ISRAEL-PALESTINE WAR: మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు.. తగ్గేదే లేదంటున్న ఇజ్రాయిల్.. రంగంలోకి యుఎన్ఓ

పాలస్తీనా తీవ్రవాదులు ప్రారంభించిన దాడులు మధ్యప్రాచ్యంలో యుద్ద తీవ్రతను క్రమంగా పెంచుతున్నాయి. తీవ్రవాదుల దాడితో ఉలిక్కిపడిన ఇజ్రాయిల్ సైన్యం ప్రతి దాడులకు దిగడంతో ఇజ్రాయిల్, పాలస్తీనా...

ISRAEL-PALESTINE WAR: మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు.. తగ్గేదే లేదంటున్న ఇజ్రాయిల్.. రంగంలోకి యుఎన్ఓ
Israel
Rajesh Sharma

|

May 17, 2021 | 2:17 PM

ISRAEL-PALESTINE WAR CAUSING TENSION IN MIDDLE-EAST: పాలస్తీనా తీవ్రవాదులు ప్రారంభించిన దాడులు మధ్యప్రాచ్యంలో యుద్ద తీవ్రతను క్రమంగా పెంచుతున్నాయి. తీవ్రవాదుల దాడితో ఉలిక్కిపడిన ఇజ్రాయిల్ సైన్యం ప్రతి దాడులకు దిగడంతో ఇజ్రాయిల్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ మధ్య యుద్ధానికి తెరలేచింది. పాలస్తీనా హమాస్‌ తీవ్రవాద సంస్థపై ఇజ్రాయిల్‌ ఆగ్రహావేశం చల్లారడం లేదు. రెండు దేశాల మధ్య ఘర్షణలు ప్రారంభమై వారం దాటుతోంది. ఇప్పటి వరకు పరిస్థితులు ఏమాత్రం సద్ధుమణగ లేదు. పైగా మరింత తీవ్రమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇజ్రాయిల్‌ వైమానిక దాడులతో గాజా వణికిపోతుండగా.. హమాస్‌ రాకెట్‌ దాడులు ఇజ్రాయిల్‌ ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. గ‌త వారం రోజులుగా ఇజ్రాయిల్ సేన‌లు-హ‌మాస్ మిలిటెంట్ల మ‌ధ్య జ‌రుగుతున్న పోరువ‌ల్ల భారీగా ప్రాణ న‌ష్టం, ఆస్తి న‌ష్టం జ‌రిగింది. ఘర్షణలు ప్రారంభమైన తర్వాత గాజా చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజుగా మిగిలిపోయింది. ఇజ్రాయిల్‌ జరిపిన వైమానిక దాడుల్లో మే 16న ఒక్కరోజే గాజాలో ఏకంగా 42 మంది చనిపోయారు. వీరిలో 16 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపింది. దాడులు ప్రారంభమైన తర్వాత ఒక్కరోజే ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. మూడు భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. హమాస్ మిలిటెంట్‌ నాయ‌కులు త‌ల‌దాచుకున్న భ‌వ‌నాలే ల‌క్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఇజ్రాయిల్‌ దాడుల్లో ఇప్పటిదాకా 181 మంది పాలస్తీనావాసులు మరణించారు.

హమాస్ ఉగ్రముఠాకు చెందిన కీలక నేత యాహియే సిన్వర్‌కు చెందిన ఇంటిని నేలమట్టం చేసినట్లు ఇజ్రాయిల్‌ ప్రకటించింది. మరోవైపు గాజాపై తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు తేల్చి చెప్పారు. ఇప్పట్లో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని, గాజా మీద తమ వాయు సేన దాడుల్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పాలస్తీనా మిలిటెంట్లే యుద్ధాన్ని ఆరంభించారు. అవసరమైతే దాడుల్ని మరిన్ని రోజులు కొనసాగిస్తామని… వెనక్కి తగ్గేది లేదన్నారు.

ఇది ఇలా ఉంటే మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో పై పలు ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా ప్రత్యేకంగా భేటీ అయింది. ఇజ్రాయిల్‌ను శాంతి పరిచేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. మ‌రోవైపు కాల్పుల విరమణకు అంతర్జాతీయ సంస్థ‌లు త‌మ వంతు ప్రయత్నాలు ముమ్మ‌రం చేశాయి. తాజా దాడులకు ఒక మసీదు కారణమని పలువురు భావిస్తున్నారు. సదరు మసీదు ప్రాంతాన్ని ముస్లింలు, క్రిస్టియన్లు, యూదులు తమ పవిత్ర స్థలంగా భావిస్తారు. అలాంటి ప్రాంతానికి ముస్లిమేతరులను ప్రార్థనలకు అనుమతించకపోవడంతో ఉద్రిక్తతలకు తెరలేచింది. ఫలితంగా పాలస్తీనా ఉగ్రవాద సంస్థ దాడులు మొదలుపెట్టింది. ఈ దాడులకు ఎదురుదాడి ప్రారంభించిన ఇజ్రాయిల్ సైన్యం రాకెట్ దాడులు నిర్వహిస్తోంది. మిలిటెంట్లు లక్ష్యంగా రాకెట్ దాడులు జరుగుతున్నప్పటికీ ఆయా భవనాలకు సమీపంలో ఉన్న సామాన్యులు కూడా మృత్యువాత పడుతున్నారు. ఇందులో మహిళలు, చిన్నారులు ఉండటంపై పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మసీదు చరిత్ర ఇదే..

చినికిచినికి గాలివాన మారిన విధంగా ప్రస్తుతం ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య కొనసాగుతున్న రాకెట్ల దాడులు.. ఇకపై యుద్దంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ గొడవకు కారణమేంటి? ఈ విషయం ఇపుడు ఆసక్తి రేపుతోంది. జెరూసలెం లోని అల్-అఖ్సా మసీదు ప్రాంగణమే ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమని భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితంద పాలస్తీనా, ఇజ్రాయిల్ భద్రతా దళాల మధ్య ఈ పవిత్ర స్థలం దగ్గర ఘర్షణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు, క్రిస్టియన్లు, యూదులు అత్యంత పవత్రంగా భావించే పాత జెరూసలెంలో ఈ అల్-అఖ్సా మసీదు వుంటుంది. మూడు మతాల వారు దీనిని తమ పవిత్ర స్థలంగా భావిస్తారు. కాబట్టే యునెస్కో దీనికి ప్రత్యేక భద్రత కల్పించింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

అల్-అఖ్సా మాస్క్ ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటి. సుమారు 35 ఎకరాల భూమిలో నిర్మాణమైన అల్-అఖ్సా ప్రాంగణాన్ని ముస్లింలు హరామ్ అల్-షరీఫ్‌గా పిలుచుకుంటారు. యూదులు దీనిని టెంపుల్ ఆఫ్ మౌంట్‌గా భావిస్తారు. ముస్లింల విశ్వాసం ప్రకారం మహ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఇక్కడికి ఓ రాత్రి వచ్చి.. ప్రార్థనలు జరిపిన తర్వాత అవతార సమాప్తి చేశాడని ముస్లింలు భావిస్తారు. ఇక్కడ భారీ మసీదును ఎనిమిదో శతాబ్ధంలో నిర్మించారు. ఇక్కడ ఒకేసారి 5 వేల మంది ప్రార్థనలు నిర్మించుకునే వీలుంది. సెలవు రోజుల్లో భారీ సంఖ్యలో ముస్లింలు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు జరుపుకుంటారు. మసీదుపై గోల్డ్ కోటింగ్‌తో వున్న కప్పు ఈ మసీదును ప్రత్యేకంగా నిలబెడుతుంది.

ఇక యూదులు దీనిని టెంపుల్ మౌంట్‌ పేరిట ప్రత్యేక పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇక్కడ ఒకప్పుడు కొండ వుండేదని, దానిపై రెండు యూదు దేవాలయాలుండేవని చెప్పుకుంటారు. ఇందులో ఒకదానిని కింగ్ సాల్మన్ నిర్మించారని, దీని ప్రస్తావన బైబిల్‌లోను వుందని చెబుతారు. అయితే దీనిని బాబిలోనియన్లు కూల్చేశారని చరిత్ర చెబుతోంది. ఇక రెండోది 600 ఏళ్ళ క్రితం నిర్మాణమైంది. రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమైందని చరిత్రలో పేర్కొన్నారు. అయితే ఈ రెండు దేవాలయాలను మెస్సయ్య మళ్ళీ భూమ్మీదకు తిరిగి వచ్చి నిర్మిస్తాడని యూదులు విశ్వసిస్తారు.

తాజాగా ముస్లిమేతరులను ఈ అల్-అఖ్సా మసీదు ప్రాంగణంలో ప్రార్థనలకు అనుమతించడంలో వివక్ష చూపిస్తున్నారంటూ గొడవ మొదలైంది. ఇటీవల నిర్వహించిన జెరూసలెం డే పేరిట జరిపిన ఉత్సవాలు తాజా యుద్ధవాతావరణానికి ఆజ్యం పోసినట్లు భావిస్తున్నారు. జెరూసలెం టౌనును స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ అధికారికంగా జెరూసలెం డేను నిర్వహించింది. ఈ ఉత్సవాలు పాలస్తీనా ఉగ్రవాదులను రెచ్చగొట్టాయి. దాంతో ఇజ్రాయిల్ లక్ష్యంగా పాలస్తీనా ఉగ్రవాద సంస్థ దాడులు ప్రారంభించింది. దీనికి ధీటుగా ఇజ్రాయిల్ దాడులకు దిగడంతోపాటు.. వాటిని వైమానిక దాడులుగా మార్చడంతో ఇపుడు పూర్తిగా యుద్ధ వాతావరణంలోకి ఇజ్రాయిల్, పాలస్తీనా ప్రాంతం మారిపోయింది.

ALSO READ: అధికారంలో లేకున్నా అదే ఊపు.. జాతీయ రాజకీయాల్లో మాయావతి ప్రస్తుతం ట్రెండింగ్.. ఎందుకంటే?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu