AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకు కోసం తండ్రి 5 లక్షల కిలోమీటర్ల ప్రయాణం.. ఎట్టకేలకు హ్యాపీ ఎండింగ్.. ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..

Kidnap:ఈ భూమిపై తల్లిదండ్రులకు.. తమ పిల్లలను మించింది ఏదీ లేదు. వారి జీవితం ఎలా ఉన్నప్పటికీ తమ పిల్లల జీవితం మాత్రం సాఫీగా..

కొడుకు కోసం తండ్రి 5 లక్షల కిలోమీటర్ల ప్రయాణం.. ఎట్టకేలకు హ్యాపీ ఎండింగ్.. ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..
Son And Father
Shiva Prajapati
|

Updated on: Jul 14, 2021 | 4:33 PM

Share

Kidnap:ఈ భూమిపై తల్లిదండ్రులకు.. తమ పిల్లలను మించింది ఏదీ లేదు. వారి జీవితం ఎలా ఉన్నప్పటికీ తమ పిల్లల జీవితం మాత్రం సాఫీగా ఉండాలని, ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తుంటారు. కొందరు తల్లిదండ్రులు అయితే, తమ పిల్లలను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. ఇలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లలను కోల్పోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఓ తండ్రి. ఏకంగా 24 ఏళ్లు.. మిస్ అయిన తన కొడుకు కోసం ఓ తండ్రి నరకయాతన అనుభవించాడు. తప్పిపోయిన కొడుకు కోసం ఓ తండ్రి దాదాపు 24 సంవత్సరాలు కంటిమీద కునుకు లేకుండా వెతికాడు. దాదాపు ఐదు లక్షల కిలోమీటర్లు ప్రయాణించాడు. రోడ్లపైనే నిద్రించాడు. డబ్బులు అయిపోతే అడుక్కున్నాడు. అలా తన కొడుకు జాడ తెలుసుకునేందుకు ఎవరూ చేయని అసాధారణ ప్రయత్నం చేశాడు. తన కొడుకును గుర్తించే క్రమంలో.. అపహరణకు గురైన మరో ఏడుగురు చిన్నారులను రక్షించి వారి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చాడు. అయితే, 24 ఏళ్ల అతని అసాధారణ ప్రయత్నానికి విధి సైతం తలవంచింది. చివరికి ఆ తండ్రి నిరీక్షణ ఫలించింది. తన కొడుకు ఆచూకీ లభించింది. కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకుని అతని చెంతకు చేరాడు ఆ తండ్రి. 2 ఏళ్ల వయస్సులో తప్పిపోయిన కొడుకు 24 వయస్సులో కనిపించడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన గువొ గ్యాంగ్‌టాంగ్‌ కొడుకును కొందరు కిడ్నాప్ చేశాడు. అపహరణకు గురైనప్పుడు అతని వయస్సు రెండేళ్లు. ఇద్దరు నిందితులు ఈ పిల్లవాడిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. కానీ, పిల్లవాడి ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయారు. గువో గ్యాంగ్‌టాంగ్ కొడుకు ఇంటి బయట ఆడుకుంటుండగా.. నిందితులిద్దరూ అతన్ని కిడ్నాప్ చేశారు. ఆ తరువాత అతన్ని హైనాన్ ప్రావిన్స్‌కు తీసుకెళ్లి.. అక్కడ వేరే వారికి విక్రయించారు. అయితే, తన కొడుకు అపహరణకు గురవడంతో ఆ గువో గ్యాంగ్‌టాంగ్ తట్టుకోలేకపోయాడు. తన కొడుకు కోసం తిరగని ప్రాంతం లేదు. వెతకని ప్రదేశం లేదు. గువో తన కొడుకు కోసం దాదాపు 20 ప్రావిన్సులను జల్లెడ పట్టాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. పైగా ఈ ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలకు, దోపిడీలకు గురయ్యాడు గువో. అతనికి సంబంధించిన ఎన్నో మోటార్ బైక్స్ ధ్వంసం అయిపోయాయి. ఇలా 24 ఏళ్లు తన కొడుకు కోసం వెతికాడు.

ఈ 24 ఏళ్ల వెతుకులాటలో అతను.. ఎదుర్కొన్న పరిస్థితులు, అతని జీవన గమనం అత్యంత దయనీయం అనే చెప్పాలి. తప్పిపోయిన తన కొడుకు ఫోటోను బ్యానర్స్ చేయించి పంపిణీ చేశాడు. నిరంతర ప్రయాణంలో రాత్రి అయితే వంతెనల కింద, ఫుట్‌పాత్‌పై నిద్రించేవాడు. ఒకవేళ తన వద్ద డబ్బు అయిపోతే.. ప్రజలను బిక్షం అడుక్కునేవాడు. ఈ క్రమంలో పిల్లలను కోల్పోయిన బాధితుల సమూహానికి గువో ముఖ్య నాయకుడిగా మారాడు. కొడుకు కోసం అతను సాగించిన ప్రయాణంలో దాదాపు ఏడుగురు పిల్లలను.. వారి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చాడు. అయితే, గువో వేదన.. సోషల్ మీడియాను, మీడియాను సైతం కదిలించింది. గువో ప్రయత్నానికి వారు సైతం సహకారం అందించారు. చివరగా అందరి ప్రయత్నాలు ఫలించాయి. గువో కుమారుడు హైనాన్‌లో నివసిస్తున్నట్లు ఎట్టకేలకు గుర్తించారు. ఈ విషయాన్ని గువో, అతని భార్యకు తెలియజేశారు. ఈ వార్త విన్న గువో కళ్లల్లో కన్నీళ్లు ఆగలేదు. 2 ఏళ్ల వయస్సులో తప్పిపోయిన కొడుకును 24 తరువాత చూడటంతో.. ఉబ్బితబ్బిబైపోయారు ఆ తల్లిదండ్రులు. వారు కలిసిన క్షణంలో మాటల్లేవు. కేవలం ఆనందబాష్పాలే వారి భావాలను వ్యక్తపరిచాయి. గువో తన కొడుకును హత్తుకుని కన్నీరు పెట్టారు. అయితే, గువో గ్యాంగ్‌టాంగ్ కొడుకుని డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించడం విశేషం.

కాగా, గువో, అతని కొడుకు కలిసి క్షణంలో మీడియా సైతం అక్కడే ఉంది. గువోకి, అతని కొడుక్కి అభినందనలు తెలిపారు. కాగా, గువో, అతని కొడుకు కలిసిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పలువురు నెటిజన్లు. ఈ వార్త ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. గువో అసాధారణ ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెబుతూనే.. వారికి అభినందనలు తెలిపారు. కొడుకు కలిసిన నేపథ్యంలో గువో జీవితం ఇకపైగా హ్యాపీగా సాగాలని ఆకాంక్షించారు.

Also read:

Zomato IPO: మార్కెట్‌లో జొమాటో ఐపీఓ దూకుడు.. మొదటి రెండు గంటల్లోనే 36 శాతం సబ్​స్ట్రిప్షన్లు.. తొలి రోజు ఎంతంటే..

Viral Photo: అనుష్క శర్మ సెల్ఫీ వైరల్.. అందరి దృష్టి వాచ్ పైనే.. ధర తెలిస్తే… షాకవ్వాల్సిందే!

Hyderabad Gunfire: హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు గన్‌ఫైర్.. కాల్పులకు తెగబడ్డ సెక్యూరిటీ గార్డు..!