US Firing: అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ.. హై స్కూల్ కాల్పులు.. నిందితుడి సహా ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు
మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లోని సెంట్రల్ విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ హైస్కూల్‌లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 16 ఏళ్ల బాలిక, 61 ఏళ్ల మహిళ అక్కడిక్కడే మరణించారు.
అగ్రరాజ్యం అమెరికాలో మళ్ళీ తుఫాకీ గర్జించింది. ఓ హైస్కూల్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. మిస్సోరిలోని సెయింట్ లూయిస్ హై స్కూల్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఉదయం మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లోని సెంట్రల్ విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ హైస్కూల్‌లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 16 ఏళ్ల బాలిక, 61 ఏళ్ల మహిళ అక్కడిక్కడే మరణించారు.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పారిపోతున్న నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన నిందుతుడు కూడా మరణించాడు.
సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడిని 19 ఏళ్ల ఓర్లాండో హారిస్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం ఉన్నత పాఠశాల నుండి పట్టభద్రుడైన మాజీ విద్యార్థి అని చెప్పారు. అంతేకాదు హారిస్‌కు ముందస్తు నేర చరిత్ర లేదని, సోమవారం రాత్రి “అతను మానసిక అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నల్టు తెలిపారు.
ఏడుగురు బాధితులు, 15 నుండి 16 సంవత్సరాల వయస్సు గలవారేనని.. ప్రస్తుతం గాయాలతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. అయితే పాఠశాల భవనం తలుపులకు తాళంవేసి ఉన్నాయని… మరి నిందితుడు స్కూల్ లోపలికి ఎలా వచ్చాడనే విషయంపై స్పష్టత లేదన్నారు.
సెయింట్ లూయిస్ స్కూల్స్ సూపరింటెండెంట్ కెల్విన్ ఆడమ్స్ ప్రకారం.. ఏడుగురు సెక్యూరిటీ గార్డులు పాఠశాలలో ఉన్నారు. స్కూల్‌లోకి ప్రవేశించేందుకు నిందితుడు చేసిన ప్రయత్నాలను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారని, వెంటనే ఇతర సిబ్బందికి సమాచారం అందించారని అధికారులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..