Afghanistan Cricket: ఆడుకోండి.. గెలిచిరండి.. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు ఓకే చెప్పిన తాలిబన్లు..
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీమ్‌కు తాలిబన్లు శుభవార్త చెప్పారు. టెస్ట్ మ్యాచ్ ఆడడానికి క్రికెట్ టీమ్‌కు తాలిబన్లు అనుమతిచ్చారు. ఆస్ట్రేలియాతో చారిత్రక తొలి టెస్ట్ ఆడబోతోంది ఆఫ్ఘనిస్తాన్. తాలిబన్ నేతలను కలిశారు ఆఫ్ఘన్ క్రికెట్ జట్టు సభ్యులు.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలైంది. తాలిబాన్ వచ్చిన తర్వాత అక్కడి క్రీడారంగంపై నెలకొన్న నీలి నీడలు తొలిగిపోతున్నాయి. ముందుగా.. క్రికెటర్లకు, క్రికెట్ ప్రేమికులకు తాలిబాన్లు గుడ్ న్యూస్ చెప్పారు. దేశ క్రికెట్ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధతను పటాపంచలు చేస్తూన్నాయి. తాలిబన్ ప్రతినిధి అహ్మదుల్లా వసీఖ్ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. అఫ్గాన్ క్రికెట్ విషయాల్లో తాలిబన్లు తల దూర్చబోరంటూ స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతర్జాతీయ షెడ్యూల్ ప్రకారం యథావిధిగానే మ్యాచ్‌లు ఆడుకోవచ్చని.. ఎటువంటి అభ్యంతరం ఉండబోదంటూ తాలిబన్లు భరోసా ఇచ్చారు. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ముఖ్యమని.. అఫ్ఘాన్ క్రికెట్ జట్టు విదేశీ పర్యటనకు వెళ్లినా.. విదేశీ జట్లు తమ దేశానికి వచ్చినా తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవన్నారు.
ఈ క్రమంలోనే నవంబరులో జరగాల్సిన ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో అఫ్గాన్ జట్టు నవంబర్ 27న ఆసీస్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో తలపడబోతుంది. హోబర్ట్ వేదికగా జరిగే ఈ చారిత్రక మ్యాచ్ కోసం ఏర్పాట్లు ప్రారంభించామని క్రికెట్ ఆస్ట్రేలియా సైతం ప్రకటించడం విశేషం.
రాబోయే నెలల్లో ఆఫ్ఘన్ జట్టు ఎక్కడ ఆడుతుంది?
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఈ నెలాఖరులోగా శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ సెప్టెంబర్‌లో పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా అక్టోబర్‌లో జరిగే టీ 20 ప్రపంచకప్‌లో పాల్గొనాల్సి ఉంది. ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ 2 లో భారత్, పాకిస్థాన్‌తో పాటు ఉంది.
ఆఫ్ఘన్ జట్టు ఈ వారం కాబూల్‌లో శిక్షణ ప్రారంభించాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ఈ ఆటకు ఎలాంటి మార్పు ఉండదని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు CEO హమీద్ షిన్వారీ ఇప్పటికే పేర్కొన్నారు. పాకిస్థాన్ సిరీస్ కోసం సిద్ధం కావడానికి మరో రెండు రోజుల్లో జాతీయ శిబిరం ప్రారంభమవుతుంది. బుధవారం, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లు శిక్షణ పొందుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది.
ఫోటోను షేర్ చేస్తున్నప్పుడు జట్టు పాకిస్థాన్ సిరీస్ కోసం శిక్షణ ప్రారంభించిందని బోర్డు తెలిపింది. పాకిస్థాన్‌తో సిరీస్ ఆడటానికి ఆఫ్ఘన్ క్రికెట్ జట్టు త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్తుందని భావిస్తున్నారు.
క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా అజీజుల్లా..
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా అజీజుల్లా ఫజ్లికు పట్టం కట్టిన సంగతి తెలిసిందే… ముందుగా క్రికెట్‌పైనే దృష్టి సారించడం విశేషం. ముందుగా.. దేశంలో తొలి అధికారిక నియామకాన్ని క్రికెట్‌తోనే ప్రారంభించారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా అజీజుల్లా ఫజ్లికు బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజుల క్రితం ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు అధికారులతో సమావేశమైన తాలిబన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాలిబన్ల రాజ్యం ఏర్పడ్డాక జరిగిన తొలి నియామకం ఇదే. ఫజ్లి 2018-19లో ఏసీబీ ఛీఫ్‌గా వ్యవహరించాడు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఆఫ్ఘన్ జట్టు ఓటమి కారణంగా పదవి నుంచి వైదొలిగాడు. ఇప్పుడు తిరిగి అతడి హయాంలో ఆఫ్ఘన్ క్రికెట్ రాణిస్తుందని తాలిబన్లు(Talibans) ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి: Pub Culture: అక్కడ రూల్స్.. గీల్స్ జాన్తానై.. పబ్బుల్లో నిబంధనలు గాలికి.. చిన్నారులను కూడా అనుమతిస్తున్న వైనం..