AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Hassan: ప్రబల శక్తిగా కమల్ హాసన్.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో ప్రధాన కూటములకు సవాల్ విసురుతున్న నటుడు

గత నెల రోజులుగా క్రమంగా, వ్యూహాత్మకంగా ఆచీతూచీ అడుగులు వేస్తున్న కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) థర్డ్ ఫ్రంట్ కూర్పులో దాదాపు సక్సెస్సయ్యింది. రెండు ప్రధాన కూటముల్లో...

Kamal Hassan: ప్రబల శక్తిగా కమల్ హాసన్.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో ప్రధాన కూటములకు సవాల్ విసురుతున్న నటుడు
14
Rajesh Sharma
|

Updated on: Mar 12, 2021 | 2:53 PM

Share

Kamal Hassan’s Third Front challenging other political fronts: తమిళనాడు పాలిటిక్స్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార అన్నా డిఎంకే సారథ్యంలో కూటమిలో పార్టీల మధ్య లుకలుకలు ఆ కూటమి నేతలకు తలనొప్పిగా మారుతుండగా.. విపక్ష డిఎంకే నేతృత్వంలోని కూటమిలో బాధ్యతతంతా మోయాల్సిన అగత్యం స్టాలిన్‌పై పడుతోంది. అదే సమయంలో గత నెల రోజులుగా క్రమంగా, వ్యూహాత్మకంగా ఆచీతూచీ అడుగులు వేస్తున్న కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) థర్డ్ ఫ్రంట్ కూర్పులో దాదాపు సక్సెస్సయ్యింది. రెండు ప్రధాన కూటముల్లో అలక బూనిన వారిని మచ్చిక చేసుకోవడం ద్వారా కమల్ హాసన్ తమ థర్డ్ ఫ్రంట్‌ను కాస్త బలోపేతం చేసుకున్నారనే చెప్పాలి.

గత నెలా, నెలన్నరగా తమిళనాడులో రాజకీయంగా పలు మార్పులు జరిగాయి. తొలుత జైలు నుంచి విడుదలై చెన్నై చేరిన చిన్నమ్మ అన్నా డిఎంకే పగ్గాలను ఎలాగైనా చేజిక్కించుకుంటారని భావించారు. కానీ తనదైన శైలిలో చక్రం తిప్పిన ముఖ్యమంత్రి ఫళనిస్వామి.. శశికళను పార్టీ దరిదాపుల్లోకి కూడా రానీయలేదు. సరికదా.. ఎన్నికల తర్వాత అన్నా డిఎంకే కూటమి ఆధిక్యం పొందింతే తానే మరో దఫా ముఖ్యమంత్రిని అవుతానని కూడా ఆయన ప్రకటించుకున్నారు. ఇలా ప్రకటించుకోవడం ద్వారా శశికళ వర్గీయులుగా భావిస్తున్న వారికి మరో మార్గం లేకుండా ఫళనిస్వామికి దగ్గరవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితేనేం.. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు చర్చల్లో ఎక్కడా తగ్గని ఫళనిస్వామి.. తన పార్టీలో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వవద్దు అనే విషయంలోను వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎప్పటికైనా థ్రెట్ అవుతారనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరికి టిక్కెట్ తిరస్కరించారు. ఇలా టిక్కెట్లు దక్కని వారిపుడు కమల్ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. వీరిలో కొందరు టిటికే దినకరన్ పార్టీ ఏఎంఎంకే వైపు కూడా దృష్టి సారించారు.

ఇటు రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా సక్సెస్ కాలేకపోయిన విజయకాంత్, శరత్ కుమార్ లాంటి యాక్టర్లకు కూడా కమల్ దగ్గరయ్యారు. వీరిలో శరత్ కుమార్ అయితే ఏకంగా కమల్ హాసన్‌తో కలిసి పనిచేస్తున్నారు. వీరిద్దరి ఆలోచనల ఫలితమే చిన్నా చితకా పార్టీలతో కలిసి థర్డ్ ఫ్రంట్ రూపకల్పన. తాజాగా అన్నా డిఎంకే అసంతృప్త సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కమల్ టీమ్‌ రహస్య సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు దినకరన్ పంచన చేరడం కంటే తనవైపు వస్తేనే మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశాలున్నాయని వారికి కమల్ బృందం సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం.

ఇదిలా వుండగా.. తాను ఎక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే విషయంలోను కమల్ హాసన్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ కోయంబత్తూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నారు. ఈ సీటును ఎంపిక చేసుకోవడంతో కమల్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అధికార అన్నా డిఎంకే పొత్తులో భాగంగా బీజేపీ ఈ దక్షిణ కోయంబత్తూర్ అసెంబ్లీ సీటును తీసుకుంది. అక్కడ్నించి పోటీ చేయడం ద్వారా తమిళనాడులో అంతగా బలం లేని బీజేపీపై సులభంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టవచ్చని కమల్ హాసన్ భావిస్తున్నారు. అందుకే ఈ సీటును ఎంపిక చేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అదే సమయంలో కోయంబత్తూరులో ముస్లింల ఓట్లు పెద్ద సంఖ్యలో వున్నాయి. కోయంబత్తూరు (కోవై)లో కొన్నేళ్ళ క్రితం ఉగ్రవాదుల బాంబుదాడుల నేపథ్యంలో ముస్లిం ఓట్లు పోలరైజ్ అవుతూ వస్తున్నాయి. రాజకీయ పార్టీలు సైతం వీరిని బీజేపీ వ్యతిరేకంగా వినియోగించుకుంటున్నాయి. బీజేపీని బలంగా వ్యతిరేకించే కమల్ హాసన్ అక్కడ ఆ పార్టీని కమ్యూనల్ పార్టీగా చిత్రీకరించడం ద్వారా ముస్లిం ఓట్లు గంపగుత్తగా తనవైపు పడేలా ప్రయత్నాలు చేసుకునే ఎత్తుగడ వేస్తున్నారు. ఇలా తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గం ఎంపికలోను కమల్ హాసన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని తమిళనాట రాజకీయ పండితులు అంఛనా వేస్తున్నారు.

ALSO READ: హైదరాబాదీ క్రికెటర్ అద్భుతమైన రికార్డు.. ఇండియాలో టాప్.. వరల్డ్‌లో సెకెండ్