చెత్త బుట్టలో కోట్లు.. తాత ఇంట్లో మారిన మనమడి తలరాత.. కానీ తండ్రి ఇచ్చిన షాక్‌తో..
ఒక పేద వెయిటర్ రాత్రికిరాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. చనిపోయిన తన తాత ఇంట్లో అనుకోకుండా కోట్ల విలువైన షేర్ సర్టిఫికెట్లు దొరికాయి. అయితే ఆ మనవడు సంతోషం ఎక్కుస సేపు నిలవలేదు. అతడి ఆనందానికి తండ్రి అడ్డుపడ్డాడు. దీంతో ఈ కౌన్ బనేగా కరోడ్ పతి అంశాన్ని హైకోర్టు తేల్చనుంది.

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరూ ఊహించలేరు. కొంతమంది ఉన్నట్లుండి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు. తాజాగా అటువంటి ఘటనే గుజరాత్‌లో జరిగింది. ఒక పేద కుటుంబానికి చెందిన వ్యక్తికి అనుకోకుండా పెద్ద అదృష్టం తగిలింది. తన తాత ఇంట్లో రూ.2.5 కోట్ల విలువైన షేర్ సర్టిఫికెట్లు దొరికాయి. కానీ ఈ అదృష్టం ఆ కుటుంబంలో పెద్ద గొడవకు కారణమైంది. సావ్జీ పటేల్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఉనా గ్రామంలోని ఆయన ఇల్లు మనవడికి వారసత్వంగా వచ్చింది. ఆ మనవడు డయ్యూలో వెయిటర్‌గా పనిచేసేవాడు. ఇంటిని శుభ్రం చేస్తుండగా చెత్తబుట్టలో కొన్ని కాగితాలతో పాటు షేర్ సర్టిఫికెట్లు దొరికాయి. వాటి విలువ అక్షరాలా రూ. 2.5 కోట్లు అని తేలింది. దీంతో ఆ మనవడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.
వారసుడు ఎవరో తేల్చాలి
సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ షేర్లకు తానే యజమానిని అని మనవడు వాదిస్తున్నాడు. ఎందుకంటే ఆ సర్టిఫికెట్లు తనకు వారసత్వంగా దక్కిన ఇంట్లోనే దొరికాయి. కానీ ఆ మనవడి తండ్రి అడ్డు పడ్డాడు. తాను తాతకు కొడుకుని కాబట్టి, ఈ షేర్లకు నిజమైన వారసుడు తానే అని వాదించాడు. ఈ విధంగా తండ్రి, కొడుకు ఇద్దరూ ఆ డబ్బుపై హక్కు కావాలని గొడవ పడ్డారు.
కోర్టులో కేసు
చివరు ఈ గొడవ కోర్టుకు చేరింది. వారసుడు ఎవరో, ఆ కోట్ల సంపద ఎవరికి చెందాలి అనే విషయాన్ని కోర్టు తేల్చనుంది. గుజరాత్ హైకోర్టు ఈ కేసును నవంబర్ 3న విచారించనుంది. ఆ డబ్బు చివరికి తండ్రికి దక్కుతుందా లేక మనవడికి దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి..
