Covid-19 Taste, Smell: కరోనా బాధితుల్లో రుచి, వాసన తిరిగి రావాలంటే ఏడాది సమయం: తాజా పరిశోధనలో వెల్లడి
Covid-19 Taste, Smell: కరోనా మహమ్మారి చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. కరోనా సోకి తిరిగి కోలుకున్న వారిలో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా సోకిన బాధితుల్లో..
Covid-19 Taste, Smell: కరోనా మహమ్మారి చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. కరోనా సోకి తిరిగి కోలుకున్న వారిలో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా సోకిన బాధితుల్లో అధికంగా రుచి, వాసన కోల్పోతున్నారు. అయితే ఇలాంటి వారు భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సమస్య తీవ్రమైతే తప్ప చికిత్స అవసరం ఉండదని అంటున్నారు. ఇది బాధితులకు కొంత ఉపశమనం కలిగించే విషయమే అయినా.. కోల్పోయిన వాసన, రుచి తిరిగి ఎప్పుడు వస్తుందో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు వైద్యులు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిలో చాలామందిలో రుచి తెలియకపోవడం.. వాసన కోల్పోవడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. కరోనా సోకిన సమయంలో మొదలైన ఈ సమస్యలు వైరస్ తగ్గిపోయిన తర్వాత కూడా దీర్ఘకాలం పాటు అలానే ఉంటున్నాయని అధ్యయనం చెబుతోంది.
అయితే రుచి, వాసన కోల్పోయిన బాధితులు తిరిగి పొందడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బోర్గ్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్ పరిశోధకుల పరిశోధనలో తేలింది. ఈ మేరకు జామ నెట్‌వర్క్ ఓపెన్‌లో ఈ పరిశోధనకు సంబంధించి కథనం ప్రచురితమైంది. పరిశోధనలో భాగంగా కోవిడ్ కారణంగా రుచి, వాసన కోల్పోయిన 97 మందిపై పరిశోధకులు ఏడాది పాటు అధ్యయనం చేశారు. 97 మందిలో 51 మందిని ప్రతి నాలుగు నెలలకోసారి రుచి, వాసన తిరిగి వచ్చిందో లేదో పరీక్షించుకొని నివేదిక ఇవ్వాలని కోరారు. ఎనిమిది నెలలు గడిచే సరికి స్వీయ పరీక్షలు చేసుకున్న 51 మందిలో 49 మందికి వాసన, రుచి స్వభావం పూర్తిగా తిరిగి వచ్చింది. మిగితా ఇద్దరిలో ఒకరికి పాక్షికంగా రాగా, మరో వ్యక్తిలో ఎలాంటి పురోగతి లేదని గుర్తించారు. ఇక మిగిలిన 46 మందికి ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. ఏడాది పూర్తి కాగానే ఈ 46 మందిని పరీక్షించగా, వారికి వాసన, రుచి పూర్తిగా తిరిగొచ్చిందని గుర్తించారు. దీన్ని బట్టి వాసన, రుచి స్వభావాన్ని కోల్పోయిన కోవిడ్ బాధితులు దానిని తిరిగి పొందడానికి ఏడాది సమయం పడుతుందని పరిశోధకులు వెల్లడించారు.
కాగా, సాధారణంగా ఈ తరహా లక్షణాలు మొదటి లక్షణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. సాధారణంగా చాలామందిలో వైరస్ నుంచి కోలుకున్న కొన్ని వారాలకే వారిలో రుచి, వాసన తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కానీ, మరికొంతమందిలో మాత్రం రుచి, వాసన సుదీర్ఘకాలం పాటు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జలుబు వచ్చినప్పుడు వాసనను కోల్పోతారు. దీనికి కారణం మీ శ్లేష్మం మారుతుంది. మీ ముక్కు సూపర్ స్టఫ్ అవుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. జలుబు తగ్గినప్పుడే ఆ మంట పోతుంది. అయితే COVIDలో మాత్రం రుచి, వాసన మళ్లీ తిరిగి రాకపోవచ్చునని అభిప్రాయపడ్డారు.