Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AMERICA BIG-BROTHER: ప్రెసిడెంట్ బైడెన్ సరికొత్త వ్యూహం.. ఆ చర్యల వెనుక అదే లక్ష్యం!

నాలుగు నెలల క్రితం అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పెద్దగా యాక్షన్ ప్లాన్ లేదు అన్నట్టుగా పరిపాలిస్తున్న జో బైడెన్ తన దీర్ఘకాలిక వ్యూహానికి క్రమంగా తెర లేపుతున్న...

AMERICA BIG-BROTHER: ప్రెసిడెంట్ బైడెన్ సరికొత్త వ్యూహం.. ఆ చర్యల వెనుక అదే లక్ష్యం!
Joe Biden.
Follow us
Rajesh Sharma

|

Updated on: May 19, 2021 | 11:09 AM

AMERICA BIG-BROTHER ROLE BIDEN NEW STRATEGY: నాలుగు నెలల క్రితం అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పెద్దగా యాక్షన్ ప్లాన్ లేదు అన్నట్టుగా పరిపాలిస్తున్న జో బైడెన్ (JOE BIDEN) తన దీర్ఘకాలిక వ్యూహానికి క్రమంగా తెర లేపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐదేళ్ళ క్రితం వరకు ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా దాన్ని చక్కదిద్దే బాధ్యత తనదే నంటూ పెద్దన్న పాత్ర పోషించేది అగ్రరాజ్యం అమెరికా. డోనాల్డ్ ట్రంప్ (DONALD TRUMP) అధ్యక్షుడు అయ్యాక పెద్దన్న పాత్ర తక్కువ, సంకుచిత చర్యలు ఎక్కువ అన్నట్టుగా అమెరికా పాత్ర మారిపోయింది. పెద్దన్నలా కొన్ని సార్లు హుందాగాను, మరికొన్ని సార్లు దూకుడుగాను, ఇంకొన్నిసార్లు వివాదాస్పదంగాను వ్యవహరించే అమెరికా.. ట్రంప్ పరిపాలనలో చీటికి మాటికి చిరాకుపడే చిన్న దేశంగా, చిన్న విషయానికే పెద్దగా స్పందించే చౌకబారు దేశంగా, చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉండాలనే చిన్నపిల్లాడి వ్యవహారంగాను మారిపోయింది. చైనా (CHINA)తోగాని, ఇండియా (INDIA)తోగాని, రష్యా (RUSSIA)తోగాని చిన్న విషయంలో తగాదా వచ్చినా వెంటనే ఆయా దేశాలకు వ్యతిరేకంగా ఏదో ఒక చర్య తీసుకునే ట్రంప్ నైజంతో అమెరికా తన పెద్దన్న పాత్రను దాదాపు కోల్పోయిందనే చెప్పాలి.

బైడెన్ గత జనవరి ఇరవైవ తేదీన అమెరికా అధ్యక్ష (AMERICA PRESIDENT) బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలైతే చేపట్టారు కానీ, కేవలం తన వైట్ హౌస్ (WHITE HOUSE) నియామకాలకే ఆయన పరిమితం అయ్యారా అనే రకంగా తొలి మూడు నెలలు గడిచాయి. తన పరిపాలక విభాగంలోనూ, వ్యక్తిగత ఆఫీస్ సిబ్బంది నియామకంలోను, అంతర్జాతీయ అంశాలను డీల్ చేసే బృందంలోను బైడెన్ భారతీయ సంతతి (INDIAN AMERICANS) వారికి పెద్ద పీట వేశారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ (VICE PRESIDENT KAMALA HARRIS) జోక్యం కావచ్చు.. లేక గతం నుంచి తమ డెమోక్రాటిక్ పార్టీ (DEMOCRATIC PARTY)లో యాక్టివ్‌గా వుండడం కారణం కావచ్చు.. బైడెన్ పరిపాలన బృందంలో భారతీయ సంతతికి చెందిన వారికి పెద్ద పీట లభించింది. ఈ అంశం ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదంతా ఒకవైపు అయితే.. బైడెన్ తాజాగా వ్యూహాత్మకంగా కొన్ని పాత సంప్రదాయాలను తిరగదోడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రెండు మూడు దశాబ్దాల క్రితం అమెరికా అధ్యక్షులు వారి ఆదాయ వివరాలను, ఆస్తుల గణాంకాలను వెల్లడించే సంప్రదాయం వుండేది. గత రెండు, మూడు దశాబ్దాలుగా ఈ సంప్రదాయాన్ని అమెరికన్ ప్రెసిడెంట్స్ గాలికొదిలేశారు. అయితే.. తాజాగా బైడెన్ ఆ సంప్రదాయాన్ని తిరగదోడారు. రెండు రోజుల క్రితం బైడెన్ తన, తన సతీమణి ఆదాయ లెక్కలను, ఆస్తుల వివరాలను వెల్లడించారు. తాను వెల్లడించడంతోపాటు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ చేత కూడా ఈ వివరాలను వెల్లడించేలా చేశారు.

ఇదే క్రమంలో బైడెన్ అమెరికాకు వున్న పెద్దన్న హోదాను తిరిగి సాధించేందుకు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగానే కరోనాపై పోరులో సంకుచితంగా వ్యవహరించిన అమెరికా విధానాలను క్రమంగా మార్చడం ప్రారంభించారు బైడెన్. ట్రంప్ కాలంలో కరోనా పాపాన్ని చైనాకు ఆపాదిస్తూ.. అమెరికన్ల ప్రాణరక్షణకే తమ తొలి ప్రాధాన్యమన్నట్లు వ్యవహరించారు. మూడు రకాల వ్యాక్సిన్లు కనుగొన్నా.. పేద, మధ్య తరగతి దేశాలకు చేయూతనందించేందుకు అప్పట్లో అమెరికా ప్రయత్నించలేదు. తాజాగా అమెరికా ఆ వైఖరి నుంచి మార్పు తీసుకుంటోంది. 33 కోట్ల జనాభా కలిగిన అమెరికాలో దాదాపు 10 శాతం మంది కరోనా బారిన పడ్డారు. అదేసమయంలో 140 కోట్ల జనాభా వున్న భారత్‌లో కేవలం 2 శాతం మాత్రమే కరోనా (CORONA) బారినపడ్డారు. అమెరికా 2020 నవంబర్‌లోనే వ్యాక్సినేషన్ (VACCINATION) ప్రారంభించింది. భారత్ (BHARAT) 2021 జనవరి (JANUARY) 16వ తేదీన వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దేశీయంగా వ్యాక్సిన్ పంపిణీ (VACCINE DISTRIBUTION) చేస్తూనే చిన్న దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసి భారత్ ఔదార్యాన్ని చాటుకుంది. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WORLD HEALTH ORGANISATION) పలు మార్లు ప్రశంసించింది కూడా.

ఈ అంశాన్ని పరిశీలించిన అమెరికా ఔదార్యంలోను తామే ముందుండాలని ఆలస్యంగా గుర్తించింది. దాంతోపాటు.. ఎక్కువ దేశాలకు సాయమందించినట్లు కనిపిస్తేనే తన పెద్దన్న హోదా వుంటుందని బైడెన్ గ్రహించారు. దాంతో వచ్చే 2 నెలల్లో దాదాపు 8 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను చిన్నా, మధ్య తరగతి దేశాలకు పంపిణీ చేయనున్నట్లు బైడెన్ వెల్లడించారు. అదే సమయంలో కరోనా తొలి విడతను సమర్థవంతంగా ఎదుర్కొని.. సెకెండ్ వేవ్ (SECOND WAVE)‌లో మ్యూటెంట్ అయిన కరోనాతో సతమతమవుతున్న భారత్‌కు చేయూతనందిస్తామని కూడా బైడెన్ తాజాగా ప్రకటించారు. కరోనా మహమ్మారి ఇండియాను కుదిపేస్తున్న వేళ అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు అండగా నిలుస్తామని ప్రకటించింది. భారత్‌కు తాము అందిస్తున్న సాయం ఇకపై కూడా కొనసాగుతుందని వైట్ హౌజ్ ప్రెస్‌ కార్యదర్శి జెన్‌సాకి తెలిపారు. వైట్‌హౌస్‌లో జరిగే రోజువారీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో భాగంగా జెన్‌సాకి ఈ విషయం చెప్పారు. భారత్‌కు 100 మిలియన్‌ డాలర్ల విలువైన మెడికల్‌ సాయాన్ని అందిస్తామని బైడెన్‌ ప్రకటించారని జెన్‌సాకి వెల్లడించారు. ఇప్పటికే ఏడు విమానాల ద్వారా భారత్‌కు సాయం పంపినట్లు గుర్తు చేశారు. అమెరికా నుంచి భారత్‌కు తరలిన ఏడో షిప్‌మెంట్‌లో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఉన్నట్లు తెలిపారు. కరోనాతో పోరాడుతున్న భారతీయులకు అవి ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ సాయం కొనసాగుతుందని చెప్పారు. భారత్‌ తమకు ముఖ్యమైన భాగస్వామి అని కితాబిచ్చారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాణాత్మక సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. అందుకు ప్రస్తుతం తాము అందిస్తున్న మెడికల్‌సాయం ఉపయోగపడుతుందన్నారు. కరోనా కేసులు, మరణాలు తగ్గేందుకు అవి సాయం చేస్తాయన్నారు.

కరోనా అంశంలో పెద్దన్న పాత్రను నిలబెట్టుకునేందుకు వ్యాక్సిన్ సరఫరా.. భారత్‌కు సాయాలను ప్రకటించిన బైడెన్.. ఇజ్రాయెల్ (ISRAEL) విషయంలోను తమ పెద్దన్న పాత్రని నిలబెట్టుకునేందుకు చర్యలకు ఉపక్రమించారు. తమ భూభాగాన్ని పరిరక్షించుకునేందుకు ఇజ్రాయెల్ తీసుకునే చర్యలను సమర్థిస్తామంటూనే కాల్పుల విరమణ (CEASE FIRE) ప్రతిపాదనకు మద్దతిస్తున్నట్లు బైడెన్ తెలిపారు. ఈ విషయంపై ఆయన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (BENJAMIN NETANYAHU)కు కాల్ చేసి మరీ మాట్లాడారు. గాజా (GAZA)లోని హమాస్ (HAMAS) ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను పరోక్షంగా బైడెన్ సమర్థించారు. అయితే.. ఈ దాడుల్లో సామాన్య పౌరులు మరీ ముఖ్యంగా మహిళలు, చిన్నారులు మరణించడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. హమాస్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ రంజాన్ (RAMZAN) పండుగకు ముందు ఆఖరు శుక్రవారం నాడు ప్రారంభించిన దాడులకు ఇజ్రాయెల్ ధీటుగా స్పందించడంతో మధ్యప్రాచ్యం (MIDDLE EAST)లో గత పది రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిస్థితిని చల్లబరిచేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిత్వం నెరిపేందుకు ముందుకొచ్చాయి. కానీ అటు హమాస్, ఇటు బెంజమిన్ పట్టిన పట్టువీడకపోవడంతో శాంతి చర్చల్లో పురోగతి లేదు.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, పాలస్తీనా (PALESTINE) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా మే 18 రాత్రి ఇజ్రాయెల్ సైనికులు గాజా సిటీపై వైమానిక దాడులతో విరుచుకుపడ్డారు. రాకెట్ బాంబులతో ఆరంతస్తుల భవనాన్ని నేటమట్టం చేశారు. అటు హమాస్ దాడిలో ఇజ్రాయెల్‌లో వున్న ఇద్దరు థాయ్‌లాండ్ (THAILAND) పౌరులు మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా పాలస్తీనా పౌరులు వెస్ట్ బ్యాంకు (WEST BANK)లోని సైనిక చెక్ పోస్టుపై రాళ్ళు రువ్వారు. ఈ సందర్భంగా జరిగిన లాఠీఛార్జీలో ఒకరు మరణించారు. 46 మందికి గాయాలయ్యాయని సమాచారం. ఓవైపు యుద్ధవాతావరణం కొనసాగుతుండగానే ఇజ్రాయెల్‌కు 735 మిలియన్ డాలర్ల విలువైన ఆధునిక ఆయుధాలు సరఫరా చేస్తామని అమెరికా ప్రకటించింది. ఈ మేరకు బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారని, అధునాతన ఆయుధాలను ఇజ్రాయెల్‌కు సరఫరా చేసే అగ్రిమెంటుపై బైడెన్ సంతకం కూడా చేశారని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రెటరీ ప్రకటించారు. లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, 39 జీబీయు బాంబు (39 GBU BOMBS)లను ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా ఇజ్రాయెల్‌కు సరఫరా చేయనున్నది.