AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇది కదా నిజమైన రాఖీ పండుగ.. బిచ్చగాడికి రాఖీ కట్టిన విద్యార్థిని.. మైండ్‌బ్లాక్ గిఫ్ట్!

హైదరాబాద్‌లో రాఖీ పౌర్ణమి నాడు ఓ కాలేజీ విద్యార్థిని యాచకుడికి రాఖీ కట్టడం అందరినీ కదిలించింది. తనను సోదరుడిగా భావించినందుకు ఆ యాచకుడు విద్యార్థినికి ఊహించని బహుమతిగా సెల్‌ఫోన్ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బుకు మించి మానవ సంబంధాలు, ఆప్యాయత ఎంత విలువైనవో ఈ సంఘటన చాటి చెప్పింది. ఇది రాఖీ పండుగకు అసలైన అర్థాన్ని ఆపాదించింది.

Viral Video: ఇది కదా నిజమైన రాఖీ పండుగ.. బిచ్చగాడికి రాఖీ కట్టిన విద్యార్థిని.. మైండ్‌బ్లాక్ గిఫ్ట్!
Student's Kindness To Beggar
Balaraju Goud
|

Updated on: Aug 29, 2026 | 12:28 PM

Share

హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా ఓ కాలేజీ విద్యార్థిని చేసిన చిన్న పని ఇప్పుడు అందరి మనసులను కదిలిస్తోంది. రోడ్డు పక్కన భిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తిని సోదరుడిగా భావించి అతడి చేతికి రాఖీ కట్టింది యువతి. ఆ తర్వాత జరిగిన ఘటనతో భావోద్వేగానికి గురైంది. తనకు చేతనైనంత సాయం చేస్తే చాలని భావించిన ఆమెకు.. ఆ వ్యక్తి ఊహించని కానుక ఇవ్వడంతో ఈ ఘటన ప్రత్యేకంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో కాలేజీకి వెళ్తున్న ఓ విద్యార్థిని రోడ్డు పక్కన భిక్షాటన చేస్తున్న వ్యక్తిని గమనించింది. సాధారణంగా చాలామంది అతడిని చూసి వెళ్లిపోతుంటారు. కానీ ఆ విద్యార్థిని మాత్రం అతడి దగ్గరకు వెళ్లింది. అతడిని సోదరుడిగా భావించి చేతికి రాఖీ కట్టింది. ఆమె చేసిన పనికి ఆ వ్యక్తి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. తనను కూడా ఒక కుటుంబ సభ్యుడిలా చూసినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపాడు. డబ్బు లేదా ఇతర సహాయం కంటే ఆ క్షణంలో తనకు లభించిన ఆప్యాయతే ఎంతో విలువైనదిగా భావించినట్లు అతడి స్పందన కనిపించింది.

‘అన్నయ్య’గా భావించిన యువతికి ప్రత్యేక కానుక

రాఖీ కట్టిన అనంతరం విద్యార్థిని అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. ఆ వ్యక్తి ఆమెను ఆపాడు. తన వద్ద ఉన్న వస్తువుల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. తాను పెద్దగా ఏమీ ఇవ్వలేనప్పటికీ.. తన సోదరిగా భావించి ఈ చిన్న కానుకను స్వీకరించాలని కోరాడు. తాను ఇచ్చిన బహుమతి విలువ ఎంత అన్నది ముఖ్యం కాదని.. అందులో ఉన్న ప్రేమే ముఖ్యమని ఆ వ్యక్తి చెప్పిన తీరు విద్యార్థినిని కదిలించింది. తనకు రాఖీ కట్టినందుకు ప్రతిగా అతడు ఇచ్చిన ఆ కానుకను ఆమె ఎంతో ఆప్యాయంగా స్వీకరించింది. తెరిచి చూస్తే, విలువైన సెల్‌ఫోన్ కనిపించింది. దీంతో ఆమె భావోద్వేగానికి లోనైంది.

డబ్బు కాదు.. బంధం ముఖ్యం

ఈ ఘటనలో అందరినీ ఆకట్టుకున్న విషయం డబ్బు కాదు.. ఇద్దరు అపరిచితుల మధ్య ఏర్పడిన ఆత్మీయత. రోడ్డు మీద భిక్షాటన చేస్తున్న వ్యక్తిని చాలామంది కేవలం ‘బిచ్చగాడు’గా చూస్తే.. ఆ విద్యార్థిని మాత్రం అతడిలో ఓ అన్నను చూసింది. అదే విధంగా తనకు రాఖీ కట్టిన యువతిలో అతడు ఓ చెల్లిని చూశాడు. రాఖీ పండుగ అసలు సందేశం కూడా ఇదే. రక్త సంబంధం లేకపోయినా.. మనసుతో ఏర్పడే బంధానికి విలువ ఉంటుందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విద్యార్థినిని అభినందిస్తున్నారు. ‘మనిషిని అతడి పరిస్థితిని బట్టి కాకుండా మనసుతో చూడాలి’, ‘రాఖీ బంధానికి ఇదే అసలైన అర్థం’, ‘చిన్న రాఖీ.. పెద్ద మానవత్వం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక చిన్న రాఖీతో మొదలైన ఈ పరిచయం.. ఊహించని కానుకతో అందమైన జ్ఞాపకంగా మారింది. మన దగ్గర ఎంత ఉందన్నది కాదు.. ఎదుటివారికి మనం ఎంత ఆప్యాయతను పంచగలమన్నదే అసలైన సంపద అని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us