Afghanistan: మసీదులో భారీ పేలుడు.. 23 మంది దుర్మరణం.. మృతుల్లో మత గురువు సైతం..
తాలిబన్ల రాజ్యంలో ఐసిస్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అఫ్గానిస్థాన్ (Afghanisthan) లోని హెరాత్ పట్టణంలో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో గుజర్గా ప్రాంతంలోని ఓ మసీదులో..

తాలిబన్ల రాజ్యంలో ఐసిస్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అఫ్గానిస్థాన్ (Afghanisthan) లోని హెరాత్ పట్టణంలో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో గుజర్గా ప్రాంతంలోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పేలుడు (Bomb Blast) తీవ్రత భారీగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చనిపోయిన వారిలో మతగురువు ముజీబ్-ఉల్ రెహ్మాన్ అన్సారీ కూడా ఉన్నారు. షియా వర్గానికి చెందిన అన్సారీ తరచూ ఐసిస్‌ను (ISIS), అఫ్గాన్ సర్కారును విమర్శిస్తుంటారు. అందుకే ఆయన్ని ఉగ్రవాదులు హతమార్చారని అనుమానిస్తున్నారు. ఉప ప్రధాన మంత్రి ముల్లా బరాదర్ దాడి నుంచి తృటిలో తప్పంచుకున్నారు. పేలుడు ఘటనకు కొద్ది సేపటి ముందు ముల్లా బరాదర్, ముజీబ్ రెహమాన్ ఇద్దరూ భేటీ అయ్యారు. హెరాత్ మసీదుపై ఆత్మాహుతి దాడి వెనుక ఐసిస్ హస్తం ఉంది. ఈ పేలుడుకు బాధ్యత వహిస్తూ ఐసిస్ ప్రకటన కూడా చేసింది.
అఫ్గాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐసిస్ దాడులు పెరిగిపోయాయి. మసీదులు, బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లు సర్వసాధారణమైపోయాయి. ఐసిస్ ఉగ్రవాదులు షియాలను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు. శుక్రవారం రద్దీగా ఉండే ప్రార్థనాలయాలను, మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెళ్లిపోయిన తర్వాత దేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని భావిస్తే ఇందుకు భిన్నంగా హింసాత్మక ఘటనలు మరింతగా పెరిగాయి. తాలిబన్లతో సమానంగా ఎదిగేందుకు ఐసిస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు వర్గాలకు మధ్య కోల్డ్ వారు నడుస్తున్నట్లు అర్థమవుతోంది.
కాగా.. గతంలోనూ అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. స్థానిక ఖైర్ ఖానా ప్రాంతంలోని ఓ మసీదులో సాయంత్రం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మసీదు ఇమామ్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కాబుల్ఉత్తర ప్రాంతంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని, పేలుడు తీవ్రతకు సమీపంలోని భవనాల కిటికీలు ధ్వంసమైనట్లు స్థానికులు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే దర్యాప్తు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, పూర్తి వివరాలు సేకరించాయి.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి