America: మృతుని ఇంట్లో 125 పాములు.. 14 అడుగుల కొండచిలువ కూడా.. అసలేం జరిగిందంటే..
అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలోని చార్లెస్ కౌంటీ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒక వ్యక్తి జీవిస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్లు కూడా అతనితో సన్నిహితంగా మెలుగుతుంటారు.
అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన అక్కడి పోలీసులతో పాటు స్థానికులను నిర్ఘాంతపరిచింది. స్థానికంగా ఓ ఇంట్లో ఒంటరిగా నివసించే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం.. అతని మృతదేహం చుట్టూ 125 పాములు సంచరిస్తూ ఉండడం తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికులు అందించిన సమాచారం మేరకు చార్లెస్ కౌంటీ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటున్నాడు. చుట్టుపక్కల వాళ్లు కూడా అతనితో సన్నిహితంగా మెలుగుతుంటారు. అయితే ఇంట్లో ఒక్కడే నివసించే ఆ వ్యక్తి అనూహ్యంగా కనిపించకుండా పోయాడు. రెండు రోజుల పాటు అతను ఇంటి నుంచి బయటకు రాలేదు . దీంతో ఇంటి పక్కన నివసిస్తున్న మరో వ్యక్తికి అనుమానం వచ్చింది. ఏం జరిగిందో తెలుసుకుందామన ఇంట్లోకి వెళ్లి చూశాడు. అక్కడ అతను నేలపై అనుమానాస్పదంగా మృతి చెంది ఉండడం చూసి షాక్ కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అతని మరణానికి కారణం ఏమై ఉంటుందోనని ప్రాథమిక ఆధారాల కోసం ఇల్లంతా గాలించారు. అప్పుడే ఇంటిలోని ర్యాక్‌లు తీయగా పుట్టల కొద్దీ పాములు బయటకు వచ్చాయి. దీంతో అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు.
14 అడుగులు కొండ చిలువతో పాటు..
ఆ ఇంటిలో సుమారు 125 పాములున్నట్లు పోలీసులు కనుగొన్నారు. అందులో విషం లేనివి , అత్యధిక విషమున్న పాములూ ఉన్నాయి. స్పిట్టింగ్ కోబ్రాలు, బ్లాక్ మాంబాలు, 14 అడుగుల పొడవున్న కొండచిలువ, ఇతర సరీసృపాలు ఉన్నాయి. కాగా చనిపోయిన ఈ వ్యక్తి ఈ పాములను పెంచుకుంటున్నట్లు సమాచారం. పోలీసులు తమ సహాయక సిబ్బందితో ఆ పాములన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అమెరికాలో విషపూరిత పాములను సేకరించడం చట్ట విరుద్ధమైన చర్య. ఈక్రమంలో ఇన్ని రకాల పాములను సేకరించడం, ఇంట్లో పెంచుకోవడం చాల అరుదైన సంఘటన అని అక్కడి అధికారులు చెబుతున్నారు.
కాగా ఆ ఇంట్లోని కొన్ని పాములు తప్పించుకుపోయాయని చుట్టుపక్కల వారు తెగ భయపడుతున్నారు. దీనిపై అక్కడి అధికారులు స్పందిస్తూ ‘ఇంట్లోని పాముల్లో ఏవీ తప్పించుకోలేదని, అన్నింటినీ తాము స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
Also Read: Coronavirus: తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం.. భారీగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులు..
Signature: మీకు తెలుసా.. అక్కడ ఏ లావాదేవీలకు సంతకంతో పనిలేదు.. మరేం చేస్తారంటే..