AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వింత దొంగతనం..! అర్ధరాత్రి ఇంట్లోదూరి.. కుక్క నోటికి టేప్‌ వేసిమరీ చోరీ!

భారీ వర్షాన్ని, ఇంట్లో నడుస్తున్న కూలర్‌ శబ్దాన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు ముందుగా పెంపుడు కుక్క నోటికి టేప్‌ వేశారు. అనంతరం మూడు గదుల తాళాలు పగులగొట్టి సుమారు విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.40 వేల నగదును దోచుకెళ్లారు. ఈ వింత దొంగతనం స్థానికంగా కలకలం రేపింది..

వింత దొంగతనం..! అర్ధరాత్రి ఇంట్లోదూరి.. కుక్క నోటికి టేప్‌ వేసిమరీ చోరీ!
Thieves Silence Pet Dog With Tape Before Robbery
Srilakshmi C
|

Updated on: Aug 29, 2026 | 8:16 PM

Share

బీహార్‌, ఆగస్ట్‌ 29: బీహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో దొంగలు చేసిన ఓ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లోకి చొరబడిన దొంగలు ముందుగా అక్కడ కట్టేసి ఉన్న పెంపుడు కుక్క నోటికి టేప్‌ వేశారు. అది మొరిగి ఇంట్లోని వారిని, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయకుండా ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో, ఇంట్లో కూలర్‌ శబ్దాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు తమ పని పూర్తి చేసినట్లు బాధిత కుటుంబం తెలిపింది. ఈ ఘటన ఔరంగాబాద్‌ జిల్లా ముఫస్సిల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భర్వార్‌ గ్రామంలో అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. గ్రామం మధ్యలోనే ఇల్లు ఉండటంతో చోరీ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు అలోక్‌ సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం..

అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి..

ఘటన జరిగిన సమయంలో తాను, తన భార్య వేర్వేరు గదుల్లో నిద్రిస్తున్నామని తెలిపారు. రక్షాబంధన్‌ సందర్భంగా పిల్లలు సోదరి ఇంటికి వెళ్లారు. అతని తల్లిదండ్రులు, మేనకోడలు కూడా బంధువుల ఇంట్లో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. బయట భారీ వర్షం కురుస్తుండటంతో చుట్టుపక్కల పెద్దగా శబ్దాలు వినిపించని పరిస్థితిని వారు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో కూలర్‌ కూడా నడుస్తుండటంతో దాని శబ్దం విన్న దొంగలు ముందుగా ఇంటి ఆవరణలోకి వెళ్లారు. అక్కడ కట్టేసి ఉన్న పెంపుడు కుక్క నోటికి టేప్‌ వేశారు. దీంతో కుక్క మొరగలేకపోయింది. ఆ తర్వాత దొంగలు ఇంట్లోని మూడు గదుల తాళాలను పగులగొట్టి లోపలికి వెళ్లి విలువైన వస్తువుల కోసం వెతికారు. దొంగలు రెండు గోద్రెజ్‌ అల్మారాలు, రెండు ఇనుప ట్రంకులను పగులగొట్టారు. వాటిలోని వస్తువులను చిందరవందర చేశారు. సుమారు రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.40 వేల నగదు అపహరణకు గురైందని బాధిత కుటుంబం తెలిపింది.

ఉదయం నిద్రలేచిన తర్వాతే కుటుంబ సభ్యులకు చోరీ జరిగిన విషయం తెలిసింది. గదుల్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని చూసి వారు షాక్‌కు గురయ్యారు. చోరీ విషయం గ్రామంలో వేగంగా వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు బాధితుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఓరా పంచాయతీకి చెందిన సామాజిక కార్యకర్త, భవిష్యత్‌ పంచాయతీ అభ్యర్థిగా చెప్పబడుతున్న విక్రమ్‌ కుమార్‌ సింగ్‌ అలియాస్‌ రాజా కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దొంగలను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని ఆయన పోలీసులను, అధికారులను కోరారు. అలాగే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉంటుందని, గ్రామం నడిబొడ్డునే ఇలాంటి చోరీ జరగడం స్థానిక భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ముఫస్సిల్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది భర్వార్‌ గ్రామానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు అలోక్‌ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని, తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. భారీ వర్షాన్ని, కూలర్‌ శబ్దాన్ని ఆసరాగా చేసుకుని.. ముందుగా కుక్క నోటికి టేప్‌ వేసి ఆపై ఇంట్లో చోరీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Follow Us