హుటాహుటిన మజారే షరీఫ్ సిటీకి ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని..స్థానిక నేతలతో మంతనాలు…
ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని బుధవారం ఉదయం హుటాహుటిన ప్రత్యేక విమానంలో కాబూల్ నుంచి బయల్దేరి మజారే షరీఫ్ చేరుకున్నారు. అక్కడి స్థానిక నేతలతో చర్చలు జరిపారు. ఈ సిటీ శివార్లలో తాలిబన్లతో పోరాడుతున్న తమ సైనిక దళాల్లో నైతికంగా ధైర్యం
ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని బుధవారం ఉదయం హుటాహుటిన ప్రత్యేక విమానంలో కాబూల్ నుంచి బయల్దేరి మజారే షరీఫ్ చేరుకున్నారు. అక్కడి స్థానిక నేతలతో చర్చలు జరిపారు. ఈ సిటీ శివార్లలో తాలిబన్లతో పోరాడుతున్న తమ సైనిక దళాల్లో నైతికంగా ధైర్యం కలిగించేందుకు ఆయన ఇక్కడికి చేరినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తాలిబన్లు ఈ సిటీకి దగ్గరలోని ఫైజాబాద్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నుంచి వీరు హస్తగతం చేసుకున్న నగరాల్లో ఇది తొమ్మిదవది. మజారే షరీఫ్ రక్షణ విషయమై ఘని..ఇక్కడి అట్టా మహమ్మద్ నూర్ తోను, అబ్దుల్ రషీద్ రుస్తుం తోను సంప్రదింపులు జరిపారు. ఈ సిటీలో వీరు పేరున్న నాయకులని తెలుస్తోంది. మజారే షరీఫ్ సిటీని తాలిబన్లు చేజిక్కించుకున్న పక్షంలో అది కాబూల్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బే అవుతుంది. దేశ ఉత్తర భాగంలో వారు అత్యంత కీలకమైన ప్రాంతాన్ని స్వాధీనపరచుకున్నట్టు అవుతుంది.గత మే నెల నుంచి అమెరికా సేనల ఉపసంహరణ ప్రారంభమైనప్పటి నుంచి తాలిబన్లు క్రమంగా తమ దూకుడు పెంచుతూ వచ్చారు.తాజాగా ఆఫ్ఘన్ దళాలతో జరిగిన పోరులో తీవ్రంగా నష్టపోయినప్పటికీ వారు ఫైజాబాద్ ను చేజిక్కించుకున్నారని జహీతుల్లా అతిక్ అనే ఎంపీ తెలిపారు. ఇది వారికి పూర్తిగా వశమైందన్నారు.
కాందహార్ శివార్లలో నగర జైలు వద్ద తాలిబన్లకు, ఆఫ్ఘన్ దళాలకు మధ్య పోరు తీవ్రమైంది. కొన్ని వారాలుగా తాలిబన్లు ఈ జైలు వద్దకు చేరుకుని ఇందులో ఖైదీలుగా ఉన్న తమవారిని విడిపించడానికి తీవ్రంగా యత్నిస్తున్నారు. పోరులో మరణిస్తున్న తమ నేతల స్థానే ఇలా విడుదలైనవారిలో కొందరిని నియమించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. కాగా మజారే షరీఫ్ లో ఉన్న భారతీయులందరినీ వెంటనే ఈ సిటీని ఖాళీ చేయవలసిందిగా నిన్న ఇక్కడి భారత దౌత్య కార్యాలయం కోరింది. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోవాలని.. వారి పాస్ పోర్టులు, తదితర విషయాలను తెలియజేయాల్సిందిగా కొన్ని ఫోన్ నెంబర్లను కూడా తమ సందేశంలో పేర్కొంది. దీంతో అక్కడి భారతీయుల్లో చాలామంది ఉదయం ఢిల్లీకి చేరుకున్నట్టు తెలిసింది. ఆఫ్ఘన్ నుంచి తమ దళాలను ఉపసంహరించడం ఖాయమని, ఇక ఈ ప్రక్రియ వేగంగా సాగుతుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించడంతో ఇక తాలిబన్ల జోరు మరింత హెచ్చుతుందని భావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : సీఎం సార్ మీ స్టెప్పులు సూపర్..వైరల్ అవుతున్న సీఎం డాన్స్ వీడియో..ఎక్కడంటే..?:CM Dance Video.