AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: నాట్యానికే జీవితాన్ని అంకితం చేసిన టాలీవుడ్ హీరోయిన్..

తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు పొందిన నటి, నర్తకి శోభన జీవితం విశేషమైనది. పెళ్లి చేసుకోకుండా నాట్యానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఈ అరుదైన నటి బాలనటిగా ప్రవేశించి, అనేక విజయాలు సాధించి, జాతీయ పురస్కారాలు అందుకున్నారు. దత్తత ద్వారా తల్లిగా మారి, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరింపబడ్డ శోభన ప్రయాణం స్ఫూర్తిదాయకం.

Tollywood:  నాట్యానికే జీవితాన్ని అంకితం చేసిన టాలీవుడ్ హీరోయిన్..
Actress
Ram Naramaneni
|

Updated on: Sep 24, 2026 | 6:49 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న ఎందరో నటీమణులలో నటి, నర్తకి శోభన స్థానం అరుదైనది. విశాలమైన నేత్రాలు, ఆకర్షణీయమైన వర్చస్సు, చూడగానే చూపులను కట్టిపడేసే రూపం, దానికి తగ్గ లావణ్యం, అద్భుతమైన అభినయం, ఆకట్టుకునే నాట్యం – ఇవన్నీ శోభనను తెలుగువారికి మరింత చేరువ చేశాయి. తెలుగు చిత్రాలతోనే శోభన ఒక నటిగా తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పాలి. పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని నాట్యానికి అంకితం చేసిన ఈ విలక్షణ నటి జీవిత విశేషాలు, ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తాయి. శోభన పూర్తి పేరు శోభన చంద్రకుమార్ పిళ్ళై. 1970 మార్చి 20న కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఆమె, ట్రావెన్కోర్ సిస్టర్స్‌గా పేరుపొందిన ప్రఖ్యాత నటీమణులు లలిత, పద్మిని, రాగిణీలకు మేనకోడలు కావడం విశేషం. ప్రముఖ మలయాళ నటి సుకుమారి ఆమెకు దగ్గర బంధువు.

రెండేళ్ల ప్రాయంలో రాజేష్ ఖన్నా నటించిన అమర్ ప్రేమ్ సినిమాలో ఒక చిన్న సన్నివేశంలో కనిపించిన శోభన, ఆ తర్వాత 1980లో నటీమణి కే.ఆర్. విజయ ప్రోత్సాహంతో మంగళనాయకి చిత్రంలో బాలనటిగా నటించారు. ఈ సినిమా శతదినోత్సవ వేడుకల్లో అమితాబ్ బచ్చన్ ఆమెను బేబీ శోభనగా గుర్తించడం ఒక మధురానుభూతి. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం భక్త ధ్రువ మార్కండేయ. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి తీసిన ఈ బాలల చిత్రంలో శోభన ధ్రువుని తల్లిగా నటించారు. ఈ సినిమాతోనే ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న శోభన, ఆ తర్వాత ఐదేళ్ల పాటు సినిమాలకు విరామం ఇచ్చి చదువు, నృత్యంపై దృష్టి పెట్టారు. మలయాళ సంప్రదాయ కుటుంబంలో పుట్టినా మద్రాసులో పెరిగిన శోభన, చిన్ననాటి నుంచి నృత్యం పట్ల ఆసక్తి చూపలేదు. అయితే, ఆమె తల్లి ప్రోత్సాహంతో భరతనాట్యంలో గొప్ప పేరు పొందిన శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ వద్ద శిష్యురాలిగా చేరారు. 15 ఏళ్ల వయసు వచ్చేసరికి నృత్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించి, తన గురువుతో కలిసి అనేక దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే సినీ రంగంలోకి ప్రవేశించినా, చదువుపై పట్టుదలతో ప్రైవేట్‌గా చదివి 1989లో వైజాగ్‌ సెంటర్‌లో ఇంటర్ పరీక్ష రాసి ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. శోభన కథానాయికగా నటించిన తొలి సినిమా 1984లో మలయాళంలో వచ్చిన ఏప్రిల్ 18. దర్శకుడు బాలచంద్ర మీనన్, శోభన బంధువు సుకుమారి సలహాతో శోభనను కథానాయికగా పరిచయం చేశారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. తెలుగులో శోభన నటించిన తొలి చిత్రం అక్కినేని నాగార్జున హీరోగా పరిచయమైన విక్రమ్. అయితే, విడుదలైన తొలి సినిమా భానుచందర్ హీరోగా నటించిన దాగుడుమూతలు. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. చిరంజీవి తొలి సొంత సినిమా రుద్రవీణలో, రౌడీ అల్లుడు చిత్రంలో చిరంజీవితో జతకట్టారు. బాలకృష్ణ సరసన మువ్వగోపాలుడు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. నిప్పురవ్వ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో బాలకృష్ణతో కలిసి చిందులు వేసి అలరించారు. నాగార్జున సరసన నేటి సిద్ధార్థ, రక్షణ; వెంకటేశ్ సరసన అజేయుడు, త్రిమూర్తులు; మోహన్ బాబు సరసన అల్లుడుగారు, రౌడీ గారి పెళ్ళాం, గేమ్ వంటి చిత్రాల్లో నటించారు. హీరోలు కృష్ణ, రాజేంద్రప్రసాద్, భానుచందర్, కార్తీక్ వంటివారితోనూ నటించి తన బహుముఖ ప్రజ్ఞను చాటారు.

ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో కనిపించి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మలయాళంలో మణిచిత్రతాఝు చిత్రంలో ద్విపాత్రాభినయంతో మెప్పించి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. దక్షిణాదిలో నాలుగు భాషల్లోనూ నటించిన శోభన, సినిమాల్లో పోటీ పెరిగి అవకాశాలు తగ్గుముఖం పట్టే సమయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి జోలికి వెళ్లకుండా తనకు ఎంతో ఇష్టమైన నాట్యకళకు తన జీవితాన్ని అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. అప్పటి నుంచి నాట్య కళారాధనలో నిమగ్నమై, దేశ విదేశాల్లో భరతనాట్య ప్రదర్శనలు ఇస్తున్నారు. శోభన చెన్నైలోని తేనాంపేట, శ్రీమాన్ శ్రీనివాస కాలనీలో తన తల్లితో కలిసి ఉంటున్నారు. రెండంతస్తుల ఈ భవంతిలో కింది పోర్షన్‌లో డాన్స్ స్కూల్ నిర్వహిస్తూ, పై పోర్షన్‌లో నివసిస్తున్నారు. పిల్లలు లేరనే లోటు లేకుండానే ఏడేళ్ల క్రితం ఒక అనాథ బాలికను దత్తత తీసుకుని ఆమెకి అనంత నారాయణి అని పేరు పెట్టుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్న శోభన, 56 ఏళ్ల వయసులోనూ ఎంతో చురుకుగా ఉంటూ రోజుకు నాలుగు గంటల పాటు నృత్య సాధన చేస్తారు. ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియని అద్భుత నటిగా, నిత్య నర్తకిగా శోభన కళాప్రస్థానం నిస్సందేహంగా ప్రశంసనీయం.

View this post on Instagram

A post shared by Surjith S (@surjithtrails)

Follow Us