తాలిబాన్లకు పాక్ మద్దతుపై ఆఫ్ఘన్ పాప్ స్టార్ ఆర్యానా సయీద్ ఆగ్రహం.. ఆఫ్ఘన్లకు ఇండియా ‘ట్రూ ఫ్రెండ్’ అంటూ ప్రశంస
కాబూల్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడి నుంచి పారిపోయిన ప్రముఖ ఆఫ్ఘన్ పాప్ స్టార్ ఆర్యానా సయీద్..తాలిబన్ టెర్రరిస్టులకు పాకిస్తాన్ మద్దతునిస్తోందని మండిపడింది.
కాబూల్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడి నుంచి పారిపోయిన ప్రముఖ ఆఫ్ఘన్ పాప్ స్టార్ ఆర్యానా సయీద్..తాలిబన్ టెర్రరిస్టులకు పాకిస్తాన్ మద్దతునిస్తోందని మండిపడింది. అదే సమయంలో ఆప్ఘన్ దేశానికి ఇండియా ‘ట్రూ ఫ్రెండ్’ అని ప్రశంసించింది. ఎక్కడో అజ్ఞాత ప్రదేశం నుంచి ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె.. అఫ్గానిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంలో పాక్ పాత్ర ఎంతయినా ఉందని ఆరోపించింది. ఇందుకు నిదర్శనంగా ఎన్నో ఏళ్లుగా తాము పలు వీడియోలను చూశామని తెలిపింది. పాక్ ఆదేశాలతో తాలిబన్లు పని చేస్తున్నారని, వారికి ఆ దేశం శిక్షణనిస్తోందని ఆమె పేర్కొంది. తాలిబన్ల స్థావరాలు పాక్ లో ఉన్నాయి. అక్కడే వారు ట్రెయినింగ్ పొందుతున్నారు.. అని ఆర్యానా సయీద్ వెల్లడించింది. అంతర్జాతీయ దేశాలు వీరికి నిధులను ఇవ్వడం ఆపివేయాలని ఆమె డిమాండ్ చేసింది. పాకిస్థాన్ కు కూడా నిధులు ఇవ్వరాదని.. వారు వీటిని తాలిబాన్లకు అందజేస్తున్నారని ఆమె దుయ్యబట్టింది. ఆఫ్ఘన్ సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని కోరింది. పాక్ వల్లే ఆఫ్ఘన్ సంక్షోభం తలెత్తిందన్న విషయాన్ని విస్మరించరాదని ఆర్యానా వ్యాఖ్యానించింది.
ఆఫ్ఘన్ ప్రజలను ఆదుకుంటున్న ఇండియాను ఆమె ప్రశంసలతో ముంచెత్తింది. ఇండియాను నిజమైన ఫ్రెండ్ గా పేర్కొంటూ ..భారత ప్రజలు ఆఫ్ఘన్లకు ఎంతో సాయం చేస్తుంటారని ఆమె వెల్లడించింది. లోగడ ఇండియాలో ఉన్న ఆఫ్ఘన్లు తనకు చాలాసార్లు ఈ విషయాలు చెప్పినట్టు ఆర్యానా సయీద్ పేర్కొంది. ఇండియాకు నా కృతజ్ఞతలని ఆమె వ్యాఖ్యానించింది. ఈమె తన స్వదేశమైన టర్కీ వెళ్లినట్టు తెలుస్తోంది. తాలిబన్లు కాబూల్ ని ఆక్రమించిన రెండు మూడు రోజులకే ఈమె అమెరికా కార్గో విమానం ఎక్కేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: కాబూల్ నుంచి ఇండియా చేరిన గురు గ్రంథ్ సాహిబ్ గ్రంథాలు.. గురుద్వారా చేర్చిన కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి