Muhammad Ali Jinnah: పాకిస్తాన్‌లో మహమ్మద్ అలీ జిన్నా విగ్రహాన్ని పేల్చివేసిన బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు
బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్థాన్‌లోని గ్వదార్‌లో ఆ దేశ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా విగ్రహాన్ని బాంబులతో ధ్వంసం చేశారు. చట్టవిరుద్ధమైన బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ దీనికి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించింది.
Muhammad Ali Jinnah: బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్థాన్‌లోని గ్వదార్‌లో ఆ దేశ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా విగ్రహాన్ని బాంబులతో ధ్వంసం చేశారు. చట్టవిరుద్ధమైన బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ దీనికి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించింది. సేఫ్ జోన్ గా పరిగణించబడే మెరైన్ డ్రైవ్‌లో జూన్‌లో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. గ్వాదర్ కమిషనర్ మేజర్ (రిటైర్డ్) అబ్దుల్ కబీర్ ఖాన్ మాట్లాడుతూ, దాడి చేసినవారు పర్యాటకులుగా ఇక్కడకు వచ్చారని చెప్పారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది, అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. అయితే, ఆదివారం ఉదయం విగ్రహం కింద ఉంచిన పేలుడు పదార్థాలతో పేల్చివేశారని డాన్ వార్తాపత్రిక సోమవారం వెల్లడించింది.
పేలుడు ధాటికి విగ్రహం పూర్తిగా ధ్వంసమైంది. నిషేధిత తీవ్రవాద సంస్థ బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ ప్రతినిధి బాబ్‌గర్ బలోచ్ ట్విట్టర్‌లో పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు బిబిసి ఉర్దూ తెలిపింది. ఈ విషయంపై అత్యున్నత స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని, గ్వదర్ డిప్యూటీ కమిషనర్ మేజర్ (రిటైర్డ్) అబ్దుల్ కబీర్ ఖాన్ చెప్పినట్లు BBC ఉర్దూ పేర్కొంది. పేలుడు పదార్థాలను అమర్చడం ద్వారా జిన్నా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఉగ్రవాదులు పర్యాటకులుగా ఈ ప్రాంతంలోకి ప్రవేశించారని ఆయన చెప్పారు.
ఆయన చెబుతున్న వివరాల ప్రకారం, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు కానీ, ఒకటి లేదా రెండు రోజుల్లో విచారణ పూర్తవుతుంది. “మేము అన్ని కోణాల్లో ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాము. నిందితులను త్వరలో పట్టుకుంటాము,” అని ఆయన అన్నారు. “గ్వాదర్‌లోని ఖైద్-ఇ-అజామ్ విగ్రహాన్ని కూల్చివేయడం పాకిస్తాన్ భావజాలంపై దాడి. నేరస్థులను శిక్షించాలని నేను అధికారులను అభ్యర్థిస్తున్నాను.” అంటూ బలూచిస్తాన్ మాజీ హోంమంత్రి, ప్రస్తుత సెనేటర్ సర్ఫ్రాజ్ బుగ్తీ ట్వీట్ చేశారు.
ఇంతకు ముందు కూడా పాక్‌లోని పలు నగరాల్లో బలూచిస్తాన్ తిరుగుబాటు దారులు దాడులకు దిగారు. తమకు స్వాతంత్ర్యం కావాలని బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఇటువంటి దాడులకు తరుచు పాల్పడుతోంది. గతంలో స్టాక్ మార్కెట్‌పై కూడా దాడి జరిపింది బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఇతర ప్రాంతాల్లో కూడా బలూచ్ లిబరేషన్ దాడులకు దిగింది. ఇటీవల పాక్,చైనాల మధ్య జరుగుతున్న ఒప్పందాలపై కూడా బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ నేత గ్వర్హమ్ బలూచ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ భూభాగాన్ని పాక్ చైనా చేతిలో పెడుతుందని మండిపడ్డారు.
Also Read: Building Collapsed: హమ్మయ్య.. అంతా సేఫ్.. ఇలా బయటకు వచ్చారో లేదో కూలింది..