Anita Anand: కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయ సంతతి మహిళ.. అనితా ఆనంద్ గురించి ఆసక్తికర విషయాలు..
దేశాలకు, కార్పొరేట్ కంపెనీలకు నాయకత్వం వహిస్తూ- భారతీయులు, భారతీయ సంతతి ప్రముఖులు కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే కెనడాకు కూడా భారతీయ సంతతి మహిళ నాయకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెనడా ప్రధానమంత్రి పదవి రేసులో భారతీయ సంతతి మహిళ ఎంపీ అనితా ఆనంద్ ముందు వరుసలో ఉన్నారు.
దేశాలకు, కార్పొరేట్ కంపెనీలకు నాయకత్వం వహిస్తూ- భారతీయులు, భారతీయ సంతతి ప్రముఖులు కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే కెనడాకు కూడా భారతీయ సంతతి మహిళ నాయకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటా బయటా.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కెనడా ప్రధానమంత్రి ట్రూడో సోమవారం (జనవరి 06) లిబరల్ పార్టీ నాయకుడి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఆయన తర్వాత కెనడా ప్రధానమంత్రి పదవి రేసులో భారతీయ సంతతి మహిళ ఉన్నారు. కెనడా ప్రధాని పదవికి ఎంపీ అనితా ఆనంద్ ముందు వరుసలో ఉన్నారు. ప్రధాని పదవికి ట్రూడో రాజీనామాతో కొత్త లీడర్ కోసం అన్వేషణ మొదలైంది. మార్చి 24కల్లా కెనడా కొత్త ప్రధాని ఎన్నికయ్యే అవకాశం ఉంది. అనితా ఆనంద్ 2019 నుంచి ఎంపీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె కెనడా రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో న్యాయశాఖ ప్రొఫెసర్‌గా వ్యవహరించారు అనితా ఆనంద్. అలాగే రోట్మన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లోని క్యాపిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పాలసీ అండ్ రీసెర్చ్ డైరక్టర్‌గా సేవలు అందించారు..
కరోనావైరస్ సంక్షోభకాలంలో అనితా ఆనంద్ పనితీరుపై కెనడాలో ప్రశంసలు వచ్చాయి. ప్రజలకు వైద్య పరికరాలు, ఆక్సిజన్, మాస్కులు, PPE కిట్స్, టీకాలు అందించడంలో అనితా ఆనంద్ ముఖ్యపాత్ర పోషించారు. కాగా..కెనడాలో 1993లో తొలి మహిళా ప్రధానిగా క్యాంప్‌బెల్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అన్నీ కుదిరి, అనితా ఆనంద్‌ని అదృష్టం వరిస్తే, కెనడాకు విదేశీ మూలాలున్న తొలి ప్రధానిగా రికార్డు సృష్టిస్తారు.
కాగా.. 1960వ దశకంలో భారత్ నుంచి కెనడాకు వెళ్లి స్థిరపడ్డారు డాక్టర్ సరోజ్ రామ్, డాక్టర్ SV ఆనంద్. వీరికి 1967లో జన్మించారు అనితా ఆనంద్.. గ్రామీణ నోవా స్కోటియాలో పుట్టి పెరిగిన మంత్రి ఆనంద్ 1985లో అంటారియోకు వెళ్లారు. అక్కడే ఉన్నత విద్యను అభ్యసించారు..కెనడాకు చెందిన జాన్ ను పెళ్లి చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు. ప్రస్తుతం అనితా ఆనంద్ అధికార లిబరల్ పార్టీ లో కీ రోల్ పోషిస్తున్నారు. అనితా ఆనంద్ రాజకీయ నాయకురాలిగానే కాకుండా, న్యాయవాదిగా, పరిశోధకురాలుగా పెరుపొందారు..
పదేళ్ల పాటు..
దాదాపు పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన ట్రూడో.. అనేక ఊహగానాల అనంతరం తన రాజీనామాను ప్రకటించారు. మార్చి 24 వరకు పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్లు ట్రూడో ప్రకటించారు. అధికార లిబరల్ పార్టీ లిబరల్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకోగానే తాను పదవి నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు. లిబరల్ పార్టీ సభ్యులు కూడా గతంలో ఆయన రాజీనామాకు బహిరంగంగా పిలుపునిచ్చారు. అంతేకాకుండా పలు వివాదాలు సైతం అతన్ని చుట్టుముట్టడంతో చివరకు తప్పుకున్నారు.. జస్టిన్ ట్రూడో 2013లో లిబరల్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2015లో అధికారాన్ని కైవసం చేసుకుని, 2019, 2021లో వరుసగా విజయం సాధించారు. ట్రూడో ప్రకటన తర్వాత ఎవరు ప్రధాని పదవిని చేపడతారనేది ఆసక్తికరంగా మారింది.. ప్రధాని పదవికి భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ తోపాటు మాజీ డిప్యూటీ పీఎం క్రిస్టియా ఫ్రీలాండ్, బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ మరికొందరు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..