US Indian Girl: అదృశ్యమైన భారత సంతతి తన్వి క్షేమం.. 75 రోజుల తర్వాత దొరికిన జాడ..
అమెరికాలో అదృశ్యమైన ఎన్నారై బాలిక చివరిసారిగా జనవరి 17న కాన్వే జూనియర్ హైస్కూల్ సమీపంలో కనిపించింది. డేవిస్ స్ట్రీట్‌లో చివరిసారిగా కనిపించిన ప్రదేశం నుంచి చాలా మైళ్ల దూరం నడిచిన తర్వాత ఆమె జనవరి 22న కాన్సాస్ సిటీకి చేరుకుందన్నారు.
అమెరికాలో అదృశ్యమైన భారత సంతతి బాలిక క్షేమంగా ఉంది. 75 రోజుల తరువాత జాడ దొరికింది. ఫ్లోరిడాలో తన్వి సురక్షితంగా వున్నట్లు తెలుసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. టెక్ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న లే ఆఫ్‌ల మధ్య తన కుటుంబం ఎక్కడ దేశం నుంచి బహిష్కరించబడుతుందోననే భయంతో 15 ఏళ్ల తన్వి అర్కాన్సాస్‌లోని తన ఇంటి నుంచి పారిపోయిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ బాలిక చివరిసారిగా జనవరి 17న కాన్వే జూనియర్ హైస్కూల్ సమీపంలో కనిపించింది. డేవిస్ స్ట్రీట్‌లో చివరిసారిగా కనిపించిన ప్రదేశం నుంచి చాలా మైళ్ల దూరం నడిచిన తర్వాత ఆమె జనవరి 22న కాన్సాస్ సిటీకి చేరుకుందన్నారు.
కాన్సాస్‌లోని ఓ పాడుబడ్డ ఇంట్లో రెండు నెలల పాటు తలదాచుకుందని తెలిపారు. తరువాత ఫ్లోరిడాకు వెళ్లిందన్నారు. తరచుగా లైబ్రరీలకు వెళ్లే తన్వి అలవాటే ఆమె జాడను కనుగొనేందుకు కారణమైందన్నారు. కాన్వే పోలీసులకు మార్చి 29న టంపాకు చెందిన ఓ వ్యక్తి నుంచి కీలక సమాచారం అందింది. తన్విని తాను లైబ్రరీలో చూసినట్టు చెప్పడంతో.. అక్కడకు వెళ్లిన పోలీసులు తన్వి ని గుర్తించి క్షేమంగా తీసుకొచ్చారు. తన ఉద్యోగం ప్రమాదంలో పడటంతో పాటు కుమార్తె కనిపించకుండా పోయిందన్న బాధతో తన్వి తండ్రి పవన్ రాయ్ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ఆయన.. కూతురు దొరకిందన్న వార్తతో సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..