US VISA: అమెరికా భారతీయులకు వీసా కష్టాలు.. రెండు నెలలే టైమ్ ఉండటంతో..
ఆర్ధికసంక్షోభం , ఉద్యోగాల కోత కారణంగా అమెరికాలో ఉన్న భారతీయుల అవస్థలు రెట్టింపయ్యాయి. హెచ్-1 బీ వీసా ఉన్న వాళ్లు ఉద్యోగాలు కోల్పోతే రెండు నెలల్లో ఉద్యోగం సంపాదించాల్సిందే.
ఆర్ధికసంక్షోభం , ఉద్యోగాల కోత కారణంగా అమెరికాలో ఉన్న భారతీయుల అవస్థలు రెట్టింపయ్యాయి. హెచ్-1 బీ వీసా ఉన్న వాళ్లు ఉద్యోగాలు కోల్పోతే రెండు నెలల్లో ఉద్యోగం సంపాదించాల్సిందే. లేదంటే వాళ్ల వీసా స్టేటస్ మారుతుంది. హెచ్ -1 బీ వీసా టెంపరరీ విజిటర్ స్టేటస్‌కు మారిపోతుంది. అమెరికా చట్టాల ప్రకారం హెచ్-1 బీ వీసా కింద ఒక కంపెనీలో పని చేస్తునప్పుడు ఉద్యోగం కోల్పోతే మరో రెండు నెలల్లో మరో ఉద్యోగం వెతుక్కోవాల్సిందే.
కరోనా ప్రభావం , అధికధరల ప్రభావం , వడ్డీరేట్ల పెంపు కారణంగా ఆర్ధికమాంద్యంగా దిశగా అమెరికా పయనిస్తోంది. చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటివరకు లక్షా 50 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. గత నవంబర్ లోనే 51 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. టెక్ కంపెనీలు మాత్రమే కాకుండా ఇతర కంపెనీలు కూడా ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. హెచ్ -1 బీ వీసా ఉన్న వాళ్లు 60 రోజుల్లో ఉద్యోగాలు వెతుక్కోవాల్సిందే . లేదంటే వాళ్ల వీసా స్టేటస్ వెంటనే మారిపోతుంది.
వాస్తవానికి చాలా కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించారో వివరాలు వెల్లడించడం లేదు. అంతేకాకుండా కొత్త ఉద్యోగాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో హెచ్ 1-బీ వీసా ఉండి ఉద్యోగాలు కోల్పోయిన భారతీయుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకు రెండు నెలల్లో కొత్త ఉద్యోగాలు లభించడం చాలా కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికాలో ప్రస్తుతం 5 లక్షల మందికి హెచ్1-బీ వీసాలు ఉన్నాయి. వాళ్లలో ఎక్కువమంది ఇండియా , చైనా నుంచి వచ్చిన వాళ్లే. కొత్తగా అమెరికా ప్రభుత్వం జారీ చేసే 85 వేల హెచ్ 1-బీ వీసాల కోసం ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..