Azerbaijan Airlines Plane: అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్ ప్రమాదంలో కుట్రకోణం!
అజర్ బైజాన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే కారణమని ప్రచారం జరిగింది. ఇప్పుడు కుట్ర కోణం ఉందన్న వాదన వినిపిస్తుంది. ఇలా డే వన్ నుంచి ప్రమాదంపై సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇది ప్రమాదమా.. కుట్రా..? అసలు రష్యా-ఉక్రెయిన్ వార్‌తో ఈ ప్రమాదానికి లింకుందా.. !
అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలిన ఘటనలో కుట్ర కోణం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ముందు విమానాన్ని పక్షి ఢీకొనడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ వెల్లడించింది. ప్రమాదానికి ముందు విమానం పలుమార్లు గాల్లో చక్కర్లు కొట్టి నేల కూలింది. దీంతో మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన ఫుటేజీ చూసిన తర్వాత అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత కనిపించిన విమానం ఫోటోలు కొత్త చర్చకు తెరలేపాయి. విమానం శిథిలాలను పరిశీలిస్తే, వాటిపై రంధ్రాలు ఉన్నాయి. విమానంపై కాల్పుల గుర్తులు కూడా కనిపించడం అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది.
మరి ఈ దుర్ఘటనకు కారణం ఎవరు అని ప్రశ్నిస్తే… వేళ్లన్నీ రష్యా వైపే చూపిస్తున్నాయి. దానికి కారణం రష్యా – ఉక్రెయిన్ మధ్య దాడులు జరగడమే. ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకునే ప్రయత్నంలోనే రష్యా గగనతల వ్యవస్థ యాక్టివేట్ అయి విమానాన్ని కూల్చినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిజానికి కజకిస్థాన్‌లో విమానం కూలిన ఆక్టావ్ నగర ప్రాంతంలో కొన్ని రోజులుగా రష్యా రక్షణ వ్యవస్థ గస్తీ కాస్తుంది. ముఖ్యంగా ఉక్రెయిన్ డ్రోన్లు తమ దేశంలోకి రాకుండా అడ్డుకుంటోంది. ఇందులో భాగంగా ప్రయాణికుల విమానాన్ని కూడా డ్రోన్‌గా భావించి విమానాన్ని కూల్చినట్లు కొందరు వాదిస్తున్నారు. అయితే రష్యా ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఐతే ఈ దుర్ఘటన జరిగింది తమ వల్లే అని రష్యా అంగీకరించాలని అజర్ బైజాన్ కోరుతోంది.
మరోవైపు ఇది పక్షి వల్లనో… పొరపాటుగానో జరిగింది కాదు… కచ్చితంగా కుట్ర కోణం ఉందన్న వాదన వినిపిస్తుంది. కుట్రలో భాగంగానే విమానంపై కాల్పులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మిసైల్ ఢీకొడితేనే విమానానికి ఇలాంటి డ్యామేజీ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రమాదానికి ముందే విమానంలో ఆందోళనకరమైన పరిస్థితి ఉందని కొందరు చెబుతున్నారు. ఫ్లైట్ క్రాష్ కావడానికి ముందే ప్రయాణికులు స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తోనే విమానాన్ని కూల్చినట్టు కొందరు వాదిస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనపై స్పందించిన రష్యా, విచారణ పూర్తయ్యే వరకు ఇలాంటి ఊహాగానాలు చేయడం సరికాదని మండిపడింది. ప్రమాదంపై కజకిస్థాన్ ప్రభుత్వం కూడా కీలక ప్రకటన చేసింది. రష్యా వల్లే ప్రమాదం జరిగిందని ఇప్పుడే స్పష్టం చేయలేమని, అలాగని ఈ విషయాన్ని కొట్టిపారేయలేమని తెలిపింది. మరోవైపు ఘటనకు గల కారణాలపై పారదర్శక విచారణకు పూర్తిగా సహకరించాలని కెనడా సహా పలు దేశాలు రష్యాను కోరాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..