AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“అమెరికాస్ గాట్ టాలెంట్”లో ఫైనల్స్ కు చైనా రోబోలు! వీడియో ఇదిగో!

ఒకవైపు డ్యాన్సర్.. మరోవైపు హ్యూమనాయిడ్ రోబోలు..సంగీతం స్టార్ట్ అయింది.. స్టేజ్‌పై కదలికలు మొదలయ్యాయి. డ్యాన్స్‌తో పాటు కుంగ్‌ఫూ తరహా కిక్స్, పంచ్‌లు, బ్యాక్‌ఫ్లిప్స్.. ప్రేక్షకులకు ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మనుషులతో పోటీగా రోబోలు కూడా అచ్చం డ్యాన్సర్లలా కదులుతుండటంతో షో మొత్తం ఆసక్తికరంగా మారిపోయింది. ఈ సీన్‌ ‘America’s Got Talent’ వేదికపై కనిపించింది. చైనీస్ డ్యాన్సర్ వు యుఫెయ్ (Wu Yufei)తో కలిసి Unitree G1 హ్యూమనాయిడ్ రోబోల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అమెరికాస్ గాట్ టాలెంట్''లో ఫైనల్స్ కు చైనా రోబోలు! వీడియో ఇదిగో!
Chinese Robots Dance Their Way To Americas Got Talent Finale
Sharada V
|

Updated on: Sep 24, 2026 | 6:54 PM

Share

స్టేజ్‌పై వు యుఫెయ్, అతని బృందంలోని Unitree G1 రోబోలు కలిసి సమన్వయంతో డ్యాన్స్ చేశారు. మనుషుల డ్యాన్సర్లతో సమానంగా రోబోలు కూడా కదలికలను ప్రదర్శించాయి. సింక్రనైజ్డ్ డ్యాన్స్ మూవ్స్‌తో పాటు కిక్స్, పంచ్‌లు, కుంగ్‌ఫూ స్ఫూర్తితో రూపొందించిన స్టెప్పులు, బ్యాక్‌ఫ్లిప్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రోబోలు సంప్రదాయ చైనీస్ దుస్తులను కూడా ధరించాయి. దీంతో ప్రదర్శనలో ఆధునిక రోబోటిక్స్‌తో పాటు చైనా సంస్కృతికి సంబంధించిన అంశాలు కూడా కనిపించాయి. ఒక్కసారిగా గేమ్ మారిపోయింది. ఇప్పటికే వు యుఫెయ్, Unitree రోబోలు ‘America’s Got Talent’ సీజన్ 21 ఆడిషన్స్‌లో పాల్గొన్నాయి. ఆ తర్వాత క్వార్టర్‌ఫైనల్స్‌లో మరోసారి స్టేజ్‌పైకి వచ్చాయి.

అక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది.

రోబోలు, డ్యాన్సర్ల ప్రదర్శనకు న్యాయనిర్ణేత సోఫియా వెర్గారా ఫిదా అయ్యారు. ఆమె తన లైవ్ గోల్డెన్ బజర్‌ ను ఉపయోగించడంతో Unitree బృందం నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. అంటే ఇక ఈ రోబోలు కేవలం టెక్నాలజీ ప్రదర్శనగా కాకుండా.. 1 మిలియన్ డాలర్ల బహుమతి కోసం పోటీపడే ఫైనలిస్టులుగా మారిపోయాయి.

“అవి యంత్రాల్లా అనిపించడం లేదు”

రోబోలతో కలిసి పనిచేయడం తనకూ కొత్త అనుభవాన్ని ఇచ్చిందని వు యుఫెయ్ చెప్పాడు. మొదట్లో అవి కేవలం ప్రాణంలేని యంత్రాలుగా అనిపించేవని.. కానీ వాటితో ఎక్కువ సమయం డ్యాన్స్ చేసిన తర్వాత తన ఆలోచన మారిందని తెలిపాడు. రోబోలతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఒక రకమైన టీమ్ స్పిరిట్ అనిపిస్తోందని, స్టేజ్‌పై మనిషి-రోబోల మధ్య సరైన సమతుల్యత సాధించడం ఒక ప్రత్యేక అనుభూతి అని వివరించాడు.

మనిషికి ఏడాది పడితే.. రోబోకు?

వు యుఫెయ్ చెప్పిన మరో విషయం ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తిని రేపుతోంది. ఒక మనిషి కొత్త డ్యాన్స్ స్టైల్ నేర్చుకుని అందులో నైపుణ్యం సాధించడానికి ఒకటి, రెండేళ్లు పట్టొచ్చని చెప్పాడు. కానీ రోబోల విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఒక రోబో కొత్త కదలికను నేర్చుకున్న వెంటనే.. అదే సామర్థ్యాన్ని మిగతా రోబోలు కూడా పొందగలవని చెప్పాడు. అందుకే రోబోలు జ్ఞానాన్ని, కదలికలను అత్యంత వేగంగా పునరావృతం చేయగల సామర్థ్యం కలిగి ఉండటం తనకు కొంత భయంగా అనిపించిందని వు యుఫెయ్ అన్నాడు.

ఇక ఫైనల్‌లో ఏం చేస్తాయి?

డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్, రోబోటిక్స్‌ను కలిపి అమెరికా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బృందం ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు అందరి చూపూ ఫైనల్ ప్రదర్శన పైనే ఉంది.మనుషులతో కలిసి డ్యాన్స్ చేసిన ఈ రోబోలు.. ఇప్పుడు 1 మిలియన్ డాలర్ల టైటిల్ కోసం జరిగే తుది పోరులో ఎలాంటి ప్రదర్శన ఇస్తాయో చూడాలి!

మరిన్ని ట్రెండింగ్ వీడియోలకు క్లిక్ చేయండి

Follow Us