Mithali Raj: హైదరాబాదీ క్రికెటర్ అద్భుతమైన రికార్డు.. ఇండియాలో టాప్.. వరల్డ్‌లో సెకెండ్

మహిళా క్రికెట్ విషయానికి వస్తే సుదీర్ఘ కాలం దేశ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన హైదరాబాదీ విమెన్ క్రికెట్ మిథాలీ రాజ్ వేలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

Mithali Raj: హైదరాబాదీ క్రికెటర్ అద్భుతమైన రికార్డు.. ఇండియాలో టాప్.. వరల్డ్‌లో సెకెండ్
05
Follow us

|

Updated on: Mar 12, 2021 | 2:32 PM

Mithali Raj creates new record: భారతీయులకు క్రికెట్ క్రీడకు ఎనలేని విశేషమైన బంధం వుంది. దేశంలో క్రికెట్ ఆటకున్నంత క్రేజ్ మరే ఇతర క్రీడకు లేదు. అందుకే ఇండియాలో క్రికెటర్లను దేవుళ్ళుగా భావించిన సందర్భాలున్నాయి. 70వ దశకంలో సునీల్ గవాస్కర్, 80వ దశకంలో కపిల్ దేవ్, రవిశాస్త్రి, వెంగ్‌సర్కార్, కృష్ణమాచారి శ్రీకాంత్, 90వ దశకంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే ఆ తర్వాత దశాబ్దాలలో వీరేంద్ర సెహవాగ్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ.. అదే క్రమంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి వారిని భారతీయులు తెగ ఆరాదిస్తూ వస్తున్నారు. ఇదంతా మగవారి క్రికెట్ సైడ్. కానీ మహిళా క్రికెట్ విషయానికి వస్తే సుదీర్ఘ కాలం దేశ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన హైదరాబాదీ విమెన్ క్రికెట్ మిథాలీ రాజ్ వేలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సుమారు 22 ఏళ్ళుగా భారతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మిథాలీరాజ్ తాజాగా అన్ని ఫార్మెట్లలో కలిపి పదివేల పరుగులు పూర్తి చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్ నిలిచారు.

హైదరాబాద్ నగరానికి చెందిన మిథాలీ రాజ్ 1999లో జాతీయ విమెన్ క్రికెట్ జట్టులో తొలిసారి స్థానం సంపాదించారు. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడని విధంగా 22 ఏళ్ళుగా జాతీయ జట్టుకు సేవలందిస్తున్నారు. తొలి నాళ్ళలో తన తండ్రి దురైతో కలిసి క్రికెట్ స్టేడియంలోకి ఎంటరయ్యేపుడు ఈ అమ్మాయి ఇంతకాలం క్రికెట్ ఆడుతుందని ఎవరూ అనుకోలేదు. 1982 డిసెంబర్ 3వ తేదీన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మిథాలీ జన్మించారు. ఆ తర్వాత వారి ఫ్యామిలీ హైదరాబాద్ షిప్టవడంతో ఆమె క్రికెట్ కెరీర్‌‌కు హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్ ‌వేదికైంది. 1999 జూన్ 26వ తేదీన భారత్, ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన వన్డే ఇంటర్నేషనల్‌తో మిథాలీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత 2002 జనవరి 14న ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన క్రికెట్ టెస్టు మ్యాచుతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. 2006 ఆగస్టు 5వ తేదీ ఇంగ్లాండ్ జట్టుతో తన తొలి టీ20 మ్యాచ్ ఆడారు. 2003లో అర్జున అవార్డుకు ఎంపికైన మిథాలీరాజ్‌ను 2015లో పద్మశ్రీ అవార్డు వరించింది.

తాజాగా మిథాలీ రాజ్ మరో గొప్ప మైలురాయిని అందుకున్నారు. అన్ని ఫార్మెట్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) కలిపి మొత్తం పదివేల పరుగులు సాధించిన తొలి ఇండియన్ విమెన్ క్రికెటర్‌గా మిథాలీరాజ్ రికార్డు సాధించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో మిథాలీ 36 పరుగులు చేసి ఔటయ్యారు. అయితే 35 పరుగులు సాధించగానే ఆమె తన కెరీర్‌లో అన్ని పార్మెట్లు కలిపి పదివేల పరుగుల మైలురాయిని దాటారు. ఆ తర్వాత మరో పరుగు జోడించి ఔటయ్యారు మిథాలీరాజ్. మొత్తం 50 బంతులను ఎదుర్కొన్న మిథాలీ 4 ఫోర్లు కొట్టి 36 పరుగులు చేశారు తాజా మ్యాచ్‌లో.

తాజ మ్యాచ్‌కు ముందు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ అన్ని ఫార్మాట్లలో కలిపి 9,965 పరుగులు చేశారు. 1999లో టీమిండియాలోకి అడుగుపెట్టిన మిథాలి సుదీర్ఘ కాలంగా భారత క్రికెట్‌లో కొనసాగుతున్నారు. 2002లో టెస్టుల్లో అడుగుపెట్టిన ఆమె 10 మ్యాచ్‌లాడి 663 పరుగులు చేశారు. అందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. వన్డే కెరీర్‌లో 212 మ్యాచ్‌లాడిన మిథాలి 6,974 (ఈ మ్యాచ్‌తో కలిపి) పరుగులు సాధించారు. అందులో ఏడు సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలున్నాయి. మరోవైపు పొట్టి క్రికెట్‌ (టీ20లు) లో 89 మ్యాచ్‌లు ఆడి 2,364 పరుగులు చేశారు. టీ20ల్లో మిథాలీ 17 హాఫ్ సెంచరీలు చేయడం విశేషం.

ప్రస్తుతం టీ 20, టెస్టుల నుంచి రిటైర్ అయిన 38 ఏళ్ళ మిథాలి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. వచ్చే ప్రపంచకప్‌లో భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టాలని కలలుకంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ స్థాయిలో చూసినా మొత్తం అన్ని ఫార్మెట్లలో అత్యధిక పరుగులు చేసిన వారిలో మిథాలీది రెండో స్థానం. ఈ జాబితాలో ఇంగ్లాండ్‌ మాజీ సారథి చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ 10,273 పరుగులతో తొలి స్థానంలో వున్నారు. మిథాలి రాజ్‌ 10,001 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. మిథాలీ తర్వాతి స్థానాలలో న్యూజిలాండ్‌ క్రికెటర్‌ సుజీ బేట్స్‌(7,849), వెస్టిండీస్‌ బ్యాట్స్ విమెన్‌ స్టిఫానీ టేలర్‌ (7,816), ఆస్ట్రేలియా క్రికెటర్‌ మెగ్‌ లానింగ్‌ (6,900) పరుగులతో కొనసాగుతున్నారు.

ALSO READ: ప్రబల శక్తిగా కమల్ హాసన్.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో ప్రధాన కూటములకు సవాల్