AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆ ఊరి జనంతో పాటు పశువులకు కూడా మెడకు ఇవి ఉంటాయ్.. ఎందుకో తెల్సా..?

మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దు గ్రామాలను చిరుత పులుల దాడులు వణికిస్తున్నాయి. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టీ), తిర్యాణి మండలాలను చిరుత సంచారం వణికిస్తోంది. అటు మహారాష్ట్రాలోను చిరుత పులుల దాడులు నిత్యకృత్యంగా మారాయి. అయితే చిరుత దాడుల నుండి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు మహారాష్ట్ర వాసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తాతల కాలం నాటి కఠిన ఆచారాన్ని పాటించి తమ ప్రాణాలు నిలుపుకునేందుకు సిద్ధమయ్యారు.

Viral: ఆ ఊరి జనంతో పాటు పశువులకు కూడా మెడకు ఇవి ఉంటాయ్.. ఎందుకో తెల్సా..?
Self Defense
Naresh Gollana
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 13, 2025 | 5:52 PM

Share

మహారాష్ట్రాలోని జల్గాం జిల్లా జామ్నీర్ తహాసీల్ పింపర్ ఖేడ్ ప్రాంతంలో చిరుతపులుల దాడులు పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు కఠిన నిర్ణయం తీసుకున్నారు. చిరుత నుండి ప్రాణాలు కాపాడుకునేందుకు మెడకు ముళ్ల కంచెలాంటి ఉచ్చును‌ ధరించడం ప్రారంభించారు. దీంతో చిరుత దాడి నుండి ప్రాణాలు కాపాడుకోవడం సులువు అవుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఆ గ్రామంలో పది రోజుల వ్యవదిలో చిరుత దాడిలో ముగ్గురు చనిపోవడంతో ప్రజలు స్వీయ-రక్షణకు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా చిరుతలు మెడను టార్గెట్ చేస్తాయి. అందుకే తమ మెడలకు ఇనుప ముళ్లులున్న కంచెలు ఏర్పాటు చేసుకుని స్వీయ రక్షణ పొందుతున్నామని చెప్తున్నారు అక్కడి ప్రజలు. ఈ మెడ ఉచ్చులు తమ ప్రాణాలు కాపాడతాయని బలంగా నమ్ముతున్నారు అక్కడి ప్రజలు. గ్రామంలోని శునకాలు, పశువులకూ సైతం వీటిని ఏర్పాటు చేయడంతో పాటు పొలం పనులకు వెళ్లినప్పుడూ తాము కూడా ధరిస్తున్నామంటున్నారు అక్కడి రైతులు, ప్రజలు.

ఇటు కొమురంభీం జిల్లా ప‌రిధిలోని ఇటుక‌ల్‌ప‌హాడ్ గ్రామ శివార్ల‌లో ఓ చిరుత పులి సంచారం భయాందోళనకు గురి చేస్తోంది. పత్తి పనులకు వెళ్లిన కూలీల కంట పడింది చిరుత. దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన కూలీలు అక్కడి నుండి ఇళ్లకు పరుగులు తీశారు. ఇదే జిల్లాలోని తిర్యాణీ మండలంలో సైతం చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గడిచిన రెండు రోజుల వ్యవధిలో రెండు చోట్ల దాడి చేసి మూడు పశువులను హతమార్చింది. తిర్యాణి మండలంలోని దేవాయిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని తోయగూడెం గ్రామానికి చెందిన మాడావి సోముకు చెందిన రెండు ఆవుల పై చిరుత పులి దాడి చేసి హతమార్చగా తాజాగా మంగళవారం కైరిగూడ గ్రామానికి చెందిన ఊరడీ ధర్మయ్యకు చెందిన ఆవు దూడ మేతకు వెళ్లగా సాయంత్రం తిరిగి వస్తుండగా చిరుతపులి దాడి చేసి హతమార్చినట్లు స్థానిక రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్ర త‌డోబా అంధేరి టైగ‌ర్ రిజ‌ర్వ్ నుంచి ఈ చిరుత తెలంగాణ‌లోకి ప్ర‌వేశించి ఉండొచ్చ‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. చిరుత సంచారం నేప‌థ్యంలో గ్రామ‌స్తులు, ప‌శువుల కాప‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. మేత కోసం ప‌శువుల‌ను అడ‌విలోకి తీసుకెళ్లొద్ద‌ని, ప‌త్తి ఏరే క్ర‌మంలో కూలీలు శబ్దాలు చేస్తూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. అటు‌ మహారాష్ట్ర లో అవలంభిస్తున్న స్వీయ రక్షణ చర్యలపై కొమురంభీం జిల్లాలోను చర్చ మొదలైంది. చిరుత నుండి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పింపర్ ఖేడ్ వాసులను ఫాలో అవక తప్పదేమో అని భావిస్తున్నారు ఇక్కడి చిరుత సంచార గ్రామాల ప్రజలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..