WHO Report: ఎక్కువ గంటలు పని చేస్తే గుండెపోటు.. పదేళ్లలో పెరిగిన మరణాలు.. బాధితుల్లో పురుషులే అధికంః డబ్ల్యూహెచ్‌వో
సాధారణ పనిగంటల కంటే అధికంగా పని చేసేవారిలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం వెల్లడించింది.
WHO Report on Long Working Hours: సాధారణ పనిగంటల కంటే అధికంగా పని చేసేవారిలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం వెల్లడించింది. ఎక్కువ పని వేళలూ ప్రాణాంతకమని డబ్ల్యూహెచ్ వో హెచ్చరించింది. ఎక్కువ పని గంటల వల్ల ఏటా కొన్ని లక్షల మంది గుండె అర్థంతరంగా ఆగుతున్నట్లు వెల్లడించింది. కరోనా మహమ్మారి సమయంలో అది మరింత ముదిరే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా దీనిపై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో)తో కలిసి సంయుక్తంగా చేసిన అధ్యయన నివేదికను డబ్ల్యూహెచ్‌వో ఇవాళ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన సర్వే రిపోర్టును ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురించారు.
ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల గుండెపోటు, ఇతర గుండె సంబంధిత సమస్యలతో 2016లో 7.45 లక్షల మంది చనిపోయినట్టు పేర్కొంది. 2000వ సంవత్సరం నుంచి పోలిస్తే అది 30 శాతం ఎక్కువైందని వెల్లడించింది. అయితే, ఈ లెక్కన వారానికి 55 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ పనిచేసే వారిలో ఆరోగ్యానికి పెనుముప్పు తప్పదని డబ్ల్యూహెచ్ వో పర్యావరణ విభాగం డైరెక్టర్ మరియా నీరా హెచ్చరించారు.
ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో చనిపోతున్న వారిలో ఎక్కువగా పురుషులే ఉంటున్నారని ఆమె చెప్పారు. ఎక్కువ పనిగంటల వల్ల 72% మంది పురుషులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులోనూ ఎక్కువ మంది మధ్య వయస్కుల వారేనన్నారు. ఆగ్నేయాసియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలే ఎక్కువగా బాధితులున్నట్లు పేర్కొన్నారు. ఇది గత పదేళ్లల్లో 30 శాతం మేర పెరిగినట్లు నివేదికలో వెల్లడించారు. ముఖ్యంగా చైనా, జపాన్, అస్ట్రేలియా దేశాలకు చెందిన యువత ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో వివరించారు.
194 దేశాలపై చేసిన అధ్యయనంలో 55 కన్నా ఎక్కువ గంటలు పనిచేస్తున్న వారిలో గుండెపోటుతో మరణించే ముప్పు 35 శాతం ఎక్కువని తేల్చారు. హృదయ సంబంధ వ్యాధులతో చనిపోయే ముప్పు 17 శాతం అధికమని గుర్తించారు. 35 నుంచి 40 గంటల వరకు పనిచేసే వారితో పోలిస్తే ఎక్కువ గంటలు పనిచేసే వారికి ముప్పు ఎక్కువని తేల్చారు.
? WHO & @ilo analysis shows that working 55 hours or more per week impacts #WorkersHealth & increases risk of cardiovascular diseases.
Long working hours led to 745 000 deaths from #stroke & ischemic heart disease in 2016, a 2⃣9⃣% rise ↗️ since 2000.
? https://t.co/T3nuPX3nH7 pic.twitter.com/UW5XxbjWqo
— World Health Organization (WHO) (@WHO) May 17, 2021
ప్రపంచవ్యాప్తంగా 9 శాతం మంది ప్రజలు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని గుర్తించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ సహా సిబ్బంది అంతా ఎక్కువ సేపు పనిచేయాల్సి వస్తోందని, ఈ అధ్యయనం నేపథ్యంలో పని గంటలకు సంబంధించి కొత్త విధానాలను రూపొందిస్తామని నీరా చెప్పారు.
సంస్థలూ పని గంటలను తగ్గిస్తే ఆ సంస్థలకే మేలు జరుగుతుందని, ఇటీవలి అధ్యయనాల్లోనూ అది తేలిందని ఆమె గుర్తు చేశారు. 2000 నుంచి 2016 మధ్య గల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా ఉద్యోగుల ఆరోగ్యం కోసం తగు చర్యలు తీసుకుంటున్నామని ఆమె చెప్పారు.