున్నాయి. మరోవైపు శిధిలాల నుంచి రక్షించిన క్షతగాత్రులను తరలించేందుకు అంబులెన్స్‌లు వెళ్లలేని విధంగా రోడ్లపై రాళ్లు కూలిపోయాయి. దీంతో ముందుగా రెస్క్యూ టీమ్‌లు రోడ్లను శుభ్రపరిచి.. అంబులెన్స్ కు దారిని రెడీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి.

భూకంపం వచ్చిన వెంటనే మొరాకో సైన్యం, అత్యవసర సేవలు దెబ్బతిన్న ప్రాంతాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే చుట్టుపక్కల పర్వత ప్రాంతాలకు వెళ్లే రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. దీనితో పాటు అనేక పర్వత రాళ్ళు రహదారిపైకి వచ్చాయి.. దీని కారణంగా ఈ ప్రాంతాల్లో సహాయక చర్యలు మందగించాయి.

ఇవి కూడా చదవండి

మొరాకోలో భూకంపం సంభవించినప్పుడు, ప్రజలు షాపింగ్ కాంప్లెక్స్ , ప్లేగ్రౌండ్‌లో ఉన్నారు. భూమి కంపించడంతో ఒక్కసారిగా జనంలో తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు పరుగులు తీయడం మొదలుపెట్టారు. భయంతో ప్రజలు రాత్రంతా వీధుల్లోనే గడిపారు. ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది.  45 లక్షల జనాభాతో మొరాకో వాణిజ్య నగరమైన మరకేష్‌కు దక్షిణంగా 70 కి.మీ. దూరంలోని అల్ సౌద్ ప్రావిన్స్‌లో భూకంప కేంద్రం ఉంది. భూమికి 18 కి.మీ. లోతులో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 11 కి.మీ. లోతులో భూకంపం సంభవించినట్లు మొరాకో భూకంప పరిశోధన సంస్థ తెలిపింది. ఇంత లోతులో భూకంపాలు రావడం ప్రమాదకరమని నిపుణులు తెలిపారు. భూకంపం కారణంగా  మొరాకోలోని రెడ్ వాల్స్‌లోని కొన్ని భాగాలు కూడా దెబ్బతిన్నాయి. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.

మొరాకోలో సంభవించిన భూకంపం వల్ల ఎక్కువ ప్రభావం మరకేష్‌పై పడింది. ఈ నగరంలో కుప్పకూలిన భవనాలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నగరంలోని చారిత్రక కట్టడాలు, మసీదులు కూడా వణుకుతున్నాయి. 1960 తర్వాత మొరాకోలో సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే. క్షణాల్లో ఎత్తైన భవనాలు కూలిపోయాయి.

వాస్తవానికి దక్షిణ ఆఫ్రికాలో భూకంపాలు సాధారణంగా అరుదు. అయితే 1960లో మొరాకో నగరమైన అగాడేలో 5.3 తీవ్రతతో సంభవించిన భూకంపం.. వేలాది మంది ప్రాణాలు తీసింది. 2004లో 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 600 మంది మరణించారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ తీవ్రతతో  భయంకరమైన ప్రకంపన వచ్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..