Indonesia Earthquake: ఇండోనేషియాను వణికిస్తున్న విపత్తులు.. భారీ భూకంపం.. ఆరుగురు మృతి
Indonesia Earthquake: ఇండోనేషియాను భూకంపం మరోసారి వణికించింది. ఈ భూకంపం ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 12 మందికి
Indonesia Earthquake: ఇండోనేషియాను భూకంపం మరోసారి వణికించింది. ఈ భూకంపం ధాటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతోపాటు జావా దీవిలో ఉన్న సుమారు 300 లకు పైగా భవనాలు ధ్వంసమయ్యాయని, బాలి దీవిలోనూ ప్రకంపనలు సంభవించాయని ఇండోనేషియా విపత్తు అధికారులు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇండోనేషియా దక్షిణ తీరంలో 6.0 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
తూర్పు జావాలోని మలంగ్ నగరానికి నైరుతి దిశలో 45 కిలోమీటర్ల దూరంలో.. 82 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. సునామీ వచ్చే ప్రమాదం లేదని ఇండోనేషియా విపత్తు అధికారులు పేర్కొన్నారు. కాగా.. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారంతా ఎగువ ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుశాఖ అప్రమత్తం చేసింది. అయితే తాజాగా సంభవించిన భూకంపై సునామీ హెచ్చరికలేవీ విడుదల చేయలేదు.
ఇదిలాఉంటే.. ఇటీవలి కాలంలో ఇండోనేషియాను ప్రకృతి విపత్తులు వరుసగా కుదిపేస్తున్నాయి. వారం రోజుల క్రితమే కుండపోత వర్షాలు ఇండోనేషియాను కుదిపేశాయి. వరదల ధాటికి 170 మందికి పైగా మృతి చెందగా.. దాదాపు 50 మంది గల్లంతయ్యారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. అంతకుముందు సంభవించిన భూకంపాల్లో కూడా ప్రజలు భారీగా నష్టపోయారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా తూర్పు జావాలోని అనేక గ్రామాలను ఖాళీ చేయించినట్లు జాతీయ విపత్తు ఏజెన్సీ ప్రతినిధి రాదిత్య జాతి చెప్పారు.
Also Read: