Xi jinping New Team: చైనా కమ్యూనిస్ట్ పార్టీలో జిన్‌పింగ్ మద్దతుదారులకే పదవులు.. నలుగురు కీలక నేతలు ఔట్..
ప్రస్తుత ప్రధాని లీ కెకియాంగ్ పదవీకాలం మార్చి 2023తో ముగియనుంది. తదుపరి ప్రధాని లీ కియాంగ్ ఏర్పాటు దాదాపు ఖాయమని భావిస్తున్నారు.

చైనాలో షీ జిన్‌పింగ్ హవా కొనసాగుతోంది. దేశ అధ్యక్షుడిగా పార్టీ జనరల్ సెక్రటరీగా షీ జిన్‌పింగ్ మూడోసారి ఎన్నికయ్యారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు విజయవంతమైనట్టు జిన్‌పింగ్ ప్రకటించారు. చైనా కొత్త ప్రధానిగా లీకియాంగ్ ఎన్నుకొన్నారు. షాంఘైలో చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసిన లీ కియాంగ్‌ను ఈ పదవికి ఎంపిక చేశారు. పార్టీ పొలిట్‌బ్యూరో.. స్టాండింగ్ కమిటీ కొత్త సభ్యల పేర్లను కూడా వెల్లడించారు. ఈ కమిటీలో షీ జిన్‌పింగ్, లీ కియాంగ్‌తోపాటు ఝావో లిజి, వాంగ్ హునింగ్, కాయి కి, డింగ్ షూషాంగ్, లీషీకు స్థానం కల్పించారు. కొత్త నాయకత్వంతో చైనా కమ్యూనిస్ట్ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు జిన్‌పింగ్ . అంతర్జాతీయ సమాజం తమ పార్టీ కాంగ్రెస్ సమావేశాలను ఆసక్తిగా గమనిస్తోందన్నారు.
చైనా అధ్యక్షుడిగా ఎన్నికైన జిన్‌పింగ్‌కు ప్రపంచదేశాల నుంచి అభినందనలు వెలువెత్తాయి. తమ బృందంపై నమ్మకం ఉంచినందుకు పార్టీకి జిన్‌పింగ్ కృతజ్ఞతలు చెప్పారు. చైనాను అన్నిరకాలుగా ఆధునిక సోషలిస్టు దేశంగా మార్చేందుకు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తామన్నారు.
చైనా ప్రధానిగా ఎన్నికైన 63 ఏళ్ల లీ కియాంగ్ సీసీపీ షాంఘై విభాగం కార్యదర్శి. షీ జిన్‌పింగ్‌కు అత్యంత విధేయుడిగా పేరుంది. ఆయన ఈ ఏడాది షాంఘైలో అత్యంత కఠినమైన లాక్‌డౌన్ విధించారు. గతంలో ఝిజియాంగ్ ప్రావిన్స్‌లో షీ జిన్‌పింగ్‌తో కలిసి పనిచేశారు. ప్రస్తుతం పార్టీలో జిన్‌పింగ్ తర్వాత స్థానంలోకి కియాంగ్ చేరుకొన్నారు. కొన్నేళ్లుగా అత్యున్నత స్థాయి స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న నలుగురు కీలక నేతలు తిరిగి ఎన్నికయ్యే అవకాశాన్ని కోల్పోయారు.
వీరిలో ప్రధాన మంత్రి లీ కెకియాంగ్ , నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఛైర్మన్ లీ ఝాన్సు, చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ వాంగ్ యాంగ్, ఉప ప్రధాని హాన్‌జెంగ్ ఉన్నారు. కేంద్ర కమిటీకి ఎన్నుకోకపోవడంతో వీరికి పొలిట్‌బ్యూరోలో, స్టాండింగ్ కమిటీలో స్థానం దక్కదు. ప్రస్తుత ప్రభుత్వ హోదాల నుంచీ తప్పుకోవాల్సి వస్తుంది.
అంటే ఇప్పటి వరకూ దేశ పాలనా వ్యవహారాల్లో కీలకమైన సీనియర్లలో అత్యధికులను జిన్‌పింగ్ పథకం ప్రకారం పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం
