వరదల్లో కొట్టుకొచ్చిన బ్యాంక్ లాకర్.. ఓపెన్ చేసి చూడగా.. లోపల..!
నేపాల్ లో ఘోర విపత్తు వేళ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం విరాళాలు సేకరిస్తున్న సమయంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వరదల్లో ఓ బ్యాంకు లాకర్ కొట్టుకొచ్చింది. లాకర్ ను గుర్తించిన కొందరు స్థానికులు ఇళ్లకు తీసుకెళ్లి పగలగొట్టారు. ఆ తర్వాత ఏమైందంటే.. ?

నేపాల్‌లో ఆకస్మిక వరదలు సృష్టించిన బీభత్సం భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఊళ్లకు ఊళ్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఘోర విపత్తు వేళ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం విరాళాలు సేకరిస్తున్న సమయంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వరదల్లో ఓ బ్యాంకు లాకర్ కొట్టుకొచ్చింది.
బ్యాంకులో నగదు, విలువైన డాక్యుమెంట్లు భద్రపరిచే పెద్ద ఇనప్పెట్టె (సేఫ్) కొన్ని కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయింది. రసువా జిల్లాలో భోటే కోశి నదీ ఉప్పొంగి సంభవించిన వరదల్లో ఓ బ్యాంకు లాకర్ కొట్టుకువచ్చింది. అది ధాడింగ్ జిల్లాలోని నదీ తీరంలో కనిపించింది. లాకర్ ను గుర్తించిన కొందరు స్థానికులు ఇంటికి తీసుకెళ్లి పగలగొట్టారు. అందులో ఉన్న నగదును దోచుకెళ్లిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ఆరోపణలు ఎదుర్కొన్న 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 92,68,505 నేపాలీ రూపాయలు అంటే భారత కరెన్సీలో రూ. 57 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరికొందరు అనుమానితులు ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
మరో షాకింగ్ ఘటనలో, మానవత్వానికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసారు. నారాయణి నదిలో వరద ప్రవాహానికి ఓ మహిళ కొట్టుకొచ్చింది. ఆమె జుట్టు పట్టుకుని నదీ తీరానికి ఈడ్చుకొచ్చారు ఇద్దరు వ్యక్తులు. బాధితురాలి మృతదేహం నుంచి బంగారు చెవిపోగులు దొంగిలించారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు చెవిపోగుల్లా కనిపిస్తున్న వాటిని ఆ వ్యక్తులు తొలగిస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ కావడంతో ఈ అరెస్టులు జరిగాయి.
मृतकको कानको मुन्द्रा चोरी गर्ने व्यक्तिहरु नियन्त्रणमा लिएको सम्बन्धमा । pic.twitter.com/pnPlnQPn9j
— Nepal Police (@NepalPoliceHQ) August 27, 2026
భయానక వరదలకు సంబంధించి నేపాల్ విపత్తు సంస్థ గణాంకాలను సవరించింది. శనివారం 2,426 మంది గల్లంతైనట్లు ప్రకటించింది. మరణాల సంఖ్య 626కి పెరిగినట్లు తెలిపింది. తాజా వివరాల ప్రకారం గల్లంతైన వారిలో నేపాలీల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలిసింది. శుక్రవారం 1,924 మంది గల్లంతైనట్లు ప్రకటించగా, ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. గల్లంతైన విదేశీయుల సంఖ్య 517గానే ఉందని జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ సంస్థ తెలిపింది.