Bangladesh violence: ఘర్షణలతో అట్టుడుకుతోన్న బంగ్లాదేశ్‌.. అప్రమత్తమైన ఇండియన్‌ ఎంబసీ

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించి.. ప్రతిభకు పట్టం కట్టాలని డిమాండ్‌తో బంగ్లాదేశ్‌ అట్టుడుకుతోంది. బంగ్లాదేశ్‌ ఘర్షణలతో మన దేశ పౌరులను ఇండియన్‌ ఎంబసీ అలెర్ట్‌ చేసింది. ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Bangladesh violence: ఘర్షణలతో అట్టుడుకుతోన్న బంగ్లాదేశ్‌.. అప్రమత్తమైన ఇండియన్‌ ఎంబసీ
Bangladesh Violence
Follow us

|

Updated on: Jul 19, 2024 | 6:59 AM

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించి.. ప్రతిభకు పట్టం కట్టాలని డిమాండ్‌తో బంగ్లాదేశ్‌ అట్టుడుకుతోంది. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లోని విశ్వవిద్యాలయాల్లో గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇవి కాస్తా హింసాత్మకంగా మారడంతో అక్కడి భారత పౌరులకు ఇండియన్‌ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత పౌరులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది భారత రాయబార కార్యాలయం. అనవసర ప్రయాణాలు చేయొద్దని.. బయటకు వెళ్లాల్సిన పరిస్థితులను వీలైనంత తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఎదురైతే సాయం కోసం వెంటనే బారత హై కమిషన్‌, అసిస్టెంట్‌ కమిషన్స్‌ను సంప్రదించాలని ఇండియన్‌ ఎంబసీ తమ అడ్వైజరీలో వెల్లడించింది. దాంతోపాటు.. 24 గంటల ఎమర్జెన్సీ నంబర్లను కూడా విడుదల చేసింది ఇండియన్‌ ఎంబసీ.

ఇక.. ప్రస్తుత కోటా విధానం ప్రకారం.. 1971లో బంగ్లాదేశ్‌ విముక్త పోరాటంలో అశువులు బాసిన వారి పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకు 30శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 10శాతం స్థానిక పరిపాలన జిల్లాల వారికి, 10శాతం మహిళలకు, 5శాతం మైనారిటీ తెగల వారికి, ఒక శాతం దివ్యాంగులకు ఇస్తున్నారు. ఈ పద్ధతిని సంస్కరించి.. ప్రతిభ ఆధారంగా మొదటి, రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ, బంగ్లాదేశ్‌లోని ప్రధాన నగరాలైన ఢాకా, రాజ్‌షాహీ, ఖుల్నా, చత్తోగ్రామ్‌లలో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటీవల ఆందోళనకారులకు, వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికార అవామీ లీగ్‌ పార్టీ విద్యార్థి సంఘాల నేతలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు మృతి చెందగా, 100 మందికిపైగా గాయపడ్డారు. దాంతో.. పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించి దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్తగా కళాశాలలు, పాఠశాలలు, మదర్సాలను మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ తెరవొద్దని సూచించారు. ఆందోళనలను ఉధృతం చేసే క్రమంలో.. నిన్న బంగ్లాదేశ్‌ బంద్‌కు పిలుపునిచ్చారు నిరసనకారులు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…