COVID-19: బంగ్లాదేశ్‌లో కరోనా విజృంభణ.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..
Bangladesh COVID-19: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలుదేశాల్లో ఈ మహమ్మారితోపాటు
Bangladesh COVID-19: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలుదేశాల్లో ఈ మహమ్మారితోపాటు పలు కొత్త రకం కరోనా కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు పలు దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో కూడా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో విమానాల రాకపోకలను నిషేధించనున్నట్లు బంగ్లాదేశ్ పౌర విమానయాన సంస్థ పేర్కొంది. దేశంలో కరోనా కట్టడి కోసం ఏప్రిల్ 20వ తేదీ వరకు అన్ని అంతర్జాతీయ, దేశీయ, స్థానిక, శిక్షణ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆదివారం ప్రకటించింది.
అయితే.. సహాయ, పునరావాస, కార్గో, సాంకేతిక కారణాలు, ఇంధనం నింపుకునేందుకు మాత్రమే విమానాల ల్యాండింగ్‌కు తమ దేశంలో అనుమతిస్తామని బంగ్లాదేశ్ పౌర విమానయాన శాఖ వెల్లడించింది. కాగా.. ప్రత్యేక విమానాల్లో బంగ్లాదేశ్ వచ్చిన ప్రయాణికులు వారి సొంత ఖర్చులతో హోటళ్లలో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని, కరోనా నిబంధనలన్నీ యథావిధిగా పాటించాలని విమానయాన శాఖ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతించిన ప్రత్యేక విమానాల్లో శానిటైజ్ చేయాలని, భౌతిక దూరం పాటించాలని, కరోనా రిపోర్టులు ఉండాలని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియాకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదివారం జరిపిన పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కాగా.. బంగ్లాదేశ్‌లో శనివారం ఒక్కరోజే 5,819 కరోనా కేసులు వెలుగు చూశాయి. 78 మంది కరోనాతో కన్నుమూశారు. ఇప్పటివరకు 6,84,756 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.
Also Read: