Ind vs China: సరిహద్దులో తోకముడిచిన డ్రాగన్.. కొత్త వివాదాలకు డ్రాగన్ యత్నం.. ఈసారి వాటర్ వార్?
మొన్నటి దాకా లద్ధాఖ్ సరిహద్దులో పక్కలో బల్లెంలా వ్యవహరించిన డ్రాగన్ కంట్రీ చైనా.. ఇపుడు మనదేశంతో జలవివాదాలకు తెరలేపుతోంది. పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లోను, భూభాగాల్లోను చిచ్చు రేపుతూ చోద్యం చూసింది.
China getting ready for Water war with India: మొన్నటి దాకా లద్ధాఖ్ సరిహద్దులో పక్కలో బల్లెంలా వ్యవహరించిన డ్రాగన్ కంట్రీ చైనా.. ఇపుడు మనదేశంతో జలవివాదాలకు తెరలేపుతోంది. ఓవైపు కరోనా ప్రపంచాన్ని కబళిస్తోంటే.. చైనా మాత్రం పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లోను, భూభాగాల్లోను చిచ్చు రేపుతూ చోద్యం చూసింది. మన దేశ ద్విముఖ వ్యూహంతో చెక్ పెట్టడంతో రెండు నెలల క్రితం చైనా సైన్యం లద్ధాఖ్ సమీపంలోని ప్యాంగ్యాంగ్ లోయ నుంచి తోక ముడిచింది. డిజ్ఎంగేజ్మెంట్ ప్రాసెస్ సుమారు పదిహేను రోజుల పాటు కొనసాగింది. ఓవైపు సైన్యానికి ధీటుగా సమాధానమివ్వడంతోపాటు.. మరోవైపు దౌత్య మార్గాలలో భారత ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో చైనా వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే.. ప్యాంగ్యాంగ్ నుంచి తప్పుకున్న చైనా భారత దేశంతో జల వివాదాలకు తెరలేపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
చైనా ఇదే విధానాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో రెండు దేశాల మధ్య మరిన్ని వివాదాలు తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. బోర్డర్ వివాదాలకు తోడుగా.. భారత్‌తో జల వివాదాలకు తెరలేపేందుకు డ్రాగన్ కంట్రీ రెడీ అవుతోందని అంటున్నారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కొత్త సమస్యలు సృష్టించడానికి చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. టిబెట్ నుంచి భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై ఒక భారీ డ్యామ్ నిర్మాణానికి చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ డ్యామ్‌ను నిర్మించాలని చైనా పాలకులు తలపెట్టారు. గతేడాది ‘పవర్ చైనా’ ఛైర్మన్ యాన్ ఝియాంగ్ ప్రస్తావించడంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి.
టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర నదిని అక్కడ యార్లుంగ్ అని పిలుస్తారు. ఈ నది దాదాపు 2,900 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది చైనా భూభాగాలను దాటుకొని 1625 కిలోమీటర్లు ప్రయాణించి భారత్, బంగ్లాదేశ్‌లలో కూడా ప్రజలకు మంచినీటి అవసరాలు తీరుస్తుంది. చైనాలోని జలవిద్యుత్తులో నాలుగో వంతు ఉత్పత్తి సామర్థ్యం ఒక్క టిబెట్‌లోనే వుంది. 2010 నుంచి ఈ నది మధ్య భాగాల్లో చైనా చాలా హైడ్రోపవర్ ప్రాజెక్టులను నిర్మించాలని భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
అయితే రకరకాల కారణాల వల్ల అప్పట్లో రెండు పంచవర్ష ప్రణాళికల్లో ఈ ప్లాన్ ముందుకు కదల్లేదు. ఈ నది మధ్య భాగంలోని పరీవాహక ప్రాంతం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (వాస్తవాధీన రేఖ)కి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడ కనీసం 11 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది డ్రాగన్ కంట్రీ. వీటిల్లో అతి పెద్దదైన జాంగ్మూ ప్రాజెక్టు 2015 నుంచి పనిచేస్తోంది. మిగిలిన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు నది దిగువ భాగాన అరుణాచల్ ప్రదేశ్‌కు అత్యంత సమీపంలో ఓ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది. దీని సైజు ప్రపంచంలోనే అతిపెద్దదైన త్రీగోర్జెస్ డ్యామ్ కంటే ఎక్కువగా ఉంటుందని చైనా వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ భాగాలకు నీటి లభ్యత ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరదలు వచ్చిన సమయంలో ఒక్కసారిగా గేట్లు తెరిస్తే దిగువ ప్రాంతాలు నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ భూభాగంగా గుర్తించేందుకు చైనా కొర్రీలు వేస్తోంది. తాజాగా భారీ ఆనకట్ట నిర్మించి దిగువ ప్రదేశాలపై పట్టు సాధించాలని చూస్తోంది. ఈ ఆనకట్ట వల్ల బంగ్లాదేశ్ కూడా బాధిత దేశంగా మారే ప్రమాదం ఉంది. భారత్‌కు ఈ కొత్త డ్యామ్‌పై ఎటువంటి సమాచారం అందజేయలేదు. ఇప్పటికే చైనా చేపడుతున్న నిర్మాణాలపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందుకు పలు అంతర్జాతీయ వేదికలను భారత్ వినియోగించుకుంటోంది. నదీ జలాల వివరాలకు సంబంధించిన హైడ్రోలాజికల్ డేటాపై ఇరు దేశాలు గతంలో సమాచారం ఇచ్చిపుచ్చుకొనేవి. 2017లో డోక్లాం వివాదం తర్వాత నుంచి చైనా సమాచారం ఇవ్వడం మానేసింది.
నిజానికి ఈ మధ్య కాలంలో భారత్ బోర్డర్ దాకా ఈజీగా చేరుకునేందుకు భారీ రహదారులను నిర్మించింది చైనా. ఇందులో భాగంగా ఈ మధ్యనే టిబెట్‌లో 409 కిలో మీటర్ల పొడవైన ఆరు వరుసల రహదారి నిర్మాణాన్ని ముగించి వాహనాలను అనుమతించింది. ఇలాంటి రోడ్లను మరికొన్నింటిని నిర్మించేందుకు చైనా రెడీ అవుతున్న సంకేతాల నేపథ్యంలో అప్రమత్తమైన మోదీ ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు దాకా ఆరు రహదారులను నిర్మించాలని తలపెట్టింది. దీనికి పార్లమెంటు ఆమోదం కూడా తీసుకున్నారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఓ గ్రామాన్ని సైతం చైనా సైన్యం నిర్మించిందన్న కథనాలు కూడా వచ్చాయి.
అయితే, ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలున్నా వాటిని చైనా పెద్దగా ఖాతరు చేయడం లేదు. ఒప్పందాలు చేసుకున్న తర్వాత వాటిని కాగితాలకే పరిమితం చేస్తోంది చైనా. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు దాకా రైలు మార్గాన్ని నిర్మించడం.. సరిహద్దుకు చేరువలో భారీ విద్యుత్ ప్రాజెక్టులను ప్లాన్ చేయడం, జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించడం వంటి చర్యలతో భారత్‌కు పక్కలో బల్లెంలా వ్యవహరిస్తోంది చైనా. ఈ క్రమంలో ఆ దేశాన్ని సామ దాన భేద దండోపాయాలతో అదుపు చేయడం మినహా మరో మార్గం లేదు. ఈ దిశగా ప్రణాళిక సిద్దం చేయడంలో విదేశాంగ శాఖా మంత్రి ప్రొ. జయశంకర్ సుబ్రహ్మణ్యం బిజీగా వున్నారు. విదేశాంగ శాఖ చైనా కదలికలపై ఎప్పటికప్పుడు నివేదికల ద్వారా ప్రధాని మోదీకి సమాచారమందిస్తోంది.
ALSO READ: హైదరాబాదీ క్రికెటర్ అద్భుతమైన రికార్డు.. ఇండియాలో టాప్.. వరల్డ్‌లో సెకెండ్
ALSO READ: ప్రబల శక్తిగా కమల్ హాసన్.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో ప్రధాన కూటములకు సవాల్